నగరంలో బడా నిర్మాణాలు!
* గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌పైనే దృష్టి
* ప్రెస్టిజ్, పూర్వాంకర సంస్థల ప్రాజెక్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: నగర స్థిరాస్తి రంగంలో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మార్కెట్ ఒక్కసారిగా మెరుగైతే.. అనూహ్యంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో బెంగళూరు, పుణే, అహ్మదాబాద్ వంటి ఇతర నగరాలకు చెందిన నిర్మాణ సంస్థలు హైదరాబాద్‌లో నిర్మాణాలను ప్రకటించాయి.
- తెలంగాణ ప్రభుత్వం నగరాభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌కు ఢోకా లేదన్న సంకేతాలను అందించాయనడంలో సందేహం లేదు. రియల్టీ రంగంలో పరిస్థితులు సానుకూలంగా కన్పించినా.. ప్రాజెక్టులను సందర్శించే వారి సంఖ్య పెరుగుతున్నా.. కొన్న వారు మాత్రం తక్కువేనన్నది వాస్తవం. ప్రాంతం, ధర, సదుపాయాలు, నిర్మాణ ప్రగతి మెరుగ్గా ఉన్న ప్రాజెక్టుల్లో విక్రయాలు బాగానే ఉంటున్నాయన్నది బిల్డర్ల మాట.
ప్రెస్టిజ్, పూర్వాంకర ప్రాజెక్ట్‌లు..
మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్ల చుట్టూ గల ప్రాంతాల్లో చేపట్టే నిర్మాణాలకు గిరాకీ ఎప్పటికైనా ఉంటుంది. అందుకే బెంగళూరుకు చెందిన ప్రెస్టిజ్ గ్రూప్ కొండాపూర్‌లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రెండు భారీ ప్రాజెక్ట్‌లను ప్రకటించింది. కొండాపూర్‌లో సుమారు 4.96 ఎకరాల్లో 17 అంతస్థుల్లో 349 ఫ్లాట్లను, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 21.85 ఎకరాల్లో 28-34 అంతస్థుల్లో 2,240 ఫ్లాట్లు గల ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. పూర్వాంకర గ్రూప్ కొండాపూర్‌లో పూర్వ సమ్మిట్ పేరుతో గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది.
అలాగే నార్సింగిలో పుణేకి చెందిన ఆక్యురేట్ డెవలపర్స్ 6.5 ఎకరాల్లో 722 ఫ్లాట్లు గల నిర్మాణాన్ని జీ+12 అంతస్థుల్లో నిర్మించనుంది. కేవలం క్లబ్‌హౌస్ కోసమే 30 వేల చ.అ. స్థలాన్ని కేటాయించారు. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పసిఫికా సంస్థ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హిల్ క్రెస్ట్ ప్రాజెక్ట్‌ను ఆరంభించడానికి సన్నాహాలు చేస్తోంది. మొత్తం నిర్మాణం వచ్చేది 40 ఎకరాల్లో కాగా.. తొలి విడతగా 684 ఫ్లాట్లను నిర్మించాలని ప్రణాళిక.
తెలుసుకున్నాకే.. అడుగేయండి!
బిల్డరైనా.. జనాలైనా స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేముందు మార్కెట్ గురించి, లోకేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాక సరైన ప్లానింగ్ తో, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ.. నాణ్యమైన, నమ్మకమైన ప్రాజెక్ట్‌లను కట్టాలని’’ సూచిస్తున్నారు రామ్ డెవలపర్స్ ఎండీ రాము వనపర్తి. అప్పుడే మార్కెట్‌లో నిలబడటమే కాకుండా.. కొనుగోలుదారులూ స్వాగతిస్తారంటున్నారు. అందుకే నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించాం.
- చిక్కడపల్లిలో 475 గజాల్లో ‘మేఫెయిర్ అవెన్యూస్’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందు లో 1,195-1,475 చ.అ. విస్తీర్ణాలుండే 2,3 బీహెచ్‌కే ఫ్లాట్లు ఎనిమిదొస్తాయి. ధర చ.అ.కు రూ.5,250.
- పంజగుట్టలో 550 గజాల్లో ‘రామ్ మిడోస్’ను నిర్మిస్తున్నాం. ఇందులో 8 ఫ్లాటొస్తాయి. అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ధర చ.అ.కు రూ.7 వేలు. ఇదే ప్రాంతంలో 1,050 గజాల్లో ఎలైట్ హాబిటేట్‌నూ నిర్మిస్తున్నాం. ఇందులో 15 ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.7,500.
- బేగంపేట షాపర్స్‌స్టాప్ వెనక 720 గజాల్లో 8 ఫ్లాట్లుండే ఓ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ధర చ.అ.కు రూ.6 వేలు.
- బెంగళూరులోనూ పలు ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నాం. కేఆర్ పురంలో 650 గజాల్లో 20 ఫ్లాట్లుండే ప్రాజెక్ట్, ఆల్‌సూర్‌లో 480 గజాల్లో 8 ఫ్లాట్లుండే మరో ప్రాజెక్ట్‌నూ నిర్మిస్తున్నాం. అలాగే తనిసంద్రలో 155 ఫ్లాట్లుండే ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇంకా రావాల్సి ఉంది.