న్యూఢిల్లీ: చైనా తీవ్ర రియల్టీ సంక్షోభంలో నానాటికీ పీకల్లోతున కూరుకుపోతోందా? దేశవ్యాప్తంగా ఇప్పటికే జనాభాకు మించి గృహలున్నాయా? అవి చాలవని ఇంకా ఎటు చూస్తే అటు భారీ సంఖ్యలో గృహ నిర్మాణ ప్రాజెక్టులే కనిపిస్తున్నాయా? అవుననే అంటున్నారు చైనా ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగి ఒకరు! తన ఆర్థిక వ్యవస్థ కళకళలాడుతోందని చైనా ప్రభుత్వం బయటికి ఎన్ని మాటలు చెబుతున్నా, రియల్టీ సంక్షోభం నానాటికీ ఆందోళన కలిగించేంతగా విస్తరిస్తోందని చెబుతున్నారు!
చైనాలో నివాస గృహాల సంఖ్య కనీసం 100 కోట్లు దాటి ఉంటుందని భావిస్తున్నారు. అవి కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయట! దేశ స్టాటిస్టిక్స్ బ్యూరో మాజీ డెప్యూటీ హెడ్ హే కేంగ్ స్వయంగా చెప్పిన వివరాలివి. ‘చైనాలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్యపై ఒక్కో నిపుణుడు ఒక్కో మాట చెబుతున్నారు. కానీ, ఎవరి నమ్మినా, నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్మాణం పూర్తయి అందుబాటులో ఉన్న ఖాళీ ఇండ్లు కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయి’ అని హేంగ్‌ను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ వార్తా సంస్థ పేర్కొంది.
రియల్టీ సంస్థల దివాలా బాట
చైనాలో 2021 నుంచీ రియల్టీ రంగం సంక్షోభ బాట పట్టింది. క్రమంగా ఒకటి తర్వాత ఒకటిగా దిగ్గజ సంస్థలన్నీ దివాలా బాట పడుతుండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. చైనాలో నెలకొన్న ఈ రియల్టీ సంక్షోభానికి దేశమంతటా ఎక్కడ చూస్తే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొచి్చన అపార్ట్ మెంట్లే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి...
► ఇవి చాలవన్నట్టు దేశం మొత్తంమీద ఇంకా అసంఖ్యాకమైన అపార్ట్ మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి.
► అయితే కొనుగోలు చేసేవాళ్లు లేక నిర్మాణ సంస్థలు కొన్నాళ్లుగా అల్లాడుతున్నాయి.
► రుణ భారానికి తాళలేక 2021లో చైనా రియల్టీ దిగ్గజం ఎవర్ గ్రాండ్ గ్రూప్ నిలువునా దివాలా తీసింది.
► అంతకంటే పెద్ద నిర్మాణ సంస్థ కంట్రీ గార్డెన్ వంటివి దివాలా అంచులో కొట్టుమిట్టాడుతున్నాయి!
► గత ఆగస్టు నాటికే చైనాలో ఏకంగా 700 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణానికి సమానమైన ఇళ్లు అమ్ముడుకాకుండా ఖాళీగా మిగిలిపోయినట్టు ఆ దేశ జాతీయ గణాంక బ్యూరో తాజా అధికారిక గణాంకాలే చెబుతున్నాయి.
► ఇది దాదాపు ఒక్కోటీ 90 చదరపు మీటర్ల పరిమాణంలో ఉండే 72 లక్షల ఇళ్లకు సమానమని రాయిటర్స్ అంచనా వేసింది.
► ఇవిగాక ఇప్పటికే అమ్ముడుపోయి నిర్మాణ సంస్థలు ఎదుర్కొంటున్న నగదు ప్రవాహ సమస్యల కారణంగా ఇంకా పూర్తికాని ఇండ్ల ప్రాజెక్టులు దేశమంతటా అసంఖ్యాకంగా ఉన్నాయి.
అవి శ్మశాన నగరాలు!
► అత్యధిక ఇళ్లను ప్రధానంగా మార్కెట్ స్పెక్యులేటర్లు 2016 సమయంలో మార్కెట్లు కళకళలాడుతున్న సమయంలో ఎగబడి కొన్నారు. ఇప్పుడు వాళ్ళూ, రియల్టీ సంస్థల యజమానులూ ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు!
► ఆర్థిక సంక్షోభం బారి నుంచి దేశాన్ని ఎలాగోలా బయట పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చైనా కమ్యునిస్టు ప్రభుత్వానికి ఈ రియల్టీ సంక్షోభం పెను సవాలుగా పరిణమించింది.
► చైనా జీడీపీలో దాదాపు 30 శాతం వాటా రియల్టీ రంగానిదే.
► ఒకప్పుడు దేశానికి వెన్నెముకగా ఉన్న రియల్టీ రంగమే ఇప్పుడు పెను భారంగా మారింది.
► 1970ల నుంచి గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణం ఊపందుకుంది.
► దాంతో ఒకప్పుడు 18 శాతమున్న పట్టణ జనాభా ఇప్పుడు ఏకంగా 60 శాతం దాటింది.
► ఆ సమయంలో సంపన్నులు విచ్చలవిడిగా ఇళ్లు, గృహ సముదాయాలనే కొని అట్టిపెట్టుకున్నారు. దాంతో ఇప్పుడు పట్టణాలకు పట్టణాలే ఖాళీగా ఉన్న పరిస్థితి! క్వింగ్ హుయి, జెంగ్ డాంగ్, చెన్ గాంగ్, బిన్ హయీ వంటివి శ్మశాన నగరాలుగా మారాయి!!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment