
న్యూఢిల్లీ: అఫర్డబుల్ ఇళ్లు (రూ. 40 లక్షల లోపు గృహాలు) సరఫరా గణనీయంగా తగ్గుతోంది. 2018 నుంచి గతేడాది వరకూ నాలుగేళ్ల వ్యవధిలో ఏడు ప్రధాన నగరాల్లో ఇది 20 శాతానికి పడిపోయింది. 2018లో ఇది 40 శాతంగా ఉండేది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ ఆవిష్కరించిన డేటాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్థలం ఖరీదుగా మారడం, లాభాల మార్జిన్లు తగ్గిపోవడం, తక్కువ వడ్డీ రేటుతో అవసరమై నంతగా రుణలభ్యత లేకపోవడం తదితర అంశాలు తాజా అఫర్డబుల్ ఇళ్ల సరఫరా పడిపోవడానికి కారణమని అనరాక్ పేర్కొంది.
2018లో ఏడు నగరాల్లో మొత్తం 1,95,300 గృహాల నిర్మాణం ప్రారంభం కాగా వాటిలో 40 శాతం అఫోర్డబుల్ కేటగిరీలో ఉన్నాయి. ఇది 2020లో 30 శాతానికి, 2021లో 26 శాతానికి, గతేడాది 20 శాతానికి తగ్గిపోయింది. ‘అఫర్డబుల్ ఇళ్ల విభాగం పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కారణాల్లో ఒకటి స్థలమే. మధ్య స్థాయి, ప్రీమియం ఇళ్లతో డెవలపర్లు సులభంగానే స్థలం ఖర్చులు రాబట్టుకోగలరు. (జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్ )
కానీ అఫర్డబుల్ ఇళ్ల విషయంలో అలాంటి పరిస్థితి ఉండదు. ఇక ఈ ప్రాజెట్‌లకు లాభాల మార్జిన్లు కూడా చాలా స్వల్పంగా ఉంటాయి. ముడి వనరుల ఖర్చులు (సిమెంటు, ఉక్కు, లేబర్ మొదలైనవి) పెరిగిపోయిన నేపథ్యంలో బడ్జెట్ ఇళ్ల నిర్మాణం మరింత కష్టంగా మారుతోంది‘ అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. డిమాండు రూ. 40 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు అపార్ట్‌మెంట్లకు డిమాండు ఉంటోందని ఆయన పేర్కొన్నారు. (7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!)