Increasing Demand for Office Space in Hitech City | Hyderabad - Sakshi
Sakshi News home page

ఆఫీస్‌ స్పేస్‌.. హాట్‌ కేకుల్లా హైటెక్‌ సిటీ, మాదాపూర్

Published Tue, Aug 3 2021 4:27 PM | Last Updated on Wed, Aug 4 2021 1:28 PM

Office Space in Hyderabad: HiTec City, Madhapur, Financial District, Kokapet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతోంది. రాబోయే నాలుగేళ్లలో (2025 నాటికి) మహానగర పరిధిలో ఏకంగా 15 కోట్ల చదరపు అడుగుల విలువైన ఆఫీస్‌ స్పేస్‌ ఏర్పాటవుతుందని తాజా అధ్యయనం అంచనా వేసింది. ఇప్పటికే నగరంలో సుమారు 7 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

రాబోయే నాలుగేళ్లలో మరో 8 కోట్ల చదరపు అడుగుల లక్ష్యాన్ని చేరుకుంటుందని స్పష్టం చేయడం విశేషం. ప్రధానంగా హైటెక్‌ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా, కోకాపేట్‌ పరిధిలో తమ కార్యాలయాలను నెలకొల్పేందుకు బహుళజాతి, దేశీయ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ప్రముఖ రియల్టీ సంస్థ కుష్మన్‌ వేక్‌ఫీల్డ్‌ చేపట్టిన తాజా అధ్యయనం పేర్కొంది. ఇక మహానగరం పరిధిలో గతేడాదిగా 4 కోట్ల ఆఫీస్‌ స్పేస్‌ అదనంగా ఏర్పాటైందని తెలిపింది. 

కార్యకలాపాల విస్తరణ.. 
► కోవిడ్‌.. లాక్‌డౌన్‌ కారణంగా నగరంలో పలు ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రస్తుతానికి వర్క్‌ఫ్రం హోంకు అనుమతించాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఈ అధ్యయనం అంచనా వేసింది.   

► రాబోయే నాలుగేళ్లలో తమ కార్యకలాపాలను నగరంలో విస్తరించేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చే అవకాశాలున్నట్లు స్పష్టం చేసింది.  

► నగరంలో సుమారు 20కిపైగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు 6.5 కోట్ల ఆఫీస్‌స్పేస్‌ను ఏర్పాటు చేసే  పనుల్లో నిమగ్నమయ్యాయని.. చేపట్టిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. డిమాండ్‌– సప్లై సూత్రాల ఆధారంగానే ఈ నిర్మాణ కార్యకలాపాలు సాగుతున్నాయని పేర్కొంది. 

► ప్రధానంగా ఒక్కో ప్రాంతంలో 2 లక్షల నుంచి 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నెలకొల్పుతున్నట్లు తెలిపింది. ప్రభుత్వ పరంగా పలు కార్పొరేట్, ఐటీ, బీపీఓ, కేపీఓ, స్టార్టప్‌ సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఐటీ, హార్డ్‌వేర్‌ పాలసీ తదితర కారణాల రీత్యా ఆఫీస్‌ స్పేస్‌ అభివృద్ధి విషయంలో ఏటా 5 నుంచి 10 శాతం వృద్ధి నమోదవుతోందని విశ్లేషించింది. 

ముంబై, బెంగళూరు, ఢిల్లీ తర్వాత..  
► ఆఫీస్‌స్పేస్‌ విషయంలో దేశ వాణిజ్య రాజధాని ముందు వరుసలో ఉందట. రెండోస్థానంలో బెంగళూరు, ఢిల్లీ నగరాలు పోటాపోటీగా పురోగిస్తున్నాయట. ఈ మెట్రో సిటీల తర్వాత మూడో స్థానంలో మన గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం నిలిచినట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.  

► నగరంలో ఫోనిక్స్, ఆర్‌ఎంజెడ్, సాలార్‌పూర్‌ సత్వ, కె.రహేజా గ్రూప్, దివ్యశ్రీ డెవలపర్స్, జీఏఆర్‌ కార్పొరేషన్, వంశీరామ్‌ బిల్డర్స్‌ తదితర ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు 2025 నాటికి సుమారు 6.5 కోట్ల చదరపు అడుగుల మేర ఆఫీస్‌స్పేస్‌ను ఏర్పాటుచేసే అవకాశాలున్నాయని ఈ అధ్యయనం తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement