Financial District
-
Hyderabad: ఐటీ కారిడార్‌కు మళ్లీ కోవిడ్ భయం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ను మళ్లీ కోవిడ్ భయం వణికిస్తోంది. శివారులోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రాంగూడలో సుమారు మూడు వేల ఎకరాల్లో 14 ఐటీ జోన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతిష్టాత్మక అమెజాన్, గుగూల్, ట్విట్టర్, ఫేస్బుక్, మహేంద్ర వంటి ఐటీ, అనుబంధ కంపెనీలు, స్టార్ హోటళ్లు, అనేక వ్యాపార వాణిజ్య సంస్థలు వెలిశాయి. వీటిలో ప్రత్యక్షంగా ఏడు లక్షల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో పది లక్షలమంది పనిచేస్తున్నట్లు అంచనా. వీరిలో చాలామంది ఉద్యోగులు ప్రాజెక్టుల పేరుతో తరచూ విదేశాలకు వెళ్లి వస్తుంటారు. చైనా, బ్రెజిల్, బ్రిటన్ సహా పలు దేశాల్లో బీఎఫ్–7 వేరియంట్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆయా దేశాలకు వెళ్లి వచ్చిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరిలో ఎవరు ఏ వేరియంట్ వైరస్‌ను వెంట తీసుకొచ్చారో? తెలియక తోటి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తోటి ఉద్యోగుల్లో ఎవరైనా ఇటీవల విదేశాలకు వెళ్లివచ్చినట్లు తెలిస్తే చాలు వారికి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ‘బీఎఫ్7’ వేరియెంట్ నగరంలో 2020 మార్చి 2న తొలి కోవిడ్ కేసు నమోదైంది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడికి తొలుత కరోనా సోకింది. అప్పట్లో ‘ఆల్ఫా’వేరియెంట్ హల్చల్ చేసింది. అనతికాలంలోనే అనేకమంది ఈ వైరస్ గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. ఆ తర్వాత ‘డెల్టా’వేరియెంట్, మూడోదశలో ‘ఒమిక్రాన్’ రూపంలో విజృంభించింది. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో సుమారు ఏడు లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా, పదివేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. గత మూడు దశల్లో కోవిడ్ సృష్టించిన నష్టాల బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత ఏడాదికాలంగా కోవిడ్ పీడ పూర్తిగా పోయిందని భావించి స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో తాజాగా ‘బీఎఫ్7’వేరియంట్ రూపంలో ఫోర్త్ వేవ్ మొదలైంది. బూస్టర్‌డోసుకు మళ్లీ డిమాండ్ తాజా వేరియంట్ హెచ్చరికలతో ఉద్యోగులు, సాధారణ ప్రజలు మళ్లీ టీకా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. బూస్టర్ డోసు వేయించుకుంటున్నారు. ఒంట్లో ఏ కొంచెం నలతగా అన్పించినా వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు అనుమానితుల తాకిడి పెరుగు తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్‌లో అలెర్ట్ దేశవిదేశాలకు చెందిన ప్రయాణికులంతా శంషాబాద్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ విమానాశ్రయం నుంచి రోజుకు సగటున 14 నుంచి 15 వేల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు. ప్రస్తుతం స్వదేశంతో పోలిస్తే విదేశాల్లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చి పోయే ప్రయాణికుల ద్వారా ఈ కొత్త వేరియంట్ దేశంలో విస్తరించే ప్రమాదం ఉండటంతో ఎయిర్‌పోర్టు యంత్రాంగం అప్రమత్తమైంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మళ్లీ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న ప్రయాణికులను గుర్తించి ఐసోలేషన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచనలు ఇవే.. ► మార్కెట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, పార్కులు, ఫంక్షన్‌హాళ్లు, రైల్వే, బస్స్టేషన్లు, గుళ్లు గోపురాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, ఇతర సందర్శనీయ ప్రదేశాలు, రాజకీయ సభలు, సమావేశాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి ప్రదేశాల్లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా, వేగంగా విస్తరించే అవకాశం ఉంది. ► రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, ఇప్పటివరకు కోవిడ్ టీకాలు తీసుకోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలు త్వరగా వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు సాధ్యమైనంత వరకు ఈ రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. విదేశీ ప్రయాణాలతోపాటు దైవదర్శనాలను వాయిదా వేసుకోవాలి. ► రద్దీ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలి. చేతులను తరచూ శానిటైజర్, సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. షేక్ హ్యాండ్‌కు బదులు రెండు చేతులతో నమస్కారం చేయడం ఉత్తమం. దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, జ్వరం లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ► వ్యక్తిగతంగా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి. ఇందుకు ఇప్పటికే ఒకటి, రెండు డోసుల టీకాలతో సరిపెట్టుకున్న వారు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలి. తాజా మాంసం, మద్యపానం, ధూమపానం వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన ప్యాక్డ్ మసాల ఆహారానికి బదులు, తాజాగా వండివార్చిన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కొత్త వేరియంట్‌ను విజయవంతంగా ఎదుర్కోవచ్చు. (క్లిక్ చేయండి: పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు కరోనా వైరస్.. బూస్టర్ డోస్ తప్పనిసరి) -
హైదరాబాద్‌లోని కొత్త అమెరికా కాన్సులేట్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: భారత్-అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే అమెరికా కాన్సులేట్ కార్యాలయం.. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన నూతన భవనంలోకి మారనుంది. నానక్రామ్గూడాలో నిర్మించిన నూతన భవనంలో 2023, జనవరి తొలివారంలోనే యూఎస్ కాన్సులేట్ సేవలు ప్రారంభం కానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడాలో 12.2 ఎకరాల్లో 297 మిలియన్ డాలర్లు వెచ్చించి అత్యాధునిక, సాంకేతిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించారు. హైదారాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. ఈ కొత్త కాన్సులేట్ కార్యాలయంలో వీసా దరఖాస్తుల కోసం 54 విండోలు పని చేయనున్నాయి. ఇదిలాఉండగా.. గత నెలలోనే బెగంపేటలోని పైగా ప్యాలెస్‌లో చివరి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వైఎస్సార్ చొరవతో.. 2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా వైఎస్సార్.. ఆయన్ను ఒప్పించడంతో తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో సౌకర్యం ఏర్పడింది. జార్జి బుష్ అమెరికా వెళ్లగానే వైఎస్సార్ కోరిక మేరకు హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇటు వైఎస్సార్ కూడా వేగంగా స్పందించి బేగంపేటలో ఉన్న పైగా ప్యాలెస్ ను కేటాయించారు. ఈ భవనంలోనే కాన్సులేట్ కార్యాలయాన్ని.. 2008 అక్టోబర్ 24న నాటి సీఎం డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. స్వాతంత్య్రం పొందిన తరువాత భారత్‌లో మొదటి అమెరికా దౌత్యపరమైన కార్యాలయం ఇదే కావటం గమనార్హం. ఈ కార్యాలయం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఇదీ చదవండి: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు యూఎస్ కాన్సులేట్ -
Hyderabad: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు యూఎస్ కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: భారత్–అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే యూఎస్ కాన్సులేట్ కార్యాలయ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. 2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా వైఎస్సార్.. ఆయన్ను ఒప్పించడంతో తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో సౌకర్యం ఏర్పడింది. జార్జి బుష్ అమెరికా వెళ్లగానే వైఎస్సార్ కోరిక మేరకు హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇటు వైఎస్సార్ కూడా వేగంగా స్పందించి బేగంపేటలో ఉన్న పైగా ప్యాలెస్‌ను కేటాయించారు. ఈ భవనంలోనే కాన్సులేట్ కార్యాలయాన్ని.. 2008 అక్టోబర్ 24న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను చూసుకున్న ఈ భవనానికి ఇదే చివరి వార్షికోత్సవం. అందులో భాగంగా 14 ఏళ్ల పాటు సేవలందించిన కార్యాలయం పైన చివరిసారిగా అమెరికా జెండాను ఎగుర వేశారు. 300 మిలియన్ డాలర్లతో నూతన కాన్సులేట్.. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వేదికగా 300 మిలియన్ డాలర్ల వ్యయంతో అత్యాధునిక, సాంకేతిక సదుపాయాలతో నిర్మించిన నూతన భవనంలోకి ఈ కాన్సులేట్ మారనుంది. అనుకోకుండా కాన్సులేట్ ప్రారంభించిన రోజునే ఈ కార్యాలయం చివరి రోజు కావడం, దీపావళి పండుగ కలిసి రావడంతో సిబ్బంది వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వీడియోను కాన్సులేట్ జనరల్ జెన్సిఫర్ లార్సన్ విడుదల చేశారు. (క్లిక్: నాగోలు ఫ్లై ఓవర్.. ఎల్బీనగర్– సికింద్రాబాద్ మధ్య ఇక రయ్రయ్) Want a sneak peak of our new consulate building? Here it is! pic.twitter.com/eu4g2Ui1uJ — Jennifer Larson (@USCGHyderabad) June 4, 2022 భారత్‌లో మొదటి శాశ్వత భవన అమెరికా దౌత్య కార్యాలయం.. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ.. భారత్–అమెరికా మధ్య సంబంధాలను మరింత ఉన్నతంగా మార్చడానికి హైదరాబాద్ అనువైన వేదిక అనే ఉద్దేశంతో యూఎస్ కాన్సులేట్‌ను ప్రారంభించామని అన్నారు. స్వాతంత్య్రం పొందిన తరువాత భారత్‌లో నిర్మించిన మొదటి అమెరికా దౌత్యపరమైన శాశ్వత భవన కార్యాలయం ఇదేనని పేర్కొన్నారు. ఈ కార్యాలయం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. We raised the American flag at US Consulate #Hyderabad at Paigah Palace fourteen years ago today. We begin a new chapter - we’ll see you soon in the new space. pic.twitter.com/XEgJSm4ZMG — Jennifer Larson (@USCGHyderabad) October 24, 2022 -
ఆఫీస్ స్పేస్.. హాట్ కేకుల్లా హైటెక్ సిటీ, మాదాపూర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. రాబోయే నాలుగేళ్లలో (2025 నాటికి) మహానగర పరిధిలో ఏకంగా 15 కోట్ల చదరపు అడుగుల విలువైన ఆఫీస్ స్పేస్ ఏర్పాటవుతుందని తాజా అధ్యయనం అంచనా వేసింది. ఇప్పటికే నగరంలో సుమారు 7 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. రాబోయే నాలుగేళ్లలో మరో 8 కోట్ల చదరపు అడుగుల లక్ష్యాన్ని చేరుకుంటుందని స్పష్టం చేయడం విశేషం. ప్రధానంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, కోకాపేట్ పరిధిలో తమ కార్యాలయాలను నెలకొల్పేందుకు బహుళజాతి, దేశీయ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ప్రముఖ రియల్టీ సంస్థ కుష్మన్ వేక్ఫీల్డ్ చేపట్టిన తాజా అధ్యయనం పేర్కొంది. ఇక మహానగరం పరిధిలో గతేడాదిగా 4 కోట్ల ఆఫీస్ స్పేస్ అదనంగా ఏర్పాటైందని తెలిపింది. కార్యకలాపాల విస్తరణ.. ► కోవిడ్.. లాక్డౌన్ కారణంగా నగరంలో పలు ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రస్తుతానికి వర్క్‌ఫ్రం హోంకు అనుమతించాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. ► రాబోయే నాలుగేళ్లలో తమ కార్యకలాపాలను నగరంలో విస్తరించేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చే అవకాశాలున్నట్లు స్పష్టం చేసింది. ► నగరంలో సుమారు 20కిపైగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు 6.5 కోట్ల ఆఫీస్‌స్పేస్‌ను ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యాయని.. చేపట్టిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. డిమాండ్– సప్లై సూత్రాల ఆధారంగానే ఈ నిర్మాణ కార్యకలాపాలు సాగుతున్నాయని పేర్కొంది. ► ప్రధానంగా ఒక్కో ప్రాంతంలో 2 లక్షల నుంచి 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నెలకొల్పుతున్నట్లు తెలిపింది. ప్రభుత్వ పరంగా పలు కార్పొరేట్, ఐటీ, బీపీఓ, కేపీఓ, స్టార్టప్ సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఐటీ, హార్డ్‌వేర్ పాలసీ తదితర కారణాల రీత్యా ఆఫీస్ స్పేస్ అభివృద్ధి విషయంలో ఏటా 5 నుంచి 10 శాతం వృద్ధి నమోదవుతోందని విశ్లేషించింది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ తర్వాత.. ► ఆఫీస్‌స్పేస్ విషయంలో దేశ వాణిజ్య రాజధాని ముందు వరుసలో ఉందట. రెండోస్థానంలో బెంగళూరు, ఢిల్లీ నగరాలు పోటాపోటీగా పురోగిస్తున్నాయట. ఈ మెట్రో సిటీల తర్వాత మూడో స్థానంలో మన గ్రేటర్ హైదరాబాద్ నగరం నిలిచినట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ► నగరంలో ఫోనిక్స్, ఆర్ఎంజెడ్, సాలార్‌పూర్ సత్వ, కె.రహేజా గ్రూప్, దివ్యశ్రీ డెవలపర్స్, జీఏఆర్ కార్పొరేషన్, వంశీరామ్ బిల్డర్స్ తదితర ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు 2025 నాటికి సుమారు 6.5 కోట్ల చదరపు అడుగుల మేర ఆఫీస్‌స్పేస్‌ను ఏర్పాటుచేసే అవకాశాలున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. -
ఆధునికతకు అద్దం పట్టే ‘గిఫ్ట్’
న్యూఢిల్లీ : హాంకాంగ్, సింగపూర్ సహా అంతర్జాతీయ వాణిజ్య హబ్‌లకు దీటుగా అహ్మదాబాద్‌లో అత్యంతాధునిక వసతులతో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్) రూపొందుతోంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్ధలకు తగిన మౌలిక వసతులు, సౌకర్యాలతో పాటు నైపుణ్యాలతో కూడిన భారతీయ యువత అందుబాటులో ఉంటాయని ఈ మెగా ప్రాజెక్టు నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత వాణిజ్య సేవల రంగం అత్యంత వేగంగా పురోగమిస్తూ 2020 నాటికి కోటికిపైగా ఉద్యోగాలను సమకూర్చుతుందని, జీడీపీకి రూ రెండు లక్షల కోట్లను సమకూర్చనుందని ఈ డ్రీమ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నఅధికారులు పేర్కొన్నారు. గిఫ్ట్ సిటీలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్‌ల మధ్య మెరుగైన మౌలిక వసతులు, రవాణా కనెక్టివిటీలతో సెంట్రల్ బిజినెస్ డిస్ర్టిక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. క్యాపిటల్ మార్కెట్లు, వాణిజ్య, ఐటీ రంగాల్లో పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు లక్షలాది మందికి పరోక్ష ఉపాధి కల్పిస్తామని డెవలపర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7 శాతం పైగా ఉంటుందన్న ఐఎంఎఫ్ అంచనాలూ గిఫ్ట్ సిటీలో నూతనోత్తేజం నింపాయి. గిఫ్ట్‌తో మారనున్న రూపురేఖలు పెరుగుతున్న జనాభాతో పాటు కాలుష్యం, ఇతర రిస్క్‌లతో ప్రపంచ నగరాలు సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో చెత్త నుంచి అత్యాధునిక సౌకర్యాలతో గిఫ్ట్ వంటి నగరాల నిర్మాణం వినూత్న పరిణామంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక పేర్కొంది. నాలుగో పారిశ్రామిక విప్లవానికి ప్రపంచ నగరాలు సంసిద్ధం కావాల్సి ఉందని ఈ నివేదిక పిలుపు ఇచ్చింది. ఆధునిక భవంతులు, స్మార్ట్ ఇన్ఫ్రాస్ర్టక్చర్లతో గిఫ్ట్ వంటి నగరాల ఆవశ్యకత ఉందని పేర్కొంది. -
నగరంలో బడా నిర్మాణాలు!
* గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్పైనే దృష్టి * ప్రెస్టిజ్, పూర్వాంకర సంస్థల ప్రాజెక్ట్‌లు సాక్షి, హైదరాబాద్: నగర స్థిరాస్తి రంగంలో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మార్కెట్ ఒక్కసారిగా మెరుగైతే.. అనూహ్యంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో బెంగళూరు, పుణే, అహ్మదాబాద్ వంటి ఇతర నగరాలకు చెందిన నిర్మాణ సంస్థలు హైదరాబాద్‌లో నిర్మాణాలను ప్రకటించాయి. - తెలంగాణ ప్రభుత్వం నగరాభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌కు ఢోకా లేదన్న సంకేతాలను అందించాయనడంలో సందేహం లేదు. రియల్టీ రంగంలో పరిస్థితులు సానుకూలంగా కన్పించినా.. ప్రాజెక్టులను సందర్శించే వారి సంఖ్య పెరుగుతున్నా.. కొన్న వారు మాత్రం తక్కువేనన్నది వాస్తవం. ప్రాంతం, ధర, సదుపాయాలు, నిర్మాణ ప్రగతి మెరుగ్గా ఉన్న ప్రాజెక్టుల్లో విక్రయాలు బాగానే ఉంటున్నాయన్నది బిల్డర్ల మాట. ప్రెస్టిజ్, పూర్వాంకర ప్రాజెక్ట్‌లు.. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్ల చుట్టూ గల ప్రాంతాల్లో చేపట్టే నిర్మాణాలకు గిరాకీ ఎప్పటికైనా ఉంటుంది. అందుకే బెంగళూరుకు చెందిన ప్రెస్టిజ్ గ్రూప్ కొండాపూర్‌లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రెండు భారీ ప్రాజెక్ట్‌లను ప్రకటించింది. కొండాపూర్‌లో సుమారు 4.96 ఎకరాల్లో 17 అంతస్థుల్లో 349 ఫ్లాట్లను, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 21.85 ఎకరాల్లో 28-34 అంతస్థుల్లో 2,240 ఫ్లాట్లు గల ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. పూర్వాంకర గ్రూప్ కొండాపూర్‌లో పూర్వ సమ్మిట్ పేరుతో గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. అలాగే నార్సింగిలో పుణేకి చెందిన ఆక్యురేట్ డెవలపర్స్ 6.5 ఎకరాల్లో 722 ఫ్లాట్లు గల నిర్మాణాన్ని జీ+12 అంతస్థుల్లో నిర్మించనుంది. కేవలం క్లబ్‌హౌస్ కోసమే 30 వేల చ.అ. స్థలాన్ని కేటాయించారు. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పసిఫికా సంస్థ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హిల్ క్రెస్ట్ ప్రాజెక్ట్‌ను ఆరంభించడానికి సన్నాహాలు చేస్తోంది. మొత్తం నిర్మాణం వచ్చేది 40 ఎకరాల్లో కాగా.. తొలి విడతగా 684 ఫ్లాట్లను నిర్మించాలని ప్రణాళిక. తెలుసుకున్నాకే.. అడుగేయండి! బిల్డరైనా.. జనాలైనా స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేముందు మార్కెట్ గురించి, లోకేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాక సరైన ప్లానింగ్ తో, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ.. నాణ్యమైన, నమ్మకమైన ప్రాజెక్ట్‌లను కట్టాలని’’ సూచిస్తున్నారు రామ్ డెవలపర్స్ ఎండీ రాము వనపర్తి. అప్పుడే మార్కెట్లో నిలబడటమే కాకుండా.. కొనుగోలుదారులూ స్వాగతిస్తారంటున్నారు. అందుకే నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించాం. - చిక్కడపల్లిలో 475 గజాల్లో ‘మేఫెయిర్ అవెన్యూస్’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందు లో 1,195-1,475 చ.అ. విస్తీర్ణాలుండే 2,3 బీహెచ్‌కే ఫ్లాట్లు ఎనిమిదొస్తాయి. ధర చ.అ.కు రూ.5,250. - పంజగుట్టలో 550 గజాల్లో ‘రామ్ మిడోస్’ను నిర్మిస్తున్నాం. ఇందులో 8 ఫ్లాటొస్తాయి. అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ధర చ.అ.కు రూ.7 వేలు. ఇదే ప్రాంతంలో 1,050 గజాల్లో ఎలైట్ హాబిటేట్నూ నిర్మిస్తున్నాం. ఇందులో 15 ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.7,500. - బేగంపేట షాపర్స్‌స్టాప్ వెనక 720 గజాల్లో 8 ఫ్లాట్లుండే ఓ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ధర చ.అ.కు రూ.6 వేలు. - బెంగళూరులోనూ పలు ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నాం. కేఆర్ పురంలో 650 గజాల్లో 20 ఫ్లాట్లుండే ప్రాజెక్ట్, ఆల్సూర్లో 480 గజాల్లో 8 ఫ్లాట్లుండే మరో ప్రాజెక్ట్‌నూ నిర్మిస్తున్నాం. అలాగే తనిసంద్రలో 155 ఫ్లాట్లుండే ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇంకా రావాల్సి ఉంది.