
సాక్షి, హైదరాబాద్: భారత్-అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే అమెరికా కాన్సులేట్ కార్యాలయం.. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన నూతన భవనంలోకి మారనుంది. నానక్‌రామ్‌గూడాలో నిర్మించిన నూతన భవనంలో 2023, జనవరి తొలివారంలోనే యూఎస్ కాన్సులేట్ సేవలు ప్రారంభం కానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడాలో 12.2 ఎకరాల్లో 297 మిలియన్ డాలర్లు వెచ్చించి అత్యాధునిక, సాంకేతిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించారు. హైదారాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. ఈ కొత్త కాన్సులేట్ కార్యాలయంలో వీసా దరఖాస్తుల కోసం 54 విండోలు పని చేయనున్నాయి. ఇదిలాఉండగా.. గత నెలలోనే బెగంపేటలోని పైగా ప్యాలెస్‌లో చివరి వార్షికోత్సవాన్ని నిర్వహించారు.
వైఎస్సార్ చొరవతో..
2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా వైఎస్సార్.. ఆయన్ను ఒప్పించడంతో తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో సౌకర్యం ఏర్పడింది.
జార్జి బుష్ అమెరికా వెళ్లగానే వైఎస్సార్ కోరిక మేరకు హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇటు వైఎస్సార్ కూడా వేగంగా స్పందించి బేగంపేటలో ఉన్న పైగా ప్యాలెస్ ను కేటాయించారు. ఈ భవనంలోనే కాన్సులేట్ కార్యాలయాన్ని.. 2008 అక్టోబర్ 24న నాటి సీఎం డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. స్వాతంత్య్రం పొందిన తరువాత భారత్‌లో మొదటి అమెరికా దౌత్యపరమైన కార్యాలయం ఇదే కావటం గమనార్హం. ఈ కార్యాలయం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది.
ఇదీ చదవండి: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు యూఎస్ కాన్సులేట్
Comments
Please login to add a commentAdd a comment