
బయోఆసియా–2025 సదస్సులో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కె. నాగేశ్వర్‌రెడ్డి
పేగు కేన్సర్ల నిర్ధారణకు ఏఐజీలో ‘జీఐ జీనియస్’ ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు వెల్లడి
వైద్య రంగంలో కృత్రిమ మేధ వాడకంపై చర్చా కార్యక్రమంలో ప్రసంగం
ఏఐ వల్ల వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వంతోపాటు ఖర్చు, సమయం ఆదా అవుతోందన్న వక్తలు
సాక్షి, హైదరాబాద్: ‘ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా అందరికీ సమాన రీతిలో చికిత్స అందించే అవకాశం రావాలన్నది నా కల. రోగి పల్లెలో ఉన్నాడా లేక పట్టణంలో ఉన్నాడా? ధనిక, పేద తారతమ్యం లేకుండా వైద్యం అందాలి. ఆస్పత్రుల్లో ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేదా? అన్నది కూడా అడ్డంకి కాకూడదు. ఈ కల త్వరలోనే తీరుతుందని ఆశిస్తున్నా’ అని ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ కె.నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం బయోఆసియా–2025 సదస్సులో భాగంగా ఏఐ ఇన్ హెల్త్‌కేర్ అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో డాక్టర్ కె.నాగేశ్వర్‌రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏఐజీ ఆస్పత్రిలో వాడుతున్న ఏఐ టెక్నాలజీ గురించి వివరించారు.
ఏఐతో మెరుగ్గా కేన్సర్ల గుర్తింపు..
పేగులను పరిశీలించే పద్ధతిలో జీఐ జీనియస్ అనే ఏఐ సాంకేతికతను చేర్చామని డాక్టర్ కె. నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. పేగుల్లో తాము గుర్తించని అతిచిన్న కణితులను ‘జీఐ జీనియస్’ చూపడమే కాకుండా వాటిని తొలగించాలా వద్దా అనే విషయాన్ని సైతం స్పష్టం చేస్తోందని చెప్పారు. దీనివల్ల పేగు కేన్సర్ల గుర్తింపు 50 శాతం వరకు పెరిగిందన్నారు. అలాగే క్లోమగ్రంథి కేన్సర్లను కూడా ఎక్స్‌రేల ద్వారా వైద్యులు నిర్ధారించే దానికన్నా మెరుగ్గా ఏఐ సాంకేతికత గుర్తించగలగుతోందని తెలిపారు. అందుకే ఏఐజీ ఆస్పత్రిలోని అన్ని ఆపరేషన్ థియేటర్లను ఏఐ సాంకేతికతతో అనుసంధానించామని.. దీనివల్ల ప్రమాదకర పరిస్థితులను నివారించే వీలు ఏర్పడుతోందని డాక్టర్ కె. నాగేశ్వర్‌రెడ్డి వివరించారు.
వ్యాధి, నిర్ధారణ, చికిత్సలతోపాటు ఆసుపత్రిని మరింత సమర్థంగా నిర్వహించడంలోనూ ఏఐ ఎంతో సమర్థంగా ఉపయోగపడుతున్నట్లు ఆయన ఉదాహరణలతో వివరించారు. ఆసుపత్రిలోని రోగుల వివరాలను నిశితంగా పరిశీలిస్తూ వారికి గుండెపోటు వంటివి వచ్చే అవకాశాలను కొన్ని సందర్భాల్లో గంటల ముందుగానే గుర్తించి కాపాడగలుగుతున్నామని ఆయన వివరించారు. దీనివల్ల ఇప్పుడు తమ ఆస్పత్రిలో ఆకస్మిక మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. అలాగే రోగులు చెప్పే విషయాలను వైద్యులు స్వయంగా నమోదు చేయాల్సిన అవసరం లేకుండా వారి మాటలను రికార్డు చేసి వైద్యులకు సరైన రీతిలో అందించేందుకు సైతం తాము ఒక ఏఐ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు డాక్టర్ కె. నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.
వైద్య రంగంలో ఏఐ పెను విప్లవం: వక్తలు
మిగిలిన రంగాల మాదిరిగానే వైద్య రంగంలోనూ కృత్రిమ మేధ (ఏఐ) పెను విప్లవం సృష్టిస్తోందని బయో ఆసియా–2025 సదస్సులో వైద్య నిపుణులు వెల్లడించారు. వ్యాధి నిర్ధారణతోపాటు చికిత్స, కొత్త మందుల ఆవిష్క రణలను ఏఐ వేగవంతం చేస్తోందన్నారు. వైద్యులు గుర్తించలేని ఎన్నో విషయాలను ఏఐ గుర్తించగలుగుతోందని చెప్పారు. ఏఐ ప్రవేశంతో మందుల తయారీ ఖర్చు, సమయం సగానికిపైగా తగ్గుతోందని వక్తలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్ కంపెనీ ఇన్‌సిలికో మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ రికార్డో గామినా పచెకో మాట్లాడుతూ తాము ఏఐని కొత్త మందుల ఆవిష్కరణకు వాడుతున్నట్లు చెప్పారు.
మొత్తమ్మీద 25 వరకు ఏఐ మోడళ్లను ఉపయోగిస్తున్నా మన్నారు. ఫైబ్రోసిస్, లంగ్ ఫైబ్రోసిస్‌ల విషయంలో కొంత పురోగతి సాధించామని.. చైనా, అమెరికాలో వాటిపై ప్రయో గాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ చర్చా కార్యక్రమంలో వైద్య పరికరాల సంస్థ మెడ్‌ట్రానిక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కెన్ వాషింగ్టన్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆరోగ్యరంగ విభాగం అధ్యక్షుడు డాక్టర్ శ్యామ్ బిషెన్, యూకేకు చెందిన ఇమేజ్ అనాలసిస్ గ్రూప్ అధ్యక్షురాలు ఓల్గా కుబస్సోవా ఆరోగ్య రంగంలో ఏఐ పాత్రపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment