శనివారం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్, మేడ్చల్: దేశంలో కరోనా టీకా అభివృద్ధి కోసం మూడు ఫార్మా దిగ్గజ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అహ్మదాబాద్, హైదరాబాద్, పుణేలలో సుడిగాలి పర్యటన చేపట్టారు. తొలుత గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న జైడస్ కాడిలా కంపెనీని సందర్శించిన మోదీ అక్కడ నుంచి భాగ్యనగరానికి విచ్చేశారు. భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలసి దేశీయంగా టీకా క్యాండిడేట్‌ను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్‌ను మోదీ సందర్శించారు. తెల్ల రంగు పీపీఈ కిట్ ధరించి లేబొరేటరీలోకి ప్రవేశించిన మోదీ అక్కడ జరుగుతున్న ప్రయోగాలను తిలకించారు. సుమారు గంటపాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లాతోపాటు శాస్త్రవేత్తలు, కంపెనీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. టీకా అభివృద్ధిలో ఇప్పటివరకు సాధించిన పురోగతి గురించి కంపెనీ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.
సాదర స్వాగతం...
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి (జైడస్ క్లాడిలా ఫార్మా కంపెనీ సందర్శన అనంతరం) హకీంపేట్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో చేరుకున్న ప్రధానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్ సాదర స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా 18 కి.మీ. ప్రయాణించి శామీర్‌పేట మండలం తుర్కపల్లిలోని జినోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ కంపెనీని మోదీ సందర్శించారు.
తయారీ ఈ స్థాయికి చేరినందుకు గర్విస్తున్నా...
దేశంలో టీకా తయారీ ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి చేరినందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. టీకా అభివృద్ధి కార్యక్రమంలో దేశం శాస్త్రీయ సిద్ధాంతాలపై ఆధారపడిందని, టీకా పంపిణీ సమర్థంగా జరిగేందుకు సలహా, సూచనలు ఇవ్వాలని కోరారు. ఆరోగ్యంతోపాటు లోక కల్యాణానికి టీకా కీలకమని భారత్ భావిస్తోందని వ్యాఖ్యానించారు. కరోనాపై పోరులో ఇరుగుపొరుగుతోపాటు ఇతర దేశాలకు సాయం అందించడం మన ధర్మమన్నారు. దేశంలో డ్రగ్ రెగ్యులేటరీ పద్ధతులను మరింత మెరుగుపరిచేందుకు శాస్త్రవేత్తలు స్వేచ్ఛగా, నిష్కర్షగా అభిప్రాయాలు తెలపాలని సూచించారు. ఈ సందర్భంగా కరోనాను ఎదుర్కొనే విషయంలో ఎలా కొత్త మందులు తయారు చేస్తున్నదీ... పాత మందులను కరోనా కట్టడి కోసం ఎలా మారుస్తున్నదీ శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. అనంతరం కంపెనీ నుంచి బయటకు వచ్చిన మోదీ సమీపంలో ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. ప్రధాని మధ్యాహ్నం 3:20 గంటల ప్రాంతంలో పుణే బయలుదేరారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు సిద్ధం చేస్తున్న కోవిషీల్డ్ టీకాను పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున తయారు చేస్తున్న విషయం తెలిసిందే.
అతిపెద్ద ప్రయోగం: భారత్ బయోటెక్
కోవాగ్జిన్ టీకాపై ప్రస్తుతం జరుగుతున్న మూడో దశ మానవ ప్రయోగాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జరుగుతున్న అతిపెద్ద కోవిడ్ టీకా ప్రయోగమని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు 25 కేంద్రాల్లో 26,000 మంది వలంటీర్లకు టీకా ఇస్తున్నామని, జినోమ్ వ్యాలీలోని బీఎస్‌ఎల్–3 స్థాయి కేంద్రంలో వ్యాక్సిన్ తయారవుతోందని కంపెనీ తెలిపింది. ప్రధాని మోదీ తమ ఫ్యాక్టరీని సందర్శించడంపై భారత్ బయోటెక్ హర్షం వ్యక్తం చేసింది. టీకా తయారీలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందికి ప్రధాని పర్యటన స్ఫూర్తినిస్తుందని, ప్రజారోగ్య సమస్యల పరిష్కారంలో తమ నిబద్ధతను మరింత పెంచుతుందని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. టీకా అభివృద్ధి విషయంలో తమకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన కేంద్ర ప్రభుత్వానికి, నియంత్రణ సంస్థలకు, వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, టీకా ప్రయోగాల్లో పాలుపంచుకుంటున్న వలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment