సాక్షి, హైదరాబాద్: ముప్ఫై ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న కరోనా వైరస్ రెండేళ్ల క్రితం మహమ్మారిగా మారడం మన అదృష్టమని.. మనిషికి ఏమాత్రం తెలియని వైరస్‌తో ముప్పు వచ్చి ఉంటే ఆ విపత్తును ఊహించలేమని డాక్టర్ డ్రూ వైజ్‌మాన్ అభిప్రాయపడ్డారు. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ వైజ్‌మాన్ గురువారం బయో ఆసియా సదస్సులో భాగంగా అపోలో గ్రూప్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డితో ఒక చర్చలో పాల్గొన్నారు. మోడిఫైడ్ ఆర్‌ఎన్‌ఏ (ఎంఆర్‌ఎన్‌ఏ) టీకా అభివృద్ధిలో డాక్టర్ వైజ్‌మాన్ పరిశోధనలు కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ రూపాంతరంతోనే కరోనా వైరస్ ప్రమాదం తొలగిపోలేదని.. భవిష్యత్‌లో ఈ వైరస్ రూపాంతరాలు విరుచుకుపడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సంప్రదాయ పద్ధతుల్లో టీకాలను అభివృద్ధి చేసేందుకు కూడా అవకాశం లేనంత వేగంగా వైరస్‌లు పుట్టుకురావచ్చని.. దీన్ని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు.
ఎంఆర్‌ఎన్‌ఏ సురక్షితం..
ఎంఆర్‌ఎన్‌ఏ సాయంతో టీకా అభివృద్ధి చేసిన క్రమాన్ని వైజ్‌మాన్ ఈ సందర్భంగా వివరించారు. సాధారణ పరిస్థితుల్లో ఆర్‌ఎన్‌ఏను శరీరంలోకి ఎక్కిస్తే అది కణజాలాన్ని దెబ్బతీస్తుందన్నారు. అందుకే తాము వాటిల్లో మార్పులు చేయడమే కాకుండా.. నానోస్థాయి కొవ్వుకణాల్లో బంధించి టీకాగా ఉపయోగించేలా చేశామని తెలిపారు. ఎంఆర్‌ఎన్‌ఏ టీకా వేగంగా పనిచేస్తుందని, సురక్షితమైందని, డీఎన్‌ఏను మారుస్తుందన్న అపోహల్లోనూ వాస్తవం లేదని వివరించారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఫైజర్, మోడెర్నా కంపెనీలు తయారు చేసిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలను వంద కోట్ల మంది తీసుకున్నారని, ఎలాంటి దుష్ఫలితాలూ దాదాపు కనిపించలేదని తెలిపారు.
అన్ని రూపాంతరాలకూ ఒకే వ్యాక్సిన్...
కరోనా వైరస్ రూపాంతరం చెందడం సహజమని, అల్ఫాతో మొదలై ఒమిక్రాన్ వరకూ ఇది పలు రూపాలు సంతరించుకుందని వైజ్‌మాన్ గుర్తు చేశారు. అయితే వైరస్ తన రూపం మార్చుకున్న ప్రతిసారీ టీకాలు అభివృద్ధి చేయడం అసాధ్యం... అందుకే తాము ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ ఆధారంగా అన్ని రకాల కరోనా రూపాంతరాలపై పనిచేసే టీకాను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కొన్ని టీకాల అభివృద్ధి ఇప్పటికే జరుగుతోందని ప్రాథమిక ఫలితాలు కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయని చెప్పారు. 20 ఏళ్లలో కరోనా మూడుసార్లు (సార్స్, మెర్స్, కోవిడ్ కారక సార్స్–కోవ్–2) మానవాళిపై దాడి చేసిందని, భవిష్యత్‌లోనూ మరో రూపంలో ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు.
ఇతర వ్యాధులకు కూడా...
ఆర్‌ఎన్‌ఏ అనేది సంక్లిష్టమైన పరమాణువు అయినా తయారీ చాలా సులువు అని డాక్టర్ వైజ్‌మాన్ పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని వాడేందుకయ్యే ఖర్చు కూడా తక్కువని తెలిపారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆర్‌ఎన్‌ఏ టీకాలు కరోనాకు మాత్రమే కాదు.. అనేక ఇతర వ్యాధులకూ ఉపయోగించవచ్చు. హెచ్‌ఐవీ మొదలుకొని మలేరియా, ఇన్‌ఫ్లుయెంజా, హెచ్‌ఎస్‌వీ, హెచ్‌సీవీ వ్యాధులకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఫుడ్ అలె ర్జీలు, కేన్సర్ వ్యాక్సిన్లు, మధుమేహం, కీళ్లవాతం వంటి వ్యాధుల చికిత్సలోనూ ఈ ఆర్‌ఎన్‌ఏను వాడవచ్చని.. ఈ దిశగానూ తాము పరిశోధనలు చేస్తున్నామని వివరించారు. గుండెపోటు వంటి సమస్యలకు, శరీరంలో మంట/వాపులను తగ్గించేందుకు కూడా ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీని వాడవచ్చని చెప్పారు. ‘ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీని జన్యుచికిత్సలకూ వాడవచ్చన్నది నా అతిపెద్ద నమ్మకం. సిస్టిక్ ఫైబ్రోసిస్, సికెల్ సెల్ అనీమియా వంటి వ్యాధులకు ఒక్క ఎంఆర్‌ఎన్‌ఏ ఇంజెక్షన్ ద్వారానే చికిత్స అందించే స్థితి వస్తుందని ఆశిస్తున్నా’అన్నారు.
కరోనా మహమ్మారిగా మారడం అదృష్టమే! ఎందుకంటే..?
Published Fri, Feb 25 2022 2:25 AM | Last Updated on Fri, Feb 25 2022 8:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment