
సాక్షి, హైదరాబాద్: దీక్షాదివస్ సందర్భంగా తెలంగాణ సాధన కోసం 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు వైద్య సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యుల బృందం నాటి సంఘటనలు, అప్పటి భావోద్వేగాలను నెమరు వేసుకున్నారు.
11 రోజులపాటు కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన చెందామని ఆయన ప్రాణానికి ముప్పు కలుగుతుందన్న భయాందోళన తమను వెంటాడేదన్నారు. ఒకవైపు సీఎం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మరో వైపు అప్పటి ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన అనేక రకాల ఒత్తిడిలను తట్టుకోవడం తమకు ఒక సవాలుగా ఉండేదని గుర్తు చేసుకున్నారు.
కేసీఆర్ ఏడు రోజుల తర్వాత కూడా తమ నిరాహార దీక్షను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందేమోనని భయం కలిగిందన్నారు. అయితే ఆయన శారీరకంగా పూర్తిస్థాయిలో బలహీనంగా మారినా, ఆరోజు తన దీక్ష కొనసాగించే ముందు మానసికంగా అత్యంత దృఢంగా ఉండడంతోనే అన్ని రోజులు దీక్ష కొనసాగించగలిగారని ఆ నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చారు.
మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా నిమ్స్ వైద్య బృందం అందించిన సేవలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని కేటీ రామారావు భావోద్వేగంతో అన్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కాపాడుకుంటూనే మరోవైపు కుటుంబ సభ్యులుగా కేసీఆర్ ఆరోగ్యం పట్ల తమకు ఆందోళన ఉండేదన్నారు. ఆయన పట్టుదల, మొండితనం వల్లనే నిరాహార దీక్షను కొనసాగించగలిగారని చెప్పారు.
అయితే ఒక కుటుంబ సభ్యుడిగా అనేక సందర్భాల్లో ఆందోళనకు గురైనప్పుడు నిమ్స్ వైద్య బృందం అందించిన మనోధైర్యం ఎప్పటికీ మరువలేమన్నారు. అత్యంత సంక్లిష్టమైన సంక్షోభ సమయంలో తమ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సజీవంగా నిలిపి స్వరాష్ట్రాన్ని సాకారం చేసేందుకు సహకరించిన వైద్య బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపి వారిని సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment