శివారులో వైద్య పరికరాల తయారీ కేంద్రం
హైదరాబాద్: ఐటీ తరహాలోనే ఫార్మా రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. నగర శివారులో 400 ఎకరాల విస్తీర్ణంలో వైద్య పరికరాల తయారీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శామీర్‌పేట జీనోమ్ వ్యాలీలోని బయోలాజికల్ ఈ-లిమిటెడ్ కంపెనీ రూ. 300 కోట్లతో సుమారు 29 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న బయోలాజికల్ సెజ్‌కు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే జీనోమ్ వ్యాలీలోని ఆరోగ్య కేంద్రంతో పాటు క్యాటిలిస్ట్ హబ్‌కు కూడా శంకుస్థాపన చేశారు. ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే వ్యాక్సిన్లలో 20 శాతం హైదరాబాద్ నుంచే తయారుకావడం రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. జీనోమ్ వ్యాలీలో ఉద్యోగుల సౌకర్యార్థం వచ్చే రెండేళ్లలో తూముకుంట వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.