ఎస్‌యూవీలు, ఎంపీవీలు, సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే దేశీయ విఫణిలో ఉన్న కార్ మోడల్స్ కోకొల్లలు. మార్కెట్లో ఎన్నెన్ని కార్లున్నా బడ్జెట్ కార్లకే ఎక్కువ డిమాండ్ ఉందనేది అందరికీ తెలిసిన సత్యం. బడ్జెట్ కార్ల విభాగంలో కూడా లెక్కకు మించిన కార్లు ఉండటం వల్ల.. ఇందులో బెస్ట్ కార్లు ఏవి అనేది కొందరికి అంతుచిక్కని ప్రశ్న. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఆల్టో 800
భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న, ఎక్కువ మంది ప్రజలను ఆకర్శించడంలో విజయం పొందిన కార్లలో 'మారుతి సుజుకి ఆల్టో 800' ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. రూ.3.25 లక్షల నుంచి రూ.5.12 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధరతో లభించే ఈ కారు చూడటానికి పరిమాణంలో కొంత చిన్నదిగా ఉన్నప్పటికీ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. పనితీరు ఉత్తమంగానే ఉంటుంది.
మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతి అంటే అందరికి గుర్తొచ్చేది స్విఫ్ట్. మంచి పర్ఫామెన్స్, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ కారు డ్యూయల్ టోన్ స్పోర్టీ స్టైల్, క్రాస్డ్ మెష్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ వంటి వాటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, నావిగేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ గేర్ స్విచ్, మల్టీ-కలర్ ఇన్ఫర్మేషన్ మానిటర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఎన్ని ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
హ్యుందాయ్ కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ10 నియోస్ కూడా ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న పాపులర్ బడ్జెట్ కారు. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అప్డేటెడ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొత్త ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇది రీడిజైన్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ గ్రిల్ వంటివి పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.5.92 లక్షలు (ఎక్స్ షోరూమ్).
టాటా టియాగో
దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా సరసమైన ధర వద్ద లభించే కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇందులో ఒకటి టియాగో. 2016లో పరిచయమైన ఈ కారు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు 242 లీటర్ బూట్ స్పేస్ పొందుతుంది. హైట్ అడ్జస్టబుల్ సీటు, రియర్‌వ్యూ కెమెరా, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ క్లస్టర్, 8 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి అనేక ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి. దీని ధర రూ.5 లక్షలు (ఎక్స్ షోరూమ్).
ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం: భారీగా పెరగనున్న ధరలు
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
రూ.5.41 లక్షల నుంచి రూ.7.12 లక్షల మధ్య లభించే 'మారుతి సుజుకి వ్యాగన్ ఆర్' మన జాబితాలో చెప్పుకోదగ్గ కారు. 2400 మిమీ వీల్‌బేస్ కలిగి ఐదుమంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఈ కారు పెద్ద క్యాబిన్ కలిగి ఉంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ పొందిన క్యాబిన్లోని డ్యాష్‌బోర్డ్ హై క్వాలిటీ ప్లాస్టిక్‌తో తయారైంది. మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment