హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగంలో ఉన్న ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్... అతిథ్య రంగంలోకి ప్రవేశించింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ఉన్న హాంప్‌షైర్ ప్లాజా హోటల్‌ను కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.42 కోట్లు. ఈ ఏడాదే గోవాలోనూ ఓ హోటల్‌ను టేకోవర్ చేయనున్నట్టు ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ సీవోవో ప్రవీణ్ కుమార్ నెడుగండి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ.60 కోట్ల దాకా వెచ్చించనున్నట్లు వెల్లడించారు.
ఆతిథ్య రంగంలో మరిన్ని ప్రాజెక్టులను చేజిక్కించుకుంటామని ఈ సందర్భంగా చెప్పారాయన. ‘2008లో రియల్టీ రంగంలోకి ప్రవేశించాం. 2,500 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇతర కంపెనీల కంటే 50 శాతం తక్కువ ధరకే ప్లాట్లను విక్రయిస్తున్నాం. ఇప్పటిదాకా 29,000 ప్లాట్లు విక్రయించాం. నిర్మాణ రంగంలోకి సైతం ప్రవేశిస్తున్నాం’’ అని తెలియజేశారు.
బిస్కెట్ ఫ్యాక్టరీ..
చౌటుప్పల్ సమీపంలో కంపెనీ 3 ఎకరాల్లో బిస్కెట్ల తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. నెలకు 2,000 టన్నుల బిస్కెట్లు, 500 టన్నుల కేక్ తయారు చేయగలిగే సామర్థ్యంతో ఇది రానుంది. ప్రాజెక్టు వ్యయం రూ.30 కోట్లు. దీనిద్వారా ప్రత్యక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది.
2019లో ఉత్పత్తి కార్యకలాపాలు మొదలవుతాయి. దీనికి సంబంధించి పార్లే కంపెనీతో ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ చేతులు కలిపింది. తొలుత ఇక్కడ పార్లే కోసం ఉత్పత్తులను తయారు చేస్తారు. ఇతర కంపెనీలతోనూ థర్డ్ పార్టీ డీల్ కోసం చర్చిస్తున్నట్టు ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. బిస్కెట్లు, కేక్స్‌ను సొంత బ్రాండ్‌లో విదేశాల్లో విక్రయించనున్నట్టు చెప్పారు. 2017–18లో కంపెనీ రూ.100 కోట్ల టర్నోవర్ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment