జీనోమ్‌వ్యాలీలో వ్యాక్సిన్ పరిశోధనను పరిశీలిస్తున్న విదేశీ రాయబారులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ పరిశీలనకు 64 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లు బుధవారం జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్‌తో పాటు బయోలాజికల్–ఈ సంస్థలను సందర్శించారు. కోవిడ్ నిరోధానికి భారత్ నిర్వహిస్తున్న కీలక పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రెండు ప్రధాన పారిశ్రామిక యూనిట్లను వారు సందర్శించారు. బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాయబారులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు.
విదేశీ ప్రతినిధులు రెండు బృందాలుగా విడిపోయి జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ సంస్థతో పాటు బయోలాజికల్–ఈ సంస్థను సందర్శించారు. భారత్ బయోటెక్ సీఎండీ ఎల్లా కృష్ణ, జేఎండీ సుచిత్రా ఎల్లాలు కోవాగ్జిన్ తయారీ ప్రక్రియను వారికి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు వారితో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతల గురించి సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. విదేశీ ప్రతినిధులు తమ పర్యటనను ముగించుకుని సాయంత్రం వెళ్లిపోయారు.
నవంబర్ నుంచే మూడో దశ ట్రయల్స్
భారత్ బయోటెక్ సంస్థను సందర్శించిన విదేశీ రాయబారులు, హైకమిషనర్లకు వ్యాక్సిన్ ఉత్పత్తి గురించి ఆ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా వివరించారు. ఇప్పటికే రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని నవంబర్ నుంచి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించామని చెప్పారు. దాదాపు 26 వేల మంది వలంటీర్లు ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు 30 కోట్ల డోసుల టీకాలు తయారు చేసిన వేరోసెల్ విభాగంలో పరిశోధనాత్మక ఉత్పత్తి చేపట్టామని వెల్లడించారు.
తక్కువ సమయంలో అద్భుత పురోగతి
ఏర్పాటైన అతి తక్కువ సమయంలోనే తెలంగాణ అద్భుత పురోగతి సాధించిందని విదేశీ రాయబారులతో సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా దేశంలో సులభతర వ్యాపారం (ఈవోడీబీ) చేయడంలో రాష్ట్రం ముందుందని చెప్పారు. విమాన, రోడ్డు రవాణా సదుపాయాలతో రాష్ట్రం అనుసంధానమై ఉందని, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల అంతర్జాతీయ అగ్రశేణి సంస్థలైన గూగుల్, యాపిల్, ఫేస్‌బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ యూనిట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఫార్మా రంగ ఉత్పాదక విలువ దాదాపు 50 బిలియన్ డాలర్లుగా ఉందని చెప్పారు. దేశంలోనే 33 శాతం టీకా ఉత్పత్తి హైదరాబాద్‌లో జరుగుతోందని, ప్రపంచంలోనే హైదరాబాద్ వ్యాక్సిన్ కేంద్రంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
పరిశ్రమలకు త్వరితగతిన అనుమతుల కోసం రాష్ట్రంలో కొత్తగా టీఎస్‌ఐపాస్ విధానాన్ని రూపొందించామని వివరించారు. రాష్ట్ర పెట్టుబడి సామర్థ్యాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జయేశ్‌రంజన్ విదేశీ ప్రముఖులకు వివరించారు. హైదరాబాద్‌లో ఫార్మాసిటీ కొన్ని నెలల్లోనే ప్రారంభమవుతుందని, ఓఆర్‌ఆర్ సమీపంలో 500 ఎకరాల్లో వైద్య పరికరాల పార్కు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వినయ్‌కుమార్, సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, బయోలాజికల్–ఈ సంస్థ ఎండీ మహిమ దాట్ల, భారత్ బయోటెక్ ఈడీ సాయిప్రసాద్ పాల్గొన్నారు.
హైదరాబాద్ బిర్యానీ ఇష్టంగా తిన్నారు..
రాష్ట్ర పర్యటనకు వచ్చిన విదేశీ దౌత్యవేత్తలు హైదరాబాదీ బిర్యానీని ఇష్టంగా తిన్నారు. శామీర్‌పేట మండలం తుర్కపల్లిలోని భారత్ బయోటెక్ సంస్థ ప్రాంగణంలోనే వీరికి భోజన ఏర్పాట్లు చేశారు. షెర్టాన్ ఫైవ్‌స్టార్ హోటల్ నుంచి ఆయా ఖండాలు, దేశాల అభిరుచులకు అనుగుణంగా ఆహార పదార్థాలను ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయించింది.
Comments
Please login to add a commentAdd a comment