housing projects
-
తగ్గుతున్న బిల్డర్ల ఆసక్తి - పరిమితమైన అందుబాటు ధరల ఇళ్లు
న్యూఢిల్లీ: అందుబాటు ధరల ఇళ్ల (రూ.40లక్షల్లోపు) ప్రాజెక్టుల పట్ల బిల్డర్లలో ఆసక్తి తగ్గినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ కాలంలో దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో, అందుబాటు ధరల ఇళ్ల సరఫరా 18 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 40 శాతంగా ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. కరోనా ముందు 2018 జూలై - సెప్టెంబర్ కాలంలో అందుబాటు ధరల ఇళ్ల వాటా మొత్తం సరఫరాలో 42 శాతంగా ఉండడం గమనించొచ్చు. దేశవ్యాప్తంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై రీజియన్, కోల్‌కతా, పుణె పట్టణాల్లో.. సెప్టెంబర్ త్రైమాసికంలో 1,16,220 యూనిట్ల ఇళ్ల సరఫరా నమోదైంది. ఇందులో రూ.40లక్షల్లోపున్న అందుబాటు ధరల ఇళ్లు 20,920 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, 2018 సెప్టెంబర్ క్వార్టర్లో అందుబాటు ధరల ఇళ్ల సరఫరా 21,900 యూనిట్లుగా ఉంది. విలాస ప్రాజెక్టులకే మొగ్గు రియల్ ఎస్టేట్ డెవలపర్లు అధిక రాబడుల కోసం ఎక్కువగా విలాసవంతమైన ప్రాజెక్టుల పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు అనరాక్ నివేదిక తెలిపింది. లాభాల మార్జిన్లు తక్కువగా ఉండడం, భూముల ధరలు అధికంగా ఉండడంతో అందుబాటు ధరల ఇళ్లు వారికి లాభసాటిగా ఉండడం లేదని పేర్కొంది. గడిచిన ఐదేళ్లలో లగ్జరీ ఇళ్ల వాటా (రూ.1.5 కోట్లపైన ధర ఉండేవి) రెండింతలు పెరిగినట్టు అనరాక్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ కాలంలో 1,16,200 యూనిట్లను ప్రారంభించగా, ఇందులో 27 శాతం (31,180 యూనిట్లు) లగ్జరీ విభాగంలో ఉన్నట్టు వెల్లడించింది. గత ఐదేళ్లలో ఒక త్రైమాసికంలో అత్యధికంగా లగ్జరీ యూనిట్ల ప్రారంభం గత త్రైమాసికంలోనే నమోదైనట్టు అనరాక్ తెలిపింది. 2018లో మొత్తం నూతన ఇళ్ల సరఫరా 52,120 యూనిట్లలో లగ్జరీ ఇళ్ల వాటా 9 శాతంగానే (4,590) ఉన్నట్టు పేర్కొంది. ‘‘డెవలపర్లు లగ్జరీ ఇళ్ల విభాగం పట్ల బుల్లిష్‌గా ఉన్నారు. కరోనా తర్వాత ఈ విభాగంలో అద్భుతమైన పనితీరు చూపిస్తోంది. ఏడు పట్టణాల్లో వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి’’అని అనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. -
చైనా నిండా దెయ్యాల కొంపలే!
న్యూఢిల్లీ: చైనా తీవ్ర రియల్టీ సంక్షోభంలో నానాటికీ పీకల్లోతున కూరుకుపోతోందా? దేశవ్యాప్తంగా ఇప్పటికే జనాభాకు మించి గృహలున్నాయా? అవి చాలవని ఇంకా ఎటు చూస్తే అటు భారీ సంఖ్యలో గృహ నిర్మాణ ప్రాజెక్టులే కనిపిస్తున్నాయా? అవుననే అంటున్నారు చైనా ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగి ఒకరు! తన ఆర్థిక వ్యవస్థ కళకళలాడుతోందని చైనా ప్రభుత్వం బయటికి ఎన్ని మాటలు చెబుతున్నా, రియల్టీ సంక్షోభం నానాటికీ ఆందోళన కలిగించేంతగా విస్తరిస్తోందని చెబుతున్నారు! చైనాలో నివాస గృహాల సంఖ్య కనీసం 100 కోట్లు దాటి ఉంటుందని భావిస్తున్నారు. అవి కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయట! దేశ స్టాటిస్టిక్స్ బ్యూరో మాజీ డెప్యూటీ హెడ్ హే కేంగ్ స్వయంగా చెప్పిన వివరాలివి. ‘చైనాలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్యపై ఒక్కో నిపుణుడు ఒక్కో మాట చెబుతున్నారు. కానీ, ఎవరి నమ్మినా, నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్మాణం పూర్తయి అందుబాటులో ఉన్న ఖాళీ ఇండ్లు కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయి’ అని హేంగ్ను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ వార్తా సంస్థ పేర్కొంది. రియల్టీ సంస్థల దివాలా బాట చైనాలో 2021 నుంచీ రియల్టీ రంగం సంక్షోభ బాట పట్టింది. క్రమంగా ఒకటి తర్వాత ఒకటిగా దిగ్గజ సంస్థలన్నీ దివాలా బాట పడుతుండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. చైనాలో నెలకొన్న ఈ రియల్టీ సంక్షోభానికి దేశమంతటా ఎక్కడ చూస్తే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొచి్చన అపార్ట్ మెంట్లే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి... ► ఇవి చాలవన్నట్టు దేశం మొత్తంమీద ఇంకా అసంఖ్యాకమైన అపార్ట్ మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ► అయితే కొనుగోలు చేసేవాళ్లు లేక నిర్మాణ సంస్థలు కొన్నాళ్లుగా అల్లాడుతున్నాయి. ► రుణ భారానికి తాళలేక 2021లో చైనా రియల్టీ దిగ్గజం ఎవర్ గ్రాండ్ గ్రూప్ నిలువునా దివాలా తీసింది. ► అంతకంటే పెద్ద నిర్మాణ సంస్థ కంట్రీ గార్డెన్ వంటివి దివాలా అంచులో కొట్టుమిట్టాడుతున్నాయి! ► గత ఆగస్టు నాటికే చైనాలో ఏకంగా 700 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణానికి సమానమైన ఇళ్లు అమ్ముడుకాకుండా ఖాళీగా మిగిలిపోయినట్టు ఆ దేశ జాతీయ గణాంక బ్యూరో తాజా అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ► ఇది దాదాపు ఒక్కోటీ 90 చదరపు మీటర్ల పరిమాణంలో ఉండే 72 లక్షల ఇళ్లకు సమానమని రాయిటర్స్ అంచనా వేసింది. ► ఇవిగాక ఇప్పటికే అమ్ముడుపోయి నిర్మాణ సంస్థలు ఎదుర్కొంటున్న నగదు ప్రవాహ సమస్యల కారణంగా ఇంకా పూర్తికాని ఇండ్ల ప్రాజెక్టులు దేశమంతటా అసంఖ్యాకంగా ఉన్నాయి. అవి శ్మశాన నగరాలు! ► అత్యధిక ఇళ్లను ప్రధానంగా మార్కెట్ స్పెక్యులేటర్లు 2016 సమయంలో మార్కెట్లు కళకళలాడుతున్న సమయంలో ఎగబడి కొన్నారు. ఇప్పుడు వాళ్ళూ, రియల్టీ సంస్థల యజమానులూ ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు! ► ఆర్థిక సంక్షోభం బారి నుంచి దేశాన్ని ఎలాగోలా బయట పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చైనా కమ్యునిస్టు ప్రభుత్వానికి ఈ రియల్టీ సంక్షోభం పెను సవాలుగా పరిణమించింది. ► చైనా జీడీపీలో దాదాపు 30 శాతం వాటా రియల్టీ రంగానిదే. ► ఒకప్పుడు దేశానికి వెన్నెముకగా ఉన్న రియల్టీ రంగమే ఇప్పుడు పెను భారంగా మారింది. ► 1970ల నుంచి గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణం ఊపందుకుంది. ► దాంతో ఒకప్పుడు 18 శాతమున్న పట్టణ జనాభా ఇప్పుడు ఏకంగా 60 శాతం దాటింది. ► ఆ సమయంలో సంపన్నులు విచ్చలవిడిగా ఇళ్లు, గృహ సముదాయాలనే కొని అట్టిపెట్టుకున్నారు. దాంతో ఇప్పుడు పట్టణాలకు పట్టణాలే ఖాళీగా ఉన్న పరిస్థితి! క్వింగ్ హుయి, జెంగ్ డాంగ్, చెన్ గాంగ్, బిన్ హయీ వంటివి శ్మశాన నగరాలుగా మారాయి!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
త్వరలో భూ సమీకరణకు కొత్త విధానం!
సాక్షి, హైదరాబాద్: నగర, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్ ) విధానాన్ని తీసుకురానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ భూ సమీకరణ విధానాలు, పద్ధతులపై రాష్ట్ర పురపాలక శాఖ అధ్యయనం చేపట్టింది. ఆ శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం ఒకటి గుజరాత్లో, కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని మరో బృందం మహారాష్ట్రలో పర్యటించింది. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ల్యాండ్ పూలింగ్ విధానాలపై బృందాలు అధ్యయనం జరిపాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు (ఉడాలు)/డీటీసీపీ (డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)లు నిర్వహిస్తున్న పాత్రను పరిశీలించాయి. ఈనెల 15లోగా ఈ బృందాలు పురపాలక శాఖకు తమ నివేదికలు సమర్పించనున్నాయి. వీటిని పరిశీలించి, నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త భూ సమీకరణ విధానాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. శాటిలైట్ టౌన్లు, పేద, బడుగు, బలహీన వర్గాలకు గృహ నిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణం వంటి అవసరాల కోసం ఈ కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకొస్తోందని అధికారవర్గాలు తెలిపాయి. పురపాలికలు, ఉడాల ఆధ్వర్యంలోనే.. భూ సమీకరణ ద్వారా సేకరించిన భూముల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను పురపాలికలు/ఉడాల ఆధ్వర్యంలోనే చేపట్టాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రైవేటు డెవలపర్లు అభివృద్ధి చేస్తున్న నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా పైప్లైన్లు కొద్ది రోజుల్లోనే దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పనులు పూర్తిగా పురపాలికలు/ఉడాల ఆధ్వర్యంలోనే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ద్వితీయార్ధంలో ఖరీదైన గృహ విక్రయాల హవా
ముంబై, సాక్షి: రెసిడెన్షియల్ విభాగంలో ఈ కేలండర్ ఏడాది(2020) ద్వితీయార్ధంలో ఖరీదైన గృహ విక్రయాల హవా నమోదైంది. జులై-డిసెంబర్ మధ్య కాలంలో దేశీయంగా రూ. 50 లక్షల విలువకు పైబడిన ఇళ్ల అమ్మకాల వాటా 57 శాతాన్ని తాకింది. ఇదే సమయంలో అందుబాటు ధరల గృహ విక్రయాలు 43 శాతానికి పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా కోవిడ్-19 కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ప్రభావం చూపినట్లు రియల్టీ రంగ విశ్లేషణ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలియజేసింది. (రియల్టీ రంగానికి స్టీల్ షాక్) హైఎండ్‌లో ఈ ఏడాది విలాసవంత విభాగంలో గృహాల కొనుగోలుకి వినియోగదారులు అధిక ఆసక్తిని చూపినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. మార్కెట్లో ప్రవేశించేందుకు 2020 అనుకూలమని అత్యధికులు భావించినట్లు తెలియజేసింది. దీనికితోడు ఆర్థికంగా పటిష్టస్థితిలో ఉన్న వర్గాలకు హౌసింగ్ రుణాల అందుబాటు తదితర అంశాలు జత కలసినట్లు వివరించింది. దీర్ఘకాలిక రుణ చెల్లింపుల సామర్థ్యం కలిగిన వ్యక్తులు గృహ కొనుగోళ్లకు ముందుకు వచ్చినట్లు అభిప్రాయపడింది. (కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!) హైదరాబాద్ టాప్ రెసిడెన్షియల్ విభాగంలో అధిక పరిమాణంలో అమ్మకాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో రియల్టీ కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఈ విషయంలో త్రైమాసిక ప్రాతిపదికన ముంబై, పుణే 121 శాతం పురోగతిని చూపినట్లు పేర్కొంది. అయితే కొత్త ప్రాజెక్టులను ప్రవేశపెట్టడంలో హైదరాబాద్ 480 శాతం వృద్ధితో తొలి ర్యాంకులో నిలిచినట్లు పేర్కొంది. 2020 ద్వితీయార్థంలో మొత్తం 1,46,228 యూనిట్ల ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు తెలియజేసింది. అయితే ఇవి అంతక్రితం ఏడాదితో పోలిస్తే 34 శాతం తక్కువేనని తెలియజేసింది. -
రికవరీ ఆశలు- రియల్టీ షేర్లు గెలాప్
ముంబై, సాక్షి: ఒడిదొడుకుల మార్కెట్లోనూ రయల్టీ రంగ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. దీంతో తొలుత ఎన్ఎస్ఈలో రియల్టీ రంగం 3 శాతం ఎగసింది. పలు కౌంటర్లకు డిమాండ్ ఏర్పడటంతో లాభాలతో పరుగు తీస్తున్నాయి. ఇందుకు పలు అంశాలు దోహదం చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు చూద్దాం.. షేర్ల జోరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 285 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 289 వరకూ ఎగసింది. ఈ బాటలో గోద్రెజ్ ప్రాపర్టీస్ దాదాపు 4 శాతం పెరిగి రూ. 1,105 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,122 వరకూ లాభపడింది. డీఎల్ఎఫ్ లిమిటెడ్ సైతం 3 శాతం వృద్ధితో రూ. 196 వద్ద కదులుతోంది. తొలుత రూ. 201 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ఇతర కౌంటర్లలో ఇండియాబుల్స్ రియల్టీ 2.7 శాతం బలపడి రూ. 63 వద్ద ట్రేడవుతోంది. శోభా లిమిటెడ్ 1.25 శాతం పుంజుకుని రూ. 318 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 323 వరకూ పురోగమించింది. ఇదే విధంగా ఒబెరాయ్, సన్‌టెక్, బ్రిగేట్ సైతం 0.5 శాతం స్థాయిలో బలపడి ట్రేడవుతున్నాయి. కారణాలివీ.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో రియల్టీ రంగ కంపెనీలు సగటున ప్రోత్సాహకర ఫలితాలు సాధించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధానంగా క్యూ2(జులై-సెప్టెంబర్)లో రెసిడెన్షియల్ విభాగం పటిష్ట పనితీరును చూపినట్లు తెలియజేశారు. తద్వారా నిర్వహణ లాభాలను సాధించినట్లు వివరించారు. ఇటీవల కనిపిస్తున్న ఆర్థిక రికవరీ రియల్టీకి డిమాండ్‌ను పెంచనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. రిటైల్, ఆతిథ్య రంగం నుంచి డిమాండ్ పెరిగే వీలున్నట్లు పేర్కొన్నాయి. దీనికితోడు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెసిడెన్షియల్ విభాగానికి పన్నుసంబంధ మినహాయింపులను ప్రకటించడంతో సెంటిమెంటు బలపడినట్లు తెలియజేశాయి. అంతేకాకుండా పీఎంఏవై పథకానికి అదనంగా రూ. 18,000 కోట్లు కేటాయించడం కూడా ఇందుకు దోహదపడనున్నట్లు విశ్లేషించాయి. -
హౌసింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ భేటీ
హైదరాబాద్: తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు, హౌసింగ్ ప్రాజెక్టులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం బుధవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. ఈ భేటీలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జూయింట్ వెయింట్ ప్రాజెక్టులు, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టే అంశాలపై మంత్రులు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నిరాశలో తయారీ రంగం..!
డిసెంబర్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత * ఆర్డర్లు లేకపోవడం, చెన్నై వరదలు కారణం * నికాయ్ ఇండియా పీఎంఐ సర్వే న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం డిసెంబర్లో తీవ్ర నిరాశాపూరిత పరిస్థితిలోకి జారిపోయింది. అసలు వృద్దిలేకపోగా క్షీణతను నమోదుచేసుకుంది. ఈ మేరకు నికాయ్ ఇండియా మేనుఫ్యాక్చరింగ్ పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) డిసెంబర్‌కు సంబంధించి తన తాజా సర్వే వివరాలను తెలియజేసింది. ముఖ్యాంశాలు చూస్తే... * నవంబర్‌లో పీఎంఐ 50.3 పాయింట్ల వద్ద ఉంటే డిసెంబర్లో 49.1 పాయింట్లకు జారిపోయింది. సూచీ ప్రకారం... 50 పాయింట్ల పైనుంటే వృద్ధి దశగా... కిందకు జారితే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. * సూచీ ఇంత కిందకు పడిపోవడం 2013 మార్చి తరువాత ఇదే తొలిసారి. * కొత్త ఆర్డర్లు లేకపోవడం, చెన్నైలో భారీ వర్షాల వల్ల ఉత్పత్తి భారీగా పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణం. అసలే అంతర్జాతీయ డిమాండ్ కొరవడి ఇబ్బంది పడుతున్న రంగానికి చెన్నై వరదలు తీవ్ర ప్రతికూలతను కల్పించాయి. * రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కీలక రేటును దిగువస్థాయిలో కొనసాగించాల్సిన పరిస్థితులను తాజా పరిణామాలు సృష్టిస్తున్నాయి. * ఇక ధరల విషయానికి వస్తే- ముడి పదార్థాలు, మార్కెట్ వ్యయాలు ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. * ఫెడ్ ఫండ్స్ రేటు పెంపు నేపథ్యంలో... అమెరికా డాలర్‌పై రూపాయి బలహీనత ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అంశాలు. * తయారీ రంగం బలహీనత ఆర్థిక రికవరీ వేగాన్ని మరింత తగ్గించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను 8.1-8.5 శాతం శ్రేణి నుంచి 7-7.5 శాతం శ్రేణికి తగ్గించింది. తగ్గిన హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రారంభ ధర ముంబై: ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ సంబంధిత ప్రారంభ ధరలు అంతక్రితం రెండేళ్లతో పోలిస్తే 2015లో 4-20 శాతంమేర తగ్గాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ కుష్మన్ అండ్ వాక్‌ఫీల్డ్ పేర్కొంది. కుష్మన్ అండ్ వాక్‌ఫీల్డ్ నివేదిక ప్రకారం.. 2013తో పోలిస్తే ముంబై సబ్ అర్బన్ ప్రాంతంలోని గోరేగావ్‌లో కొత్త ప్రాజెక్ట్స్ సగటు ప్రాధమిక అమ్మకపు ధర అత్యధికంగా 20% క్షీణించింది. దీని తర్వాతి స్థానాల్లో థానే (18%), గుర్గావ్లోని సదరన్ పెరిఫెరల్ రోడ్ (10%) ప్రాంతాలు ఉన్నాయి. దక్షిణ, పశ్చిమ సబ్ మార్కెట్స్ మినహా బెంగళూరులోని చాలా సబ్ మార్కెట్స్‌లో ప్రారంభ ధరలు స్థిరంగా ఉన్నాయి. దక్షిణ, పశ్చిమ సబ్ మార్కెట్స్‌లో కొత్త ప్రాజెక్ట్స్ సగటు ప్రారంభ ధరలు 2-7% క్షీణించాయి. ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంచాలి * ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కార్మిక సంఘాల విజ్ఞప్తి న్యూఢిల్లీ: ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి. అలాగే కనీస పింఛను మొత్తాన్ని రూ. 3,000కు, కనీస వేతనాన్ని రూ. 18,000కు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకు 11 కార్మిక సంఘాలు ఈ మేరకు 15 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందించాయి. మరోవైపు అసంఘటిత రంగానికీ సామాజిక భద్రత పథకాలను వర్తింపచేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలకు జైట్లీ తెలిపినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వివరాలు ఇవ్వండి * హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు ఎన్‌హెచ్‌బీ ఆదేశాలు న్యూఢిల్లీ: దాదాపు రూ. 25 లక్షలు ఆపైన రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారి వివరాలను ఇచ్చి,పుచ్చుకోవాలని హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను (హెచ్ఎఫ్సీ) నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ఆదేశించింది. తద్వారా వారు మళ్లీ మరో చోట రుణం పొందకుండా చూడొచ్చని పేర్కొంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులను కట్టడి చేసేందుకు హెచ్ఎఫ్సీలు కూడా సదరు వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సీఐసీ) సమర్పించేలా చూడాలంటూ ఆర్బీఐ సలహా, పురి కమిటీ నివేదిక సిఫార్సుల ఆధారంగా ఎన్‌హెచ్‌బీ తాజా ఆదేశాలు ఇచ్చింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, గ్యారంటార్ల విషయంలో హెచ్ఎఫ్సీలు అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవచ్చు. -
ఉద్యోగులకు వుడా ఇళ్లు
650 చ.అ విస్తీర్ణంలో ప్లాన్ వుడా ఆలోచన అధికారులతో సమీక్ష విశాఖపట్నం సిటీ : విశాఖ మహా నగరంలో ప్రతీ ఒక్కరికి సొంతింటి కలను నిజం చేసేలా హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాలని వుడా నిర్ణయించింది. విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ ఎంటీ కృష్ణబాబు అధ్యక్షతన సోమవారం వుడా కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఎన్.యువరాజ్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా అదనపు కమిషనర్ బిసి రమేష్, అపార్టుమెంట్ నిర్మాణ సంఘం ప్రతినిధులు, బ్యాంకర్లు పాల్గొన్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థ ఉద్యోగులు, ఇతర మధ్య తరగతి వర్గాల స్తోమతకు తగ్గట్టుగా ఇళ్ల నిర్మాణం జరగాలని నిర్ణయించారు. కనీసం 650 చదరపు అడుగులు ఆపై విస్తీర్ణంలో ఇళ్లను నిర్మించేలా గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడంపై చర్చించారు. నగరంలో ఏటా బిల్డర్ల ద్వారా జరుగుతున్న ఇళ్ల నిర్మాణం స్థాయిలో ప్రభుత్వ సంస్థల నుంచి గృహ నిర్మాణ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున అనుమతుల ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంను నివారించాలని సమావేశం తీర్మానించింది. అవసరమైతే బ్యాంకుల ద్వారా ఈ ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక సాయం పొందేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికలు తయారు చేశారు. సొంతింటిని సమకూర్చుకోవడం కోసం ఉద్యోగులను ప్రోత్సహించాలని, అందుకు అవసరమైన ఆర్థిక సాయం మంజూరయ్యేలా బ్యాంకుల నుంచి పనులు వేగంగా జరిగేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా నిర్ణయించారు. అపార్టుమెంట్ బిల్డర్ల సంఘం ప్రతినిధులంతా ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అనుమతులు పొందాల్సి ఉందని అధికారులు బిల్డర్లకు తేల్చిచెప్పారు. -
సమావేశానికి ఒట్టిచేతుల్తో వస్తే ఎలా..!
ఆర్డీవో, హౌసింగ్ పీడీలపై కలెక్టర్ ఆగ్రహం వాడీవేడిగా హౌసింగ్ సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: ‘ఇళ్ల నిర్మాణం ఎందుకు పూర్తికాలేదంటే.. కోర్టు కేసులని సాకులు చెబుతారు. కేసుల సంగతి అడిగితే రికార్డులు లేవంటారు. సమీక్షా సమావేశానికి చేతులూపుకుంటూ వస్తారా?’.. అంటూ హౌసింగ్ పీడీ, హైదరాబాద్ ఆర్డీవోపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న హౌసింగ్ ప్రాజెక్టులపై వివిధ మండలాల తహశీల్దార్లు, ఆర్డీవోలు, హౌసింగ్ అధికారులతో గురువారం కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. హైదరాబాద్ డివిజన్లోని ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టులు నత్తనడక సాగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు కేసులుంటే త్వరగా పరిష్కరించుకోవాలని, కేసులు లేని చోట్ల లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కొత్త లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి సామాజిక ఆర్థిక సర్వే(ఎస్ఈఎస్)ను వెంటనే పూర్తి చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. జీవో లేకపోవడంపై మందలింపు నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆ శాఖ అధికారులు స్టాంప్ డ్యూటీ చెల్లించమంటున్నారని.. గతంలో పేదల ఇళ్లకు ఉచితంగా రిజి స్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని సైదాబా ద్ తహశీల్దారు కలెక్టర్‌కు దృష్టికి తెచ్చారు. ఉచిత రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో మీవద్ద ఉందా.. అని హౌసింగ్ పీడీని, హైదరాబాద్ ఆర్డీవోను కలెక్టర్ ప్రశ్నించారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నకు అధికారులు నీళ్లు నమలడంతో కలెక్టర్ మరోమారు కోపగించుకున్నారు. ఉచిత రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నట్లైతే, ఆశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పేదల ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసేలా చూస్తానని తెలిపారు. ల్యాండ్ బ్యాంక్ .. జాగ్రత్త! జిల్లా వ్యాప్తంగా ల్యాండ్ బ్యాంక్‌లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలు కబ్జా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహశీల్దార్లను కలెక్టర్ ముఖేష్‌కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై శుక్రవారం జరగనున్న సమావేశానికి సమగ్ర వివరాలతో రావాలని తహశీల్దార్లను, ఆర్డీవోలకు సూచించారు. సమావేశంలో.. హౌసింగ్ ప్రాజెక్టు డెరైక్టర్ కృష్ణయ్య, జాయింట్ కలెక్టర్ ఇ.శ్రీధర్, హైదరాబాద్ ఆర్డీవో నవ్య, సికింద్రాబాద్ ఆర్డీవో కిషన్, అన్ని మండలాల తహశీల్దార్లు, జీహెచ్ఎంసీ, హౌసింగ్ విభాగాల ఇంజినీర్లు పాల్గొన్నారు.