నిరాశలో తయారీ రంగం..!
డిసెంబర్‌లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత
* ఆర్డర్లు లేకపోవడం, చెన్నై వరదలు కారణం
* నికాయ్ ఇండియా పీఎంఐ సర్వే
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం డిసెంబర్‌లో తీవ్ర నిరాశాపూరిత పరిస్థితిలోకి జారిపోయింది. అసలు వృద్దిలేకపోగా క్షీణతను నమోదుచేసుకుంది. ఈ మేరకు నికాయ్ ఇండియా మేనుఫ్యాక్చరింగ్ పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) డిసెంబర్‌కు సంబంధించి తన తాజా సర్వే వివరాలను తెలియజేసింది. ముఖ్యాంశాలు చూస్తే...
* నవంబర్‌లో పీఎంఐ 50.3 పాయింట్ల వద్ద ఉంటే డిసెంబర్‌లో 49.1 పాయింట్లకు జారిపోయింది. సూచీ ప్రకారం... 50 పాయింట్ల పైనుంటే వృద్ధి దశగా... కిందకు జారితే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది.
* సూచీ ఇంత కిందకు పడిపోవడం 2013 మార్చి తరువాత ఇదే తొలిసారి.
* కొత్త ఆర్డర్లు లేకపోవడం, చెన్నైలో భారీ వర్షాల వల్ల ఉత్పత్తి భారీగా పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణం. అసలే అంతర్జాతీయ డిమాండ్ కొరవడి ఇబ్బంది పడుతున్న రంగానికి చెన్నై వరదలు తీవ్ర ప్రతికూలతను కల్పించాయి.
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కీలక రేటును దిగువస్థాయిలో కొనసాగించాల్సిన పరిస్థితులను తాజా పరిణామాలు సృష్టిస్తున్నాయి.
* ఇక ధరల విషయానికి వస్తే- ముడి పదార్థాలు, మార్కెట్ వ్యయాలు ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరాయి.
* ఫెడ్ ఫండ్స్ రేటు పెంపు నేపథ్యంలో... అమెరికా డాలర్‌పై రూపాయి బలహీనత ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అంశాలు.
* తయారీ రంగం బలహీనత ఆర్థిక రికవరీ వేగాన్ని మరింత తగ్గించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను 8.1-8.5 శాతం శ్రేణి నుంచి 7-7.5 శాతం శ్రేణికి తగ్గించింది.
తగ్గిన హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రారంభ ధర
ముంబై: ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ సంబంధిత ప్రారంభ ధరలు అంతక్రితం రెండేళ్లతో పోలిస్తే 2015లో 4-20 శాతంమేర తగ్గాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ కుష్‌మన్ అండ్ వాక్‌ఫీల్డ్ పేర్కొంది. కుష్‌మన్ అండ్ వాక్‌ఫీల్డ్ నివేదిక ప్రకారం.. 2013తో పోలిస్తే ముంబై సబ్ అర్బన్ ప్రాంతంలోని గోరేగావ్‌లో కొత్త ప్రాజెక్ట్స్ సగటు ప్రాధమిక అమ్మకపు ధర అత్యధికంగా 20% క్షీణించింది.
దీని తర్వాతి స్థానాల్లో థానే (18%), గుర్గావ్‌లోని సదరన్ పెరిఫెరల్ రోడ్ (10%) ప్రాంతాలు ఉన్నాయి. దక్షిణ, పశ్చిమ సబ్ మార్కెట్స్ మినహా బెంగళూరులోని చాలా సబ్ మార్కెట్స్‌లో ప్రారంభ ధరలు స్థిరంగా ఉన్నాయి. దక్షిణ, పశ్చిమ సబ్ మార్కెట్స్‌లో కొత్త ప్రాజెక్ట్స్ సగటు ప్రారంభ ధరలు 2-7% క్షీణించాయి.
ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంచాలి
* ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కార్మిక సంఘాల విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి. అలాగే కనీస పింఛను మొత్తాన్ని రూ. 3,000కు, కనీస వేతనాన్ని రూ. 18,000కు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకు 11 కార్మిక సంఘాలు ఈ మేరకు 15 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందించాయి. మరోవైపు అసంఘటిత రంగానికీ సామాజిక భద్రత పథకాలను వర్తింపచేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలకు జైట్లీ తెలిపినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వివరించింది.
ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వివరాలు ఇవ్వండి
* హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు ఎన్‌హెచ్‌బీ ఆదేశాలు
న్యూఢిల్లీ: దాదాపు రూ. 25 లక్షలు ఆపైన రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారి వివరాలను ఇచ్చి,పుచ్చుకోవాలని హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను (హెచ్‌ఎఫ్‌సీ) నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ఆదేశించింది. తద్వారా వారు మళ్లీ మరో చోట రుణం పొందకుండా చూడొచ్చని పేర్కొంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులను కట్టడి చేసేందుకు హెచ్‌ఎఫ్‌సీలు కూడా సదరు వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సీఐసీ) సమర్పించేలా చూడాలంటూ ఆర్‌బీఐ సలహా, పురి కమిటీ నివేదిక సిఫార్సుల ఆధారంగా ఎన్‌హెచ్‌బీ తాజా ఆదేశాలు ఇచ్చింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, గ్యారంటార్ల విషయంలో హెచ్‌ఎఫ్‌సీలు అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవచ్చు.