సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడిదారు సంస్థ ‘అడ్వెంట్ ఇంటర్నేషనల్’హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.16,550 కోట్లు (రెండు బిలియన్ డాలర్లు) భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో శుక్రవారం అడ్వెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ పటా్వరీ, ఆపరేటింగ్ భాగస్వామి వైదీష్ అన్నస్వామి ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు.
కేటీఆర్‌తో జరిగిన ఈ భేటీలో తమ సంస్థ పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో ఆసియా ఖండంలోనే అడ్వెంట్ పెట్టుబడిని అతి పెద్దదిగా భావిస్తున్నారు. యాక్టిఫ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్, మాన్యుఫాక్చరింగ్ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు తమ పెట్టుబడి దోహదం చేస్తుందని అడ్వెంట్ అంచనా వేస్తోంది.
50 వేల చదరపు అడుగుల్లో ల్యాబ్
ఇదిలా ఉంటే హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో 50 వేల చదరపు అడుగుల్లో పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (ఆర్ అండ్ డీ ల్యాబ్)ను అడ్వెంట్ ఏర్పాటు చేస్తోంది. తమ అధీనంలోని ఆర్‌ఏ కెమ్ ఫార్మా, జెడ్‌సీ కెమికల్స్, అవ్రా లేబొరేటరీ వంటి సంస్థలకు హైదరాబాద్ కేంద్ర స్థానంగా ఉంటుంది. హైదరాబాద్ సువెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో రూ.9,589 కోట్లతో పాటు ఇతర సంస్థల్లోనూ అడ్వెంట్ పెట్టుబడులు పెడుతుంది.
ఐటీ, లైఫ్‌సైన్సెస్ బలానికి నిదర్శనం
అడ్వెంట్ ఇంటర్నేషనల్ హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను భారీగా విస్తరించడం ఇక్కడి లైఫ్‌సైన్సెస్, ఐటీ రంగాల బలానికి అద్దం పడుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. భారీ పెట్టుబడులతో వస్తున్న అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామన్నారు.
తన అమెరికా పర్యటనలో భాగంగా అడ్వెంట్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్ట్‌నర్ జాన్ మల్డోనాతో జరిగిన సమావేశాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment