Hyderabad: ఐటీ కారిడార్‌కు మళ్లీ కోవిడ్‌ భయం! | Hyderabad: The Fear of Covid Again for the IT Corridor | Sakshi
Sakshi News home page

Hyderabad: ఐటీ కారిడార్‌కు మళ్లీ కోవిడ్‌ భయం!

Published Sat, Dec 24 2022 6:39 PM | Last Updated on Sat, Dec 24 2022 6:45 PM

Hyderabad: The Fear of Covid Again for the IT Corridor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ను మళ్లీ కోవిడ్‌ భయం వణికిస్తోంది. శివారులోని గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్స్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రాంగూడలో సుమారు మూడు వేల ఎకరాల్లో 14 ఐటీ జోన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతిష్టాత్మక అమెజాన్, గుగూల్, ట్విట్టర్, ఫేస్‌బుక్, మహేంద్ర వంటి ఐటీ, అనుబంధ కంపెనీలు, స్టార్‌ హోటళ్లు, అనేక వ్యాపార వాణిజ్య సంస్థలు వెలిశాయి. వీటిలో ప్రత్యక్షంగా ఏడు లక్షల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో పది లక్షలమంది పనిచేస్తున్నట్లు అంచనా. వీరిలో చాలామంది ఉద్యోగులు ప్రాజెక్టుల పేరుతో తరచూ విదేశాలకు వెళ్లి వస్తుంటారు. 

చైనా, బ్రెజిల్, బ్రిటన్‌ సహా పలు దేశాల్లో బీఎఫ్‌–7 వేరియంట్‌ వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆయా దేశాలకు వెళ్లి వచ్చిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరిలో ఎవరు ఏ వేరియంట్‌ వైరస్‌ను వెంట తీసుకొచ్చారో? తెలియక తోటి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తోటి ఉద్యోగుల్లో ఎవరైనా ఇటీవల విదేశాలకు వెళ్లివచ్చినట్లు తెలిస్తే చాలు వారికి దూరంగా ఉంటున్నారు. 

ఇప్పుడు ‘బీఎఫ్‌7’ వేరియెంట్‌
నగరంలో 2020 మార్చి 2న తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడికి తొలుత కరోనా సోకింది. అప్ప­ట్లో ‘ఆల్ఫా’వేరియెంట్‌ హల్‌చల్‌ చేసింది. అనతికాలంలోనే అనేకమంది ఈ వైరస్‌ గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. ఆ తర్వాత ‘డెల్టా’వేరియెంట్, మూడోదశలో ‘ఒమిక్రాన్‌’ రూపంలో విజృంభించింది. ఫలితంగా గ్రేటర్‌ జిల్లాల్లో సుమారు ఏడు లక్షల మంది ఈ వైరస్‌ బారిన పడగా, పదివేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. గత మూడు దశల్లో కోవిడ్‌ సృష్టించిన నష్టాల బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత ఏడాదికాలంగా కోవిడ్‌ పీడ పూర్తిగా పోయిందని భావించి స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో తాజాగా ‘బీఎఫ్‌7’వేరియంట్‌ రూపంలో ఫోర్త్‌ వేవ్‌ మొదలైంది. 

బూస్టర్‌డోసుకు మళ్లీ డిమాండ్‌
తాజా వేరియంట్‌ హెచ్చరికలతో ఉద్యోగులు, సాధారణ ప్రజలు మళ్లీ టీకా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. బూస్టర్‌ డోసు వేయించుకుంటున్నారు. ఒంట్లో ఏ కొంచెం నలతగా అన్పించినా వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు అనుమానితుల తాకిడి పెరుగు తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. 

ఎయిర్‌పోర్ట్‌లో అలెర్ట్‌
దేశవిదేశాలకు చెందిన ప్రయాణికులంతా శంషాబాద్‌ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ విమానాశ్రయం నుంచి రోజుకు సగటున 14 నుంచి 15 వేల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు. ప్రస్తుతం స్వదేశంతో పోలిస్తే విదేశాల్లో వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చి పోయే ప్రయాణికుల ద్వారా ఈ కొత్త వేరియంట్‌ దేశంలో విస్తరించే ప్రమాదం ఉండటంతో ఎయిర్‌పోర్టు యంత్రాంగం అప్రమత్తమైంది. శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టులో మళ్లీ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న ప్రయాణికులను గుర్తించి ఐసోలేషన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సూచనలు ఇవే..
► మార్కెట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, పార్కులు, ఫంక్షన్‌హాళ్లు, రైల్వే, బస్‌స్టేషన్లు, గుళ్లు గోపురాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, ఇతర సందర్శనీయ ప్రదేశాలు, రాజకీయ సభలు, సమావేశాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి ప్రదేశాల్లో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సులభంగా, వేగంగా విస్తరించే అవకాశం ఉంది.

► రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, ఇప్పటివరకు కోవిడ్‌ టీకాలు తీసుకోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలు త్వరగా వైరస్‌ బారినపడే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు సాధ్యమైనంత వరకు ఈ రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. విదేశీ ప్రయాణాలతోపాటు దైవదర్శనాలను వాయిదా వేసుకోవాలి. 

► రద్దీ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలి. చేతులను తరచూ శానిటైజర్, సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. షేక్‌ హ్యాండ్‌కు బదులు రెండు చేతులతో నమస్కారం చేయడం ఉత్తమం. దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, జ్వరం లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. 

► వ్యక్తిగతంగా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి. ఇందుకు ఇప్పటికే ఒకటి, రెండు డోసుల టీకాలతో సరిపెట్టుకున్న వారు బూస్టర్‌ డోసు కూడా తీసుకోవాలి. తాజా మాంసం, మద్యపానం, ధూమపానం వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన ప్యాక్డ్‌ మసాల ఆహారానికి బదులు, తాజాగా వండివార్చిన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కొత్త వేరియంట్‌ను విజయవంతంగా ఎదుర్కోవచ్చు.  (క్లిక్ చేయండి: పాండెమిక్‌ నుంచి ఎండెమిక్‌ దశకు కరోనా వైరస్‌.. బూస్టర్‌ డోస్‌ తప్పనిసరి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement