ఆహారంలోని పోషకాలు ఒంటబట్టాలంటే..! | Malabsorption Syndrome: Causes Symptoms And Risk | Sakshi
Sakshi News home page

పోషకాలు ఒంటికి పట్టకపోవడానికి కారణం ఏంటో తెలుసా..!

Published Tue, Jan 28 2025 7:51 AM | Last Updated on Tue, Jan 28 2025 8:03 AM

Malabsorption Syndrome: Causes Symptoms And Risk

ఆహారం తీసుకున్న తర్వాత అందులోని పోషకాలు ఒంటికి పట్టకపోవడం అన్న కండిషన్‌ను ‘మాల్‌ అబ్జార్‌ప్షన్‌’ అంటారు. జీర్ణవ్యవస్థలోని ఇన్ఫెక్షన్లు లేదా ఇతర అనేక కారణాల వల్ల ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియలో అందులోని పోషకాలు ఒంటికి పట్టకపోవచ్చు. కొన్నిసార్లు ప్రత్యేకంగా ఏదో ఓ అంశమే ఒంటికి పట్టకపోవచ్చు కూడా. ఉదాహరణకు లాక్జేజ్‌ అనే ఎంజైము లోపం వల్ల పాలు ఒంటికి పట్టకపోవచ్చు. ఈ కండిషన్‌ను లాక్టోజ్‌ ఇన్‌టాలరెన్స్‌ అంటారు. కొందరిలో ‘సీలియాక్‌ డిసీజ్‌’ లేదా ‘క్రోన్స్‌ డిజీస్‌’ అనే రుగ్మతలు ఉన్నప్పుడు ఆహారంలోని అన్ని పోషకాలూ ఒంటికి పట్టకపోవచ్చు. అయితే కారణాలను బట్టి మాల్‌ అబ్జార్‌ప్షన్‌కు చికిత్స అందించాల్సి ఉంటుంది. పోషకాలు ఒంటికి పట్టని ఈ కండిషన్‌ గురించి తెలుసుకుందాం. 

ఒంటికి పట్టకపోవడం అనే కండిషన్‌ కొన్ని సాధారణ పరిస్థితుల కారణంగా రావచ్చు లేదా కొన్నిసార్లు కొన్ని శరీర నిర్మాణపరమైన కారణాలతోనూ ఇలా జరగవచ్చు. 

మాల్‌ అబ్జార్‌ప్షన్‌ ఎందుకు, ఎలా? 
తిన్న ఆహారం ఒంటికి పట్టకపోవడం ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు పేగుల్లో ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ ఎలా జరుగుతుందనే పరిజ్ఞానం కొంత అవసరం. సాధారణ పరిస్థితుల్లో ఆహారం జీర్ణమై, ఒంటికి పట్టడాన్ని మూడు దశలుగా చెప్పవచ్చు. అవి... 
1) ల్యూమినల్‌     2) మ్యూకోజల్‌     3) పోస్ట్‌ అబ్జార్‌ప్టివ్‌ ఈ మూడు దశల్లో ఎక్కడ లోపం జరిగినా అది మాల్‌ అబ్జార్‌ప్షన్‌కు దారితీయవచ్చు. 

ల్యూమినల్‌   దశలో..
ఆహారంలోని కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు... ఇవన్నీ జీర్ణవ్యవస్థల్లోని ఎంజైములు, బైల్‌లో కలిసి, దాదాపు కరిగిన స్థితిలో ఉంటాయి. 

ల్యూమినల్‌ దశలో లోపాలకు 
ఈ దశలో లోపాలకు ప్రధానంగా ప్రాంక్రియాస్‌ గ్రంథికి ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రాంక్రియాటైటిస్, ఏవైనా కారణాలతో ప్రాంక్రియాస్‌ గ్రంథి తొలగింపు, ప్రాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ లేదా దేహంలోని కణాలను దెబ్బతీసే సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌ కారణంగా జరుగుతుంది. దీనివల్ల కొవ్వులను జీర్ణం చేసే లైపేజ్‌ అనే ఎంజైము తగ్గడంతో కొవ్వులు, ప్రోటీన్లు ఒంటికి పట్టవు.

అలాగే ఏవైనా చిన్నపేగు సర్జరీలు జరగడం వల్ల... పైత్యరసం (బైల్‌)తోపాటు ప్రాంక్రియాటిక్‌ ఎంజైములు... జీర్ణం కావాల్సిన ఆహారంతో సరిగా, పూర్తిగా కలవకపోవడంతోనూ జీర్ణప్రక్రియలో అంతరాయంతో ఆహారం ఒంటికి పట్టకపోవచ్చు.

ఇక చాలా అరుదుగా కొన్నిసార్లు ట్రిప్సినోజెన్, ఎంటెరోజైనేజ్‌ అనే ఎంజైములను ప్రేరేపించాల్సిన ప్రోఎంజైములు చురుగ్గా లేనందువల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం (అజీర్తి) లేదా తిన్నది ఒంటికి పట్టక΄ోవడం జరగవచ్చు. 

ఆహారపు ముద్ద... ఓ అరిగిపోయే ద్రవంగా రూపొందకపోవడం (ఇంపెయిర్‌డ్‌ మిసెల్లీ ఫార్మేషన్‌) : ఇది అనేక కారణాల వల్ల జరగవచ్చు. ఉదాహరణకు... 

కాలేయం దెబ్బతినడం వల్ల లేదా సిర్రోసిస్‌ కారణంగా తగినంత బైల్‌ సాల్ట్స్‌ ఉత్పన్నం కాకపోవడం. స్రవించాల్సిన పైత్య రసానికి (బిలియరీ జ్యూసెస్‌కు) ఏదైనా అడ్డంకి ఏర్పడటం లేదా కోలోయోస్టాటిక్‌ జాండీస్‌ అనే కామెర్ల కారణంగా. 

ఏవైనా కారణాలతో చిన్న పేగులను శస్త్రచికిత్సతో తొలగించిన పరిస్థితుల్లో పైత్యరస ప్రవాహం సరిగా లేకపోవడం (ఎంటరోపాథిక్‌ బైల్‌ సర్క్యులేషన్‌) చిన్నపేగుల్లో బ్యాక్టీరియా చాలా ఎక్కువగా పేరుకుపోవడంతో పైత్యరసంలో ఉండే సంక్లిష్టమైన నిర్మాణంలోంచి గ్లైసిన్‌ / టారిన్‌ అనే అమైనో యాసిడ్స్‌ తాలూకు మాలెక్యూల్స్‌ను తొలగించడం. దీన్నే బైల్‌ సాల్ట్‌ డీ కాంజ్యుగేషన్‌ అంటారు. 

ఇక కొన్నిసార్లు చిన్నపేగుల నిర్మాణ లోపాలతో అక్కడ జీర్ణమైన ఆహారపు కదలికలు సరిగా లేకపోవడం వల్ల, ఆహారపు ముద్ద ఏదైనా కారణాలతో కలుషితం కావడం వల్ల (స్మాల్‌ బవెల్‌ కంటామినేషన్‌), ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా అనూహ్యంగా చాలా ఎక్కువగా పెరిగి΄ోవడం వల్ల జరిగే అంతరాయాలతో...  ఈ అన్ని కారణాలతో తిన్నది ఒంటికి పట్టకపోవచ్చు. 

జీర్ణమైన ఆహారాన్ని తీసుకునే లోపలి పొరలోని లోపాలతో లేదా అక్కడ ఉండే బ్యాక్టీరియా (ల్యూమినల్‌) పెరిగిపోయి, ఆహారం ఇంకడానికి అడ్డంకిగా మారడంతో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు (ఉదాహరణకు విటమిన్‌–బి12, ఫోలేట్‌) లాంటివి జీర్ణమయ్యే సామర్థ్యం తగ్గడంతోనూ తిన్నది ఒంటికి పట్టకపోవచ్చు. ఇక విటమిన్‌ బి12 ఒంటికి పట్టకపోవడం అన్నది ప్రాంక్రియాటిక్‌ ఎంజైముల లోపం వల్ల జరగవచ్చు.

మ్యూకోజల్‌ దశలో..
ఆహారాన్ని దేహంలోకి ఇంకింపజేసుకునేందుకు / లాక్కునేందుకు వీలుగా పేగుల్లోని ఎపిథీలియమ్‌ కణాలనేవి ఓ పొరలా ఏర్పడి ఉంటాయి. ఇవన్నీ మైక్రో విల్లై అనే చేతివేళ్లలాంటి నిర్మాణాలపై అమరి ఉంటాయి. 

  • ఆహారం జీర్ణమయ్యేందుకు చాలా ఎక్కువ ఉపరితలం అవసరమయ్యేలా మైక్రోవిల్లీ అనే వేళ్లవంటి నిర్మాణాల్లో లోపం వల్ల. 

  • డైశాకరైడేజ్‌ అనే ఎంజైము లోపం వల్ల డైశాకరైడ్స్‌ అనే చక్కెరలు సరిగా జీర్ణకాకపోవడం. ల్యాక్జేజ్‌ అనే ఎంజైము లోపంతో పాలు సరిగా అరగకపోవడం.

  • ఇమ్యూనో గ్లోబ్యులిన్‌ ఎ లోపం వల్ల కొన్ని రకాల పిండి పదార్థాలు జీర్ణం కాకపోవడం. కార్బోహైడ్రేజ్‌ అనే ఎంజైము లోపం (సుక్రేజ్, ఐసోమాల్జేట్‌ వంటి వాటి లోపం)తో పిండిపదార్థాల్లోని చెక్కరలు సరిగా అరగకపోవడం.

పోషకాలు ఇంకే ప్రక్రియ సరిగా జరగకపోవడం (ఇంపెయిర్డ్‌ న్యూట్రియెంట్‌ అబ్జార్‌ప్షన్‌) : పుట్టుకతో వచ్చే కొన్ని జన్యులోపాలతోను లేదా ఆ తర్వాత వచ్చే మరికొన్ని సమస్యలతోనూ ఇలా పోషకాలు దేహంలోకి ఇంకే ప్రక్రియ సరిగా జరగకపోవచ్చు. పుట్టుకతోనే వచ్చే లోపాల గురించి చెప్పాలంటే అది గ్లుకోజు–గెలాక్టోజు సరిగా ఒంటబట్టకపోవడం వంటివి. ఇక ఆ తర్వాత వచ్చే సమస్యలంటే... జీర్ణమైన ఆహారాన్ని ఒంటిలోకి ఇంకేలా చేసే ఉపరితలం తగ్గిపోవడం. 

జీర్ణమైన ఆహారాన్ని దేహంలోకి ఇంకేలా చేసుకునే ఉపరితలం దెబ్బతినడం. (సీలియాక్‌ స్ప్రూ, ట్రాపికల్‌ స్ప్రూ, క్రోన్స్‌ డిసీజ్, ఎయిడ్స్‌ ఎంటెరోపతి అనే జబ్బుల్లోనూ అలాగే రేడియేషన్‌ చికిత్స తీసుకునేవారిలో ఇలా జరగవచ్చు. 

లింఫోమా వంటి కేన్సర్లలో దేహంలోకి జీర్ణాహారం ఇంకడం తగ్గుతుంది. జియార్డియా అనే పరాన్న జీవులూ లేదా ఇతర బ్యాక్టీరియా అనూహ్యంగా అపరిమితంగా పెరిగినప్పుడు జీర్ణమైన ఆహారం ఒంటికి పట్టదు. అలాగే విపుల్‌ డిసీజ్, క్రి΄్టోస్పోరాడోసిస్, మైక్రోస్పోరిడియోసిస్‌ వంటి రుగ్మతల్లోనూ తిన్నది ఒంటికి పట్టదు.

అబ్జార్‌ప్టివ్‌ దశలో..
కొవ్వులూ ఇంకా ఇతర కీలకమైన పోషకాలన్నీ లింఫాటిక్‌ ప్రవాహం నుంచి అలాగే ఎపిథీలియల్‌ కణాల ద్వారా రక్తప్రవాహంలోకి చేరి దేహంలోని అన్ని భాగాలకూ చేరుకునే ప్రక్రియ జరుగుతుంది. 

ఒంటికి పట్టే దశ తర్వాతి అంశాల్లో (పోస్ట్‌ అబ్జార్‌ప్టివ్‌ ఫేజ్‌)...
లింఫాటిక్‌ ప్రవాహంలో ఏవైన లోపాలు ఉన్నప్పుడు (ఇలా పుట్టుకతోనే వచ్చే ఇంటస్టినల్‌ లింఫాంజియెక్టాసియా, మిల్రాయ్‌ డిసీజ్‌ వంటి వ్యాధుల కారణంగా జరగవచ్చు). అలాగే కైలోమైక్రోన్స్, లైపోప్రోటీన్స్‌ వల్ల తిన్నది ఒంటబట్టక ప్రోటీన్లను కోల్పోవాల్సి రావచ్చు.

మాల్‌ అబ్జార్‌ప్షన్‌ లక్షణాలు...

  • కడుపు ఉబ్బుగా మారడం 

  • కడుపు పట్టేసినట్లుగా ఉండటం 

  • బరువు తగ్గడం 

  • కొన్నిసార్లు నీళ్ల విరేచనాలు (డయేరియా) 

  • విటమిన్లు, ఖనిజ లవణాల లోపం వల్ల రక్తహీనత (అనీమియా) 

  • చర్మం రంగు పాలిపోయి కనిపించడం ∙జుట్టు ఊడి΄ోవడం 

  • రే–చీకటి

  • విటమిన్‌ కె లోపం కారణంగా రక్తస్రావం జరగటం 

  • తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ / మానసికంగానూ అలసట 

  • ఎముకలు గుల్లబారడం (ఆస్టియోపోరోసిస్‌) 

డాక్టర్‌ విక్టర్‌ వినోద్‌ బాబు సీనియర్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ 

(చదవండి: భారత్‌ యువకుడిని పెళ్లాడిన గ్రీకు అమ్మాయి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement