
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం
జనగామ, దేవరకద్ర మార్కెట్లలో కొట్టుకుపోయిన ధాన్యం
పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు
వడగండ్ల వానకు నేలరాలిన మామిడి కాయలు, వరి, మొక్కజొన్న
వేర్వేరు చోట్ల పిడుగులు పడి రైతు, గొర్రెల కాపరి, విద్యార్థి మృత్యువాత..
పంటనష్టం జరిగిందంటూ ఓ రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి, నెట్‌వర్క్: క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో పలు జిల్లాల్లో అకాలవర్షం కురిసింది. గురువారం గాలి దుమారంతో ప్రారంభమై.. ఓ మోస్తరు వర్షం కురిసింది. వడగండ్లతో రైతులకు కడగండ్లు మిగిలాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. మూడుచోట్ల పిడుగులు పడి ముగ్గురు చనిపోయారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసింది. వడగండ్ల వానకు మామిడి కాయలు నేలరాలాయి. వరి చేలు నేలకొరిగాయి. ఆత్మకూర్(ఎం)లో కరెంట్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలి దుమారానికి పలుచోట్ల ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. గుండాలలో బండపై రైతులు ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: ఎడపల్లి మండలం బాపూనగర్‌లో వడగండ్లు పడ్డాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. బలమైన గాలులకు ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులతో వరితోపాటు మొక్కజొన్న, జొన్న పంటలు నేలవాలాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా: పలు మండలాల్లో ఈదురుగాలులు, వర్షానికి ధాన్యం పొలాల్లోనే రాలిపోయింది. మొక్కజొన్న నేలవాలింది. గంభీరావుపేట మండలం గజసింగవరంలో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. వేములవాడ మండలం నాగాయపల్లి శివారులో గాలివానకు పడిపోయిన చెట్లను బ్లూ కోల్ట్స్ తొలగించారు.
జనగామ జిల్లా: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో 600 బస్తాల వరకు ధాన్యం తడిసిపోగా, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట దెబ్బతింది. గాలి దుమారంతో 11 కేవీ విద్యుత్ లైన్లపై చెట్లు విరిగి పడిపోవడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా నంగునూరు, చిన్నకోడూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల ధాటికి కొన్ని గ్రామాల్లో చెట్లు నేలకూలగా, పొలాల్లోనే గింజలు రాలడంతో వరి మొక్కకు పిలకలే మిగిలాయి. మొక్కజొన్న, మిర్చి, టమాట, కూరగాయ పంటలు నేలకొరిగాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా : దేవరకద్ర మార్కెట్‌లో వేలం వేసిన ధాన్యం కుప్పలు తడిపోయాయి. రైతులు కవర్లు కప్పినా.. అప్పటికే చాలా ధాన్యం తడిసి ముద్దయ్యిది. కొల్లాపూర్‌లో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి.
నిర్మల్ జిల్లా: పలు మండలాల్లో ఈదురు గాలులతోపాటు రాళ్ల వర్షం కురిసింది. దీంతో కోతకు వచ్చిన పంటలు నేలవాలాయి. ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. మొక్కజొన్న తడిసి ముద్దయ్యింది.కల్లాల్లో అరబెట్టిన మక్కలు కొంత మేరకు తడిసిపోయాయి.
రైతు ఆత్మహత్యాయత్నం
ములుగు జిల్లా మొట్లగూడెం గ్రామానికి చెందిన యాలం నర్సింహారావు తనకున్న ఐదెకరాలతోపాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు సాగు చేశాడు. మరో మూడు రోజుల్లో వరి పంట కోయాల్సి ఉండగా.. ఈనెల 7న సాయంత్రం వడగళ్ల వాన పడింది. దీంతో వరి చేనులో గింజకూడా లేకుండా రాలిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. అప్పులు తీర్చే మార్గం లేక నర్సింహారావు బుధవారం రాత్రి తన ఇంటికి సమీపాన ఉన్న పొలం వద్దకు పురుగుల మందుతాగాడు. ఉదయాన్నే స్థానికులు గుర్తించి ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండండి : సీఎం రేవంత్‌రెడ్డి
ఆకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు వివిధ జిల్లాల్లో కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.
ముగ్గురి ప్రాణం తీసిన పిడుగులు
వేర్వేరు జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నేలపోగుల గ్రామానికి చెందిన రైతు మందాడి రవీందర్‌రెడ్డి(55) రోజు మాదిరిగానే గురువారం గేదెలను మేపడానికి వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుమారుడు సంకీర్తరెడ్డి వ్యవసాయబావి వద్దకు వెళ్లి చూడగా విగతజీవుడై పడి ఉన్నాడు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో పిడుగు పడిందని, దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు గుర్తించారు.
– సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గంగారాం గ్రామానికి చెందిన సంపత్‌కుమార్ అలియాస్ సతీశ్(19), జశ్వంత్, కార్తీక్‌లు సదాశివపేట మండల పరిధిలోని గొల్లగూడెంలోన ఓ కాలేజీలో ఐటీఐ చదువుతున్నారు. క్లాస్‌లు ముగిశాక ఒకేపై ముగ్గురూ స్వగ్రామానికి బయలు దేరారు. వర్షం ఎక్కువ కావడంతో సిద్దాపూర్–గొల్లగూడెం శివారులోని మైసమ్మ కట్ట వద్ద బైక్‌ను నిలిపి సంపత్‌కుమార్, జశ్వంత్ చింత చెట్టు కింద నిల్చున్నారు. కార్తీక్ మరో చెట్టు కింద నిలబడ్డాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడి సంపత్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, జశ్వంత్‌కు తీవ్రగాయాలు అయ్యాయి.
– నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ఆమలూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మేకల రాములు(55) గ్రామ సమీపంలో తన గొర్రెలను మేపుతుండగా.. అకస్మాత్తుగా గాలి దుమారంతో వర్షం కురిసింది. రాములు పక్కనే పిడుగుపడడంతోఅక్కడికక్కడే మృతిచెందగా ఆయన కుమారుడు నరసింహకు తీవ్ర గాయాలయ్యాయి. ఆలేరు మండలం మంతపురిలో పిడుగుపాటుకు గేదె మృతి చెందింది.