Consulate of the United States
-
HYD: హైటెక్నాలజీతో యూఎస్ కాన్సులేట్.. ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాంక్!
హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. యూఎస్ కాన్సులేట్ సేవలు నానక్‌రాంగూడలోని నూతన కార్యాలయం నుంచి మంగళవారం ప్రారంభమయ్యాయి. బేగంపేట నుంచి నానక్‌రాంగూడలో కొత్తగా నిర్మించిన కార్యాలయానికి మారిన తర్వాత పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నామని కాన్సులేట్ అధికారులు తెలిపారు. మొదటి యూఎస్ పాస్‌పోర్టును జారీచేసినట్టు ఫొటోలను కాన్సులేట్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ఖర్చు ఎంతో తెలుసా.. అయితే, హైదరాబాద్ నగరంలో ఆసియాలోనే అతిపెద్ద, విశాలమైన అమెరికన్ కాన్సులేట్ కట్టి అగ్రరాజ్యం నిర్మించింది. దాదాపు 2800 కోట్లు(340 మిలియన్ యూఎస్ డాలర్స్) ఖర్చుతో ఆధునిక భవనాన్ని నిర్మించింది. దాదాపు 12.2 ఎకరాల విస్తీర్ణంలో హై టెక్నాలజీతో ఈ భవనాన్ని నిర్మించింది. కాగా, తెలుగు రాష్ట్రాలు, దేశం నుంచి అమెరికాకు స్టూడెంట్ వీసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఓ పెద్ద ఆఫీసును నిర్మించాలని అమెరికా 2017లోనే కాన్సులేట్ భవన నిర్మాణానికి ప్లాన్ చేసింది. ఇందుకు కావాల్సిన సదుపాయాలు, డబ్బులను అమెరికా ప్రభుత్వం కేటాయించింది. కానీ, కోవిడ్ కారణం భవన నిర్మాణం కొంచెం ఆలస్యమైంది. హైదరాబాదే స్పెషల్.. ఇక, తాజాగా భవన నిర్మాణం పూర్తి కావడంతో మంగళవారం నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త కాన్సులేట్ నుంచి పాస్‌పోర్టులను కూడా జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఇండియాలో ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ కాకుండా వీసా కార్యకలాపాలు, దౌత్య కార్యకలాపాల కోసం దేశవ్యాప్తంగా నాలుగు కాన్సులేట్స్ ఉన్నాయి. వీటన్నింటిలో అతిపెద్దదిగా ఇప్పుడు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ గుర్తింపు పొందింది. వీసా కోసం.. వీసా ఇంటర్వ్యూ అవసరం ఉన్నవారు మొదట హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌లోని వీసా అప్లికేషన్ సెంటర్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ కూడా అక్కడే తీసుకుంటారు. వీసా రెన్యువల్ కోసం ఇంటర్వ్యూ మినహాయింపు కలిగిన వారు వీసా అప్లికేషన్ సెంటర్లో డాక్యుమెంట్స్ దాఖలు చేస్తే చాలు. ఇంటర్వ్యూ అవసరం ఉన్నవారు మరో రోజు నానాక్‌రాంగూడలోని కొత్త అమెరికన్ కాన్సులెట్ కార్యాలయానికి వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. Yesterday, @usandhyderabad opened a new state-of-the-art facility in the city’s bustling Financial District. This new Consulate chancery represents a tangible investment by the United States in growing the U.S.-India bilateral relationship. pic.twitter.com/EApWzxY3Ud — Vedant Patel (@StateDeputySpox) March 21, 2023 కాగా, కొత్త కాన్సులేట్ నుంచి తెలంగాణ, ఏపీ, ఒడిషా రాష్ట్రాలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ తెలిపారు. మరోవైపు, వాషింగ్టన్లో అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వేదాంత్ పటేల్ స్పందిస్తూ.. కొత్త భవనాన్ని పూర్తి పర్యావరణహితంగా నిర్మిణించినట్టు స్పష్టం చేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి శుద్ధిచేసేలా.. మళ్లీ ఆ నీటిని తిరిగి వినియోగించుకునేలా నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. అలాగే, ఇండియా నుంచి అమెరికాలో పెట్టుబడులను కూడా ప్రోత్సహించడానికి నూతన కాన్సులేట్ దోహదపడుతుందని అన్నారు. Here’s a short video on how one can reach the Visa Application Center (VAC), located at the Lower Concourse, HITEC City Metro Station, Madhapur, HYD 500081. pic.twitter.com/hyJuhzrIBR — U.S. Consulate General Hyderabad (@USAndHyderabad) March 17, 2023 -
హైదరాబాద్‌లోని కొత్త అమెరికా కాన్సులేట్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: భారత్-అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే అమెరికా కాన్సులేట్ కార్యాలయం.. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన నూతన భవనంలోకి మారనుంది. నానక్రామ్గూడాలో నిర్మించిన నూతన భవనంలో 2023, జనవరి తొలివారంలోనే యూఎస్ కాన్సులేట్ సేవలు ప్రారంభం కానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడాలో 12.2 ఎకరాల్లో 297 మిలియన్ డాలర్లు వెచ్చించి అత్యాధునిక, సాంకేతిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించారు. హైదారాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. ఈ కొత్త కాన్సులేట్ కార్యాలయంలో వీసా దరఖాస్తుల కోసం 54 విండోలు పని చేయనున్నాయి. ఇదిలాఉండగా.. గత నెలలోనే బెగంపేటలోని పైగా ప్యాలెస్‌లో చివరి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వైఎస్సార్ చొరవతో.. 2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా వైఎస్సార్.. ఆయన్ను ఒప్పించడంతో తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో సౌకర్యం ఏర్పడింది. జార్జి బుష్ అమెరికా వెళ్లగానే వైఎస్సార్ కోరిక మేరకు హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇటు వైఎస్సార్ కూడా వేగంగా స్పందించి బేగంపేటలో ఉన్న పైగా ప్యాలెస్ ను కేటాయించారు. ఈ భవనంలోనే కాన్సులేట్ కార్యాలయాన్ని.. 2008 అక్టోబర్ 24న నాటి సీఎం డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. స్వాతంత్య్రం పొందిన తరువాత భారత్‌లో మొదటి అమెరికా దౌత్యపరమైన కార్యాలయం ఇదే కావటం గమనార్హం. ఈ కార్యాలయం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఇదీ చదవండి: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు యూఎస్ కాన్సులేట్ -
Hyderabad: నూతన భవనంలోకి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్
-
నూతన భవనంలోకి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ త్వరలోనే నూతన భవనంలోకి మారనుంది. బేగంపేటలోని పైగా ప్యాలస్‌లో 14 ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తోంది అమెరికా దౌత్య కార్యాలయం. 2008, అక్టోబర్ 24న హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌లో అమెరికా జెండా తొలిసారి ఎగిరింది. పైగా ప్యాలస్‌లోని కాన్సులేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి అక్కడ ఇదే చివరి వార్షికోత్సవం కానుంది. త్వరలోనే సుమారు 300 మిలియన్ డాలర్లతో నిర్మించిన కొత్త భవనంలోకి మారనున్నారు. ఈ క్రమంలో పైగా ప్యాలస్‌లో కాన్సులేట్ స్టాఫ్ తుది వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి నూతన భవనంలో అమెరికా జెండాను ఎగురవేయనున్నారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలతో అగ్రరాజ్య సంబంధాలను పర్యవేక్షిస్తోంది. ఇదీ చదవండి: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. -
ప్రతీకార చర్యలు ప్రారంభించిన చైనా
బీజింగ్: అమెరికా, చైనా మధ్య దౌత్య యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనరల్‌ను మూసివేయించడంతో చైనా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఆగ్నేయ సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూలోని అమెరికా కాన్సులేట్‌ను మూసివేయాలని ఆదేశించినట్టు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘చైనా అమెరికా మధ్య సంబంధాలు ఇలా క్షీణించాలని మేము కోరుకోవడం లేదు. దీనికంతటికీ అమెరికాదే బాధ్యత. అమెరికా తన తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకొని ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం’’అని ఆ ప్రకటన పేర్కొంది. భద్రతకు భంగం కలిగిస్తున్నారు హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ గూఢచర్య ఆరోపణలకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించినట్టుగానే చైనా కూడా అదే బాటలో నడిచింది. చెంగ్డూ కాన్సులేట్‌లో పనిచేసే సిబ్బంది చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకుంటూ దేశ భద్రతా ప్రయోజనాలకు హాని తలపెడుతున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. హ్యూస్టన్‌లో కాన్సులేట్ మూసివేయాలన్న అమెరికా నిర్ణయానికి ఇది సరైన ప్రతిస్పందనని ఆయన అన్నారు. తమ నిర్ణయం చట్టబద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. అమెరికాకి వ్యూహాత్మక ప్రాంతం చెంగ్డూలో అమెరికా కాన్సులేట్‌ని 1985లో ప్రారంభించారు. అందులో 200మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 150 మందికిపైగా స్థానికులే. సమస్యాత్మక ప్రాంతమైన టిబెట్ గురించి సమాచారాన్ని సేకరించడానికి చెంగ్డూలో కాన్సులేట్ అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైనది. అంతేకాదు హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ ఎంత పెద్దదో, ఎందరు ఉద్యోగులు ఉంటారో, సరిగ్గా చెంగ్డూలో కూడా అంతే మంది పనిచేస్తారు. వాటి ప్రాధాన్యాలు కూడా ఒకటే. తొలుత వూహాన్లో అమెరికా కాన్సులేట్ మూసివేయాలన్న ఆదేశాలిస్తారని భావించారు కానీ చెంగ్డూ అయితేనే దెబ్బకి దెబ్బ తీసినట్టు అవుతుందని చైనా ప్రభుత్వం భావించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో చైనా విద్యార్థుల అరెస్ట్ వీసాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నలుగురు చైనీయులపై కేసు నమోదు చేసింది. వీరు చైనా సైన్యంలో పనిచేసినప్పటికీ, ఆ వివరాలు దాచిపెట్టి, రీసెర్చ్ కోసం అమెరికాకి వచ్చినట్టు ఆరోపించింది. ఇందులో ముగ్గురిని ఎఫ్‌బీఐ అరెస్టు చేయగా, నాలుగో వ్యక్తి శాన్ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్ కార్యాలయంలో ఆశ్రయం పొందినట్లు వారు చెప్పారు. వీరందరిపై వీసా మోసానికి సంబంధించిన కేసు నమోదయ్యింది. నేర నిరూపణ అయితే పదేళ్ల జైలు శిక్ష, రూ.1.88 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
హైదరాబాద్‌లో అతిపెద్ద యూఎస్ కాన్సులేట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో యూఎస్ కాన్సులేట్ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో రానుంది. ముంబైలో ఉన్న దౌత్య కార్యాలయం కంటే ఇది భారీగా ఉంటుందని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ వెల్లడించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శుక్రవారం ఏర్పాటు చేసిన సీఈవో ఫోరం సదస్సులో ఆయన మాట్లాడారు. గచ్చిబౌలిలో 18 నెలల్లో ఇది అందుబాటులోకి రానుందని చెప్పారు. -
మహాత్మునికి వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి తదితరులు కూడా పాల్గొని మహాత్మునికి నివాళులర్పించారు. జగన్‌ను కలసిన యూఎస్ కాన్సులేట్ జనరల్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా బుధవారం లోటస్‌పాండ్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించారు. -
విజయవాడలో అమెరికా కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: విజయవాడలో తమ దేశ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని అమెరికా ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చింది. విజయవాడ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున అక్కడ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం చేసిన విజ్ఞప్తిపై ఆ దేశ ప్రతినిధి బృందం స్పందించినట్లు ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా రాజకీయ, సైనిక వ్యవహారాల సహాయ మంత్రి పునీత్ తల్వార్, ఉప, సహాయ మంత్రులు అతుల్ కాశ్యప్, కెన్నెత్ హ్యాండిల్కన్, కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ తదితరులు మంగళవారం సచివాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. నూతన రాష్ట్ర తీరు, తెన్నులను అడిగి తెలుసుకున్నారు. నూతన రాజధాని నగర నిర్మాణాన్ని రెండు,మూడు నెలల్లో చేపడతామని అమెరికా బృందానికి చంద్రబాబు తెలిపారు. రక్షణ, సాంకేతిక రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్న అమెరికా ప్రతిపాదనను స్వాగతించిన సీఎం.. తూర్పు నావికాదళానికి విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తోందని వివరించినట్లు ప్రకటన పేర్కొంది. నేడు రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందాలు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల ప్రతినిధి బృందం బుధ, గురువారాల్లో హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో పర్యటించనుంది. కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అపర్ణా భాటియా నేతృత్వంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు కంట్రీ డెరైక్టర్ ఎం.తెరెసా ఖో, ప్రపంచ బ్యాంకు కంట్రీ డెరైక్టర్ ఓన్నో రుహి తదితరులు ఈ పర్యటనలో పాల్గొంటారు. ఈ బృందం బుధవారం హైదరాబాద్ చేరుకుని గురువారం విశాఖపట్నం వెళుతుంది.