సాక్షి, హైదరాబాద్: సెమీ కండక్టర్ల రంగంలో పేరొందిన ‘కేనెస్ టెక్నాలజీ’రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రూ.2,800 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లాలోని కొంగర కలాన్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ ఫాక్స్‌కాన్‌కు పొరుగునే కేనెస్ టెక్నాలజీ నూతన తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావుతో కేనెస్ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్ కన్నన్, చైర్‌పర్సన్ సవితా రమేశ్ శుక్రవారం ఇక్కడ భేటీ అయ్యారు.
కొంగరకలాన్ యూనిట్‌లో ఔట్ సోర్స్‌డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్ట్(ఓఎస్‌ఏటీ)తోపాటు సంక్షిష్ట సెమీ కండక్టర్ల తయారీ వసతులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. కేనెస్ టెక్నాలజీ తన అనుబంధ కేనెస్ సెమీకాన్ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు విద్యుత్ ఉపకరణాలకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెస్తోంది. ఐఐటీ ముంబై సహకారంతో కేనెస్ సెమీకాన్ అత్యాధునిక వసతులతో కూడిన పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది.
రాష్ట్రంలో సెమీ కండక్టర్ల వాతావరణాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ ఈవీ నర్సింహారెడ్డి, ఎలక్ట్రానిక్స్ విభాగం డైరక్టర్ సుజయ్ కారంపూరి, కేనెస్ సెమీకాన్ సీఈవో రఘు ఫణిక్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment