ఫార్మాసిటీ @ ముచ్చర్ల | Pharmacity @ chat | Sakshi
Sakshi News home page

ఫార్మాసిటీ @ ముచ్చర్ల

Published Thu, Dec 4 2014 2:17 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో బుధవారం భూములకు సంబంధించిన వివరాలను మ్యాప్ ద్వారా సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్న  జిల్లా కలెక్టర్ శ్రీధర్. - Sakshi

రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో బుధవారం భూములకు సంబంధించిన వివరాలను మ్యాప్ ద్వారా సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీధర్.

 కేసీఆర్ నిర్ణయం.. ఫార్మారంగ ప్రతినిధులతో కలసి ఏరియల్ సర్వే
 హైదరాబాద్ ఫార్మా సిటీ
 ఎక్కడ    :    రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల    
విస్తీర్ణం    :    11,000 ఎకరాలు
 పెట్టుబడి    :    రూ. 30,000 కోట్ల పెట్టుబడికి స్థానిక కంపెనీల సంసిద్ధత
 ఉపాధి    :    ప్రత్యక్షంగా, పరోక్షంగా 70,000 మందికి
 ఇంకా    :    పరిశ్రమలతోపాటు ఫార్మా విశ్వవిద్యాలయం, పరిశోధన సంస్థ ఏర్పాటు..    ఉద్యోగులు, కార్మికుల కోసం టౌన్‌షిప్
 
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతం వేదిక కానుంది. ఇక్కడ ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ పేరుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అధునాతన ఫార్మా నగరాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాష్ర్టంలోని ఫార్మా దిగ్గజాలతో కలసి బుధవారం ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే చేశారు. ఫార్మా సిటీకి అవసరమైన స్థలాన్వేషణలో భాగంగా ఉదయం బేగంపేట నుంచి బయలుదేరి వెళ్లి కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామానికి చేరుకున్నారు. విహంగ వీక్షణం ద్వారా సమీప ప్రాంతాలను పరిశీలించారు. ఆమనగల్లు మండల పరిధిలో దిల్ సంస్థకు కేటాయించిన భూములను కూడా తిలకించారు. ఫార్మా, కెమికల్ పరిశ్రమల ఏర్పాటుకు ముచ్చర్ల ప్రాంతం అత్యంత అనువుగా ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తించారు. దీంతో ఈ ప్రాంతాన్ని కేసీఆర్ రెండుసార్లు చుట్టివచ్చారు. అనంతరం అక్కడే పారిశ్రామిక ప్రతినిధులతో గంటసేపు భేటీ అయ్యారు. 11 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ పారిశ్రామికవాడకు ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ పేరును ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఫార్మా పరిశ్రమలతో పాటు ఫార్మా విశ్వవిద్యాలయం, ఫార్మా పరిశోధనా సంస్థను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఫార్మా పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల కోసం ఇక్కడే టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఫార్మా కంపెనీలతో సమీప ప్రాంతాలు కాలుష్యమయం కాకుండా చర్యలు తీసుకుంటామని, పర్యావరణానికి హాని లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

ఫార్మాసిటీలో స్థానిక ఫార్మా కంపెనీలే రూ. 30 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి    లభిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ముచ్చర్ల ప్రాంతం అనువుగా ఉందని వ్యాపారవేత్తలు కూడా అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఫార్మా ప్రతినిధులతో సమావేశం, మధ్యాహ్న భోజనం తర్వాత 2.30 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఫార్మా రంగ దిగ్గజాలైన పార్థసారథిరెడ్డి(హెటిరో), కె.రత్నాకర్‌రెడ్డి(హెటిరో), కె.సతీష్‌రెడ్డి(డాక్టర్ రెడ్డీస్), కె.నిత్యానంద రెడ్డి(అరబిందో), ఎం. నారాయణరెడ్డి(విర్కో), పి.ఈశ్వర్‌రెడ్డి(బీడీఎంఏ), ఎం.ఎస్.ఎన్.రెడ్డి(ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్), సంతోష్(వివి మెడ్ ), డాక్టర్ ఎస్.ఆనంద్(సాగర్ గ్రూప్), ఎం.మోహన్‌రావు(సైనుడ్), వి.కృష్ణారెడ్డి(కృష్ణా డ్రగ్స్) తదితరులు ముఖ్యమంత్రితో పాటు ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ ఎండీ జయేష్‌రంజన్, ఇతర అధికారులు కూడా సీఎం వెంట ఉన్నారు. ఈ పర్యటన వివరాలను తెలియజేస్తూ సీఎం కార్యాలయం ఓ నోట్‌ను విడుదల చేసింది.
 
 తక్షణమే పది వేల కోట్లు పెడతాం

 ఫార్మా సిటీలో తక్షణమే రూ. 10 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు బల్క్‌డ్రగ్స్ ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. ప్రతిపాదిత ఫార్మాసిటీలో మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరిస్తే కొన్నేళ్లలోనే రూ. 30 వేల కోట్ల మేర పెట్టుబడుల్ని ఆకర్శించవచ్చని అంచనా వేసింది. పెద్ద కంపెనీలతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలు కూడా ఏర్పాటయ్యేలా సమీకృత పారిశ్రామికవాడగా ఫార్మాసిటీని తీర్చిదిద్దనున్నట్లు సంఘం అధ్యక్షుడు ఎం. నారాయణరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చొరవ పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. ప్రాజెక్టు ఏర్పాటుకు ముందే పారిశ్రామికవేత్తలతో కలిసి భూములను పరిశీలించడం ద్వారా ఫార్మా రంగానికి రాష్ర్ట ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించారని ప్రశంసించారు. ఫార్మా సిటీ రూపకల్పనకు ప్రభుత్వం త్వరలోనే కన్సల్టెంట్‌ను నియమిస్తుందని ఆయన చెప్పారు. కాగా, పరిశ్రమల ఏర్పాటుకు ముచ్చర్ల ప్రాంతం అనుకూలంగా ఉందని, అమెరికా ఆహార ఔషధ నియంత్రణ(యూఎస్ ఎఫ్‌డీఏ) నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించేందుకు వీలుంటుందని ఫార్మా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ఫార్మాసిటీకి ప్రభుత్వం.. కృష్ణా జలాలను అందిస్తుందని భావిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement