బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు
బయో ఆసియా 2024 సదస్సులో వక్తలు
ఫార్మా రంగంలో డేటా అనలిటిక్స్, ఏఐ వినియోగంపై చర్చ
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో ఔషధ ఆవిష్కరణలకు సంబంధించి పేటెంట్ల కోసం మరింత మెరుగైన చట్టాలు అవసరమని బయో ఏషియా సదస్సులో జరిగిన చర్చల్లో వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. పదేళ్ల కిందటితో పోలిస్తే భారత్‌లో పేటెంట్ల వాతావరణం కాస్త మెరుగుపడిందన్నారు. పేర్కొన్నారు. భారత్‌లో తయారవుతున్న ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న నేపథ్యంలో సంబంధిత చట్టాలను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం బయో ఏషియా సదస్సులో చర్చించారు. దీనితోపాటు వివిధ అంశాలపై లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగాలకు చెందిన నిపుణులు కీలకోపన్యాసాలు చేశారు.
ఆవిష్కరణలు, సంస్కరణలపై చర్చలు
బయో ఏషియా సదస్సులో భారత్‌లో, ప్రత్యేకించి తెలంగాణలో జీవశాస్త్ర, ఔషధ రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలు, ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలపై మంగళవారం బృంద చర్చలు జరిగాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఔషధ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఎదురయ్యే అవరోధాలపై మరో బృందం చర్చించింది. ఔషధ ఆవిష్కరణల్లో డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికత వినియోగం తీరుతెన్నులపై చర్చ జరిగింది. కొలన్ కేన్సర్ చికిత్స కోసం విద్యా, పరిశోధన సంస్థలు, ఆవిష్కరణలపై అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని ప్యానెల్ అభిప్రాయపడింది. తక్కువ ధరకు ఔషధాల లభ్యత, మెరుగైన ఆవిష్కరణల వాతావరణం కోసం జీనోమ్ వ్యాలీలో సామర్థ్య పెంపుదల కేంద్రం ఏర్పాటుపైనా చర్చలు జరిగాయి.
ఏఐ సాంకేతిక వినియోగాన్ని పెంచాలి
సదస్సులో బ్రిస్టిల్ మేయర్స్ స్క్విబ్ సీఈవో డాక్టర్ క్రిస్టోఫర్ బోయెర్నర్, నోబెల్ విజేత ప్రొఫెసర్ గ్రెగ్ సెమంజా, ప్రావిడెన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ రోడ్నీ హాప్‌మన్ కీలకోపన్యాసాలు చేశారు. ఆక్సిజన్ లోపంతో వచ్చే వ్యాధులకు జన్యు చికిత్సలపై పరిశోధన, అభివృద్ధి జరగాలని గ్రెగ్ సెమంజా సూచించారు. వ్యాధుల నిర్ధారణలో వైద్యులు ఏఐ సాంకేతికతను ఉపయోగించేలా కృషి జరగాలని డాక్టర్ రోడ్నీ హాఫ్‌మన్ కోరారు. రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు వేగంగా వచ్చేలా ఏఐ సాంకేతికతో కూడిన పరికరాలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని క్రిస్‌బోయెర్నర్ నొక్కి చెప్పారు.
జాన్‌హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్, నోబెల్ విజేత ప్రొఫెసర్ గ్రెగ్ సెమంజాకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు’ను ప్రదానం చేశారు. ఇక సదస్సులో భారత్‌లో తయారయ్యే వాక్సిన్లు, ఔషధ సరఫరా చైన్‌లు అంతర్జాతీయ స్థాయిలో ఎదుర్కొంటున్న భౌగోళిక, రాజకీయ అవాంతరాలపై వివిధ సంస్థల సీఈఓలతో కూడిన బృందం చర్చించింది. డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, అడ్వెంట్ అంతర్జాతీయ భాగస్వామి స్టెఫాన్ స్టోఫెల్, లారస్ లాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా, ఫైజర్ ఇండియా అధ్యక్షులు మీనాక్షి నెవాషియా, పిరమిల్ ఫార్మా చైర్‌పర్సన్ నందిని పిరమిల్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment