
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలతో రియల్టీ రయ్‌మని దూసుకుపోతోంది. ఈ మేరకు రియల్టీ రంగంలో ఉద్యోగవకాశాలు కూడా భారీగా మెరుగుపడుతున్నాయి. జీఎస్టీ, కొత్త రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ చట్టం వంటి కొత్త కొత్త సంస్కరణలతో రియల్టీ రంగం 2025 నాటికి మరో 80 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు తాజా రిపోర్టు పేర్కొంది. రియల్టర్ల బాడీ క్రెడాయ్, కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ జాయింట్ రిపోర్టు మేరకు దేశీయ జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం 2025 నాటికి 13 శాతం పెరుగుతుందని ఉంటుందని తెలిసింది.
2016 నాటికి ఈ రంగంలో 9.6 మిలియన్లుగా ఉన్న ఉద్యోగవకాశాలు, 2025 నాటికి 17.2 మిలియన్లకు పెరుగుతాయని ఈ రిపోర్టు అంచనావేసింది. అదేవిధంగా ఆర్థికవ్యవస్థకు రియల్ ఎస్టేట్ రంగం అందించే సహకారం 6.3 శాతం నుంచి 2025 నాటికి రెండింతలు పెరిగి 13 శాతానికి ఎగియనున్నట్టు కూడా సీబీఆర్‌ఈ రిపోర్టు తెలిపింది. కొత్త గృహాల కోసం పట్టణీకరణ డిమాండ్ పెరగడం, టైర్ 2, టైర్ 3 నగరాల్లో అర్బన్ ఫ్యాబ్రిక్ విస్తరించడం వంటి రియల్ ఎస్టేట్ వృద్ధికి దోహదం చేస్తున్నట్టు వివరించింది. రియల్టీ రంగం వృద్ధి సాధించడంతో, ఉద్యోగవకాశాల్లోనూ పెంపుదల చూడొచ్చని క్రెడాయ్ ప్రెసిడెంట్ జాక్సీ షా చెప్పారు. 2025 నాటికి జీడీపీలో రియల్ ఎస్టేట్ సహకారం రెండింతలు అవనున్నట్టు పేర్కొన్నారు.