న్యూఢిల్లీ: అందుబాటు ధరల ఇళ్ల (రూ.40లక్షల్లోపు) ప్రాజెక్టుల పట్ల బిల్డర్లలో ఆసక్తి తగ్గినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ కాలంలో దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో, అందుబాటు ధరల ఇళ్ల సరఫరా 18 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 40 శాతంగా ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. కరోనా ముందు 2018 జూలై - సెప్టెంబర్ కాలంలో అందుబాటు ధరల ఇళ్ల వాటా మొత్తం సరఫరాలో 42 శాతంగా ఉండడం గమనించొచ్చు.
దేశవ్యాప్తంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై రీజియన్, కోల్‌కతా, పుణె పట్టణాల్లో.. సెప్టెంబర్ త్రైమాసికంలో 1,16,220 యూనిట్ల ఇళ్ల సరఫరా నమోదైంది. ఇందులో రూ.40లక్షల్లోపున్న అందుబాటు ధరల ఇళ్లు 20,920 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, 2018 సెప్టెంబర్ క్వార్టర్లో అందుబాటు ధరల ఇళ్ల సరఫరా 21,900 యూనిట్లుగా ఉంది.
విలాస ప్రాజెక్టులకే మొగ్గు
రియల్ ఎస్టేట్ డెవలపర్లు అధిక రాబడుల కోసం ఎక్కువగా విలాసవంతమైన ప్రాజెక్టుల పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు అనరాక్ నివేదిక తెలిపింది. లాభాల మార్జిన్లు తక్కువగా ఉండడం, భూముల ధరలు అధికంగా ఉండడంతో అందుబాటు ధరల ఇళ్లు వారికి లాభసాటిగా ఉండడం లేదని పేర్కొంది. గడిచిన ఐదేళ్లలో లగ్జరీ ఇళ్ల వాటా (రూ.1.5 కోట్లపైన ధర ఉండేవి) రెండింతలు పెరిగినట్టు అనరాక్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ కాలంలో 1,16,200 యూనిట్లను ప్రారంభించగా, ఇందులో 27 శాతం (31,180 యూనిట్లు) లగ్జరీ విభాగంలో ఉన్నట్టు వెల్లడించింది.
గత ఐదేళ్లలో ఒక త్రైమాసికంలో అత్యధికంగా లగ్జరీ యూనిట్ల ప్రారంభం గత త్రైమాసికంలోనే నమోదైనట్టు అనరాక్ తెలిపింది. 2018లో మొత్తం నూతన ఇళ్ల సరఫరా 52,120 యూనిట్లలో లగ్జరీ ఇళ్ల వాటా 9 శాతంగానే (4,590) ఉన్నట్టు పేర్కొంది. ‘‘డెవలపర్లు లగ్జరీ ఇళ్ల విభాగం పట్ల బుల్లిష్‌గా ఉన్నారు. కరోనా తర్వాత ఈ విభాగంలో అద్భుతమైన పనితీరు చూపిస్తోంది. ఏడు పట్టణాల్లో వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి’’అని అనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment