సాక్షి, హైదరాబాద్: ‘దిల్’మళ్లీ తెరపైకి వచ్చింది. భూముల అమ్మకమే లక్ష్యంగా ఏర్పడ్డ డక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ఈ సంస్థకు ఊపిరిలూదాలని ప్రభుత్వం నిర్ణయించింది. దిల్ పేరిట గతంలో భూ విక్రయాలు/లీజులు చేపట్టిన ఈ సంస్థను మనుగడలోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. దిల్ అంశాన్ని బడ్జెట్ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రస్తావించారు కూడా. ఆర్థిక మాంద్యం నేపథ్యంలోప్రభుత్వ ఖజానా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ప్రధాన ఆదాయార్జన శాఖలు చతికిలపడటంతో భూముల అమ్మకాలతో పన్నేతర ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రియల్టీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుండటం, కోవిడ్–19తో ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లకు గురవుతున్న తరుణంలో దీని ప్రభావం జీఎస్టీ వసూళ్లపై ఉంటుందని అనుమానిస్తోంది. పదేళ్ల క్రితం ప్రభుత్వ భూముల సేకరణ అమ్మకం/లీజుల్లో క్రియాశీలకంగా పనిచేసిన ‘దిల్’సంస్థకు జవసత్వా లు తీసుకురావాలని నిర్ణయించింది. తద్వారా 2019–20 సవరించిన అంచనాల్లో రూ.12,275 కోట్లు మాత్రమే ఉన్న పన్నేతర ఆదాయాన్ని 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 30,600 కోట్లకు పెంచింది.
2,084 ఎకరాలపైనే ఆశ..
హైదరాబాద్ రాజధాని చుట్టూ 2,084 ఎకరాలను దిల్ సంస్థకు గతంలో ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ భూములను వినియోగిం చుకోవడంలో ఆ సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఇందులో 400 ఎకరాలను రెవెన్యూ శాఖ వెనక్కి తీసుకోగా.. సుమారు 1,584 ఎకరాలు ఆ సంస్థ అధీనంలోనే ఉన్నాయి. ఈ క్రమంలో నిరుపయోగంగా ఉన్న విలువైన భూములను విక్రయించడం ద్వారా ఖజానాను పరిపుష్టం చేసుకోవాలని యోచిస్తోంది. బాచుపల్లిలో 100, గాజుల రామారం 40.33, కుర్మల్‌గూడ 23.29, కోహెడ 239, అబ్దుల్లాపూర్‌మెట్ 161, అజీజ్‌నగర్ 126.29, కొత్వాల్‌గూడ 265, కొంగరకుర్దు 100, ధర్మారం 65.05, జవహర్‌నగర్ 60.25, తోలుకట్ట 16.26 ఎకరాలే కాకుండా చాలాచోట్ల దిల్ సంస్థకు భూములు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేసి వేలం వేస్తే పన్నేతర ఆదాయంగా ప్రతిపాదించిన రూ.30,600 కోట్లను సమీకరించడం పెద్దగా కష్టంకాబోదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ఈసారి పన్నేతర ఆదాయాన్ని రూ.18వేల కోట్లకు పైగా పెంచి అంచనాలను ప్రతిపాదించింది.
బుద్వేల్ భూములు కూడా...
ఇదిలావుండగా, నిధుల సమీకరణలో భాగంగా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో కొన్ని భూములున్నాయి. ఐటీ హబ్ కోసం ప్రతిపాదించిన బుద్వేల్‌లోని టూరిజం, హెచ్‌ఎండీఏ భూమిలో 50 ఎకరాలను విక్రయించడం ద్వారా ఖజానాకు కాసుల పంట పండుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, ఖానామెట్ సర్వే నం.41/14లోని 27.04 ఎకరాలను కూడా వేలం వేసేందుకు టీఎస్‌ఐఐసీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బహిరంగ మార్కెట్‌లో ఇక్కడ ఎకరా రూ.40–45 కోట్ల వరకు పలుకుతోంది.
ల్యాండ్ ఫర్ సేల్!
Published Mon, Mar 9 2020 2:45 AM | Last Updated on Mon, Mar 9 2020 2:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment