
మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్, బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు ఇప్పటికే తమ బ్రాండ్ వాహనాల ధరలను 2025 జనవరి ప్రారంభం నుంచే పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' కూడా చేరింది.
టాటా మోటార్స్ తన మోడల్స్ ధరలను 3 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త ధరలు 2025 జనవరి నుంచే అమలులోకి వస్తాయి. కానీ ఏ వేరియంట్ ధర ఎంత అనేది త్వరలోనే వెల్లడవుతుంది. ఫ్యూయెల్ వాహనాలు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగానే ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ స్పష్టం చేసింది. కాగా కంపెనీ వచ్చే ఏడాదిలో మరిన్ని కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో టాటా కొత్త ఉత్పత్తులు కనువిందు చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారు
వాహన తయారీ సంస్థలు ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. ప్రతి ఏటా.. ఏడాది చివరలో లేదా పండుగ సీజన్లలో ధరలను పెంచుతాయి. ఇప్పుడు కూడా ఇదే విధానం అనుసరించి.. పలు కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ధరల పెరుగుదల అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా?.. లేదా? అనేది తెలియాల్సి ఉంది.