శివార్లలో సినిమా సిటీ  | KCR Says We Build International Standards Film City At Hyderabad Outskirts | Sakshi
Sakshi News home page

శివార్లలో సినిమా సిటీ 

Published Sun, Nov 8 2020 1:49 AM | Last Updated on Sun, Nov 8 2020 1:49 AM

KCR Says We Build International Standards Film City At Hyderabad Outskirts - Sakshi

శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున. చిత్రంలో ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1,500–2,000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, సినిమా సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైనందున సినిమా షూ టింగులు, సినిమా థియేటర్లు పునఃప్రారం భించవచ్చని సీఎం ప్రకటించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతి భవన్‌లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి–విస్తరణపై చర్చ జరిగింది.

‘తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో షూటింగులు ఆగిపోయి, థియేటర్లు నడవక అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.88 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌లు కొనసాగించాలి. థియేటర్లు కూడా ఓపెన్‌ చేయాలి. తద్వారా చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలను కష్టాల నుంచి బయట పడేయాలి’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో షూటింగ్‌లు ప్రారంభించామని, త్వరలోనే థియేటర్లు కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చిరంజీవి, నాగార్జున చెప్పారు. 

శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి వరద బాధితుల సహాయార్థం విరాళాల చెక్కులను అందజేస్తున్న
సినీనటులు చిరంజీవి, నాగార్జున, మై హోమ్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ రామ్‌. చిత్రంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌


సినిమా సిటీలో స్టూడియోలకు స్థలాలు.. 
‘హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి–విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయి. హైదరాబాద్‌ నగరం కాస్మోపాలిటన్‌ సిటీ. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు, వివిధ భాషలకు చెందిన వారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎవరినైనా ఒడిలో చేర్చుకొనే గుణం ఈ నగరానికి ఉంది. షూటింగులు సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను చాలా సౌకర్యవంతంగా నిర్వహించుకునే వీలుంది. ఇప్పుడున్న వాతావరణానికి తోడు ప్రభుత్వం సినిమా సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నిర్మించాలనే తలంపుతో ఉంది. ప్రభుత్వం 1,500–2,000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకొనేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుంది. ఎయిర్‌ స్ట్రిప్‌తోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్‌ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

సీఎంకు ‘గ్రేటర్‌ వరద’ విరాళాలు.. 
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న హైదరాబాద్‌ నగరంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలకు తమ వంతు సాయంగా మై హోమ్‌ గ్రూప్‌తోపాటు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విరాళాలు అందించారు. ‘మై హోం’తరఫున ఆ సంస్థ డైరెక్టర్‌ రామ్‌ రూ. 5 కోట్లు అందించగా చిరంజీవి రూ. కోటి, నాగార్జున రూ. 50 లక్షల చెక్కును అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement