రాష్ట్రంలో మెడికల్ డివైజ్ పార్కు
మంత్రి కె.తారకరామారావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి వైద్య పరికరాల ఉత్పత్తిని వ్యూహాత్మక రంగంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెడికల్ టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థలు హైదరాబాద్‌ను సందర్శించి పెట్టుబడులకున్న అవకాశాలను పరిశీలించాలని కోరా రు. ప్రభుత్వపరంగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మెడికల్ డివైజ్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలోని మిన్నెసొటా రాష్ట్రంలో జరుగుతున్న మెడ్‌టెక్-2016 సదస్సులో ఆయన పాల్గొన్నారు.
మెడికల్ వైద్య పరికరాల పరిశ్రమకు భారత్ ముఖ్యంగా తెలంగాణ అనువైన ప్రాంతమన్నారు. మెడికల్ డివైజ్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తొలిదశలో 250 ఎకరాల్లో, మలిదశలో వెయ్యి ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ర్టంలో లేనివిధంగా తెలంగాణలో 16 శాతం వృద్ధి రేటు నమోదైందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌ఐపాస్ విధానం విజయవంతమైందన్నారు. ప్రపంచబ్యాంకు తెలంగాణకు టాప్ ర్యాంక్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. భారత్ 80 శాతం వరకు మెడికల్ పరికరాలను దిగుమతి చేసుకుంటోందన్నారు.