ఉడుకే ఉడుకు..
38 డిగ్రీల నమోదు
వారంలో ఇదే అధికం
కొనసాగుతున్న ఉష్ణతాపం
విశాఖపట్నం: ఎండ పగబట్టినట్టుగా కాస్తోంది. ఏకధాటిగా సెగలు కక్కుతోంది. రోజురోజుకు ఉష్ణతీవ్రత పెంచుకుంటూ పోతోంది. వారం రోజులుగా జనాన్ని బెం బేలెత్తిస్తున్న భానుడు శుక్రవారం మరింత భగభగలాడాడు. దీంతో విశాఖలో 38 (37.8) డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. సాధారణంకంటే ఇది 5 డిగ్రీలు అధికం. వారం రోజుల్లో ఇదే అత్యధికం కావడం మరో విశేషం. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపించింది. ఒకపక్క ఆకాశంలో మేఘాలున్నా నిప్పులు కురిసిన అనుభూతే కలిగింది. అదే మబ్బులు లేకుండా ఉంటే ఇంకెంతటి వేడిని వెదజల్లి ఉండేదోనంటూ జనం నిట్టూర్చారు. వేడిగాలులు, ఉష్ణతీవ్రతకు జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చే సాహసం చేయలేకపోయారు. దీనికి ఉక్కపోత కూడా తోడయింది.
రోజంతా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పుడప్పుడూ గాలులు వీస్తున్నా ఉక్కపోత వల్ల వచ్చే చెమటను నియంత్రించలేకపోయాయి. బంగాళాఖాతంలో ఆవర్తనమో, అల్పపీడనమో వచ్చి ఉడుకు తగ్గిస్తేనే తప్ప ఉపశమనం కలిగే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నేడో, రేపో అది అల్పపీడనంగా మారనుంది. అదే జరిగితే ఉత్తరాంధ్రలో వాతావరణాన్ని చల్లబరచి తేలికపాటి వానలు కురిసే వీలుంది. ఇప్పుడు విశాఖ వాసులంతా ఎంత త్వరగా ఉష్ణతీవ్రత తగ్గుతుందా? అని కొండత ఆశతో ఎదురు చూస్తున్నారు.
వారంలో నమోదైన ఉష్ణోగ్రతలు
తేది ఉష్ణోగ్రత (డిగ్రీలలో)
12.07.15 34.8
13.07.15 36.6
14.07.15 36.8
15.07.15 36.8
16.07.15 36.6
17.07.15 37.8