పరిహారం చెల్లింపుపై చర్చలు విఫలం
♦ నక్కర్తమేడిపల్లి భూములు తీసుకోం
♦ నానక్‌నగర్, తాడిపర్తి రైతులతో పరిహారం ఇచ్చే విషయంలో చర్చలు జరుపుతాం
♦ ఆ గ్రామాల్లో రైతులు ఒప్పుకోకపోతే మహబూబ్‌నగర్ జిల్లాలో భూములు తీసుకుంటాం
♦ జేసీ రజత్‌కుమార్‌సైనీ
యాచారం: ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి భూములను తీసుకునేది లేద§ýని, ఆ గ్రామ రైతులు పరిహారం చెల్లింపు విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నందున ఆ భూములను తీసుకునే విషయంలో విత్‌డ్రా అవుతున్నట్లు జేసీ రజత్‌కుమార్‌సైనీ తెలిపారు. ముచ్చర్ల ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి భూముల సేకరణ విషయంలో గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆ గ్రామ రైతులతో జేసీ రెండో దఫా చర్చలు జరిపారు. చర్చల ప్రారంభంలో సర్పంచ్ పాశ్ఛ భాషా మాట్లాడుతూ ఎకరా భూమికి రూ. 15లక్షలు చెల్లిస్తే భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నట్లు జేసీకి తెలియజేశారు. జేసీ కల్పించుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇంతకు ముందు భూమి సేకరించిన గ్రామాల్లో ఇచ్చినట్టుగానే రూ. 8లక్షలు ఇవ్వడానికి సిద్ధమన్నారు. ప్రభుత్వం నింబంధనలకు వ్యతిరేకంగా పైసా కూడా పెంచి ఇచ్చేది లేదన్నారు. ఇంతలోనే కొందరు రైతులు భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.15లక్షలకు పైగా పరిహారం ఇస్తేనే భూములు ఇస్తాం.. లేదంటే భూములిచ్చేది లేదని ఆందోళనకు దిగారు.
దీంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ భూములను తీసుకోం...ఇక నక్కర్తమేడిపల్లి రైతులతో పరిహారం చెల్లింపు విషయంలో చర్చలు జరిపేది లేదని చెప్పి సమావేశం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిపోయారు. అనంతరం సరూర్‌నగర్ ఆర్డీఓ సుధాకర్‌రావు, తహసీల్దార్ పద్మనాభరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. భూసేకరణ విషయంలో నక్కర్తమేడిపల్లి రైతులు మొండిగా వ్యవహరిస్తున్నందున ఆ గ్రామ భూములు తీసుకునే విషయంలో విత్‌డ్రా అవుతున్నట్లు తెలిపారు.యాచారం మండలంలోని భూముల కంటే పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో తక్కువ ధరకు వచ్చే భూములను తీసుకుంటామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే తన తపన తప్పా రైతులకు అన్యాయం చేయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. యాచారం మండలంలో ఎకరా భూమి రూ. 8 లక్షలు పెట్టి కొనుగోలు చేసే బదులు పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో ఎకరా రూ. 3 నుంచి రూ. 4 లక్షలకే ఎకరా భూమిని కొనుగోలు చేస్తామన్నారు. నక్కర్తమేడిపల్లి రైతులతో సమావేశం కూడా నిర్వహించలేదని తెలిపారు. నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాల రైతులతో మాత్రమే సమావేశం అవుతామని తెలిపారు.
రైతుల్లో ఆందోళన
ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి రెవెన్యూ భూములను తీసుకునేది లేదని జేసీ తెలియజేయడంతో ఆ గ్రామ రైతుల్లో ఆందోళన మొదలైంది. జేసీతో సమావేశమైన రైతులు ఒక్కసారిగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. రూ. 8 లక్షలు కాకున్నా కొంచెం పెంచైనా పరిహారం ఇవ్వడానికి జేసీ ఒప్పుకుంటే భూములు ఇస్తామని రైతులు అభిప్రాయానికి వచ్చారు. కొంతమంది రైతులు స్వయంగా జేసీని కలిసి రూ. 8 లక్షలైనా సరే మా భూములిస్తామని జేసీకి చెప్పారు. సర్పంచ్ పాశ్ఛ భాషా, ఉప సర్పంచ్ చిగురింత శ్రీనువాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కర్నాటి రంగారెడ్డి తదితరులు మరోమారు జేసీని కలిసి మీ మాటకు గౌరవం ఇచ్చి భూములు ఇవ్వడానికి త్వరలో గ్రామసభ పెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.