న్యూఢిల్లీ : హాంకాంగ్, సింగపూర్ సహా అంతర్జాతీయ వాణిజ్య హబ్‌లకు దీటుగా అహ్మదాబాద్‌లో అత్యంతాధునిక వసతులతో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్) రూపొందుతోంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్ధలకు తగిన మౌలిక వసతులు, సౌకర్యాలతో పాటు నైపుణ్యాలతో కూడిన భారతీయ యువత అందుబాటులో ఉంటాయని ఈ మెగా ప్రాజెక్టు నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
భారత వాణిజ్య సేవల రంగం అత్యంత వేగంగా పురోగమిస్తూ 2020 నాటికి కోటికిపైగా ఉద్యోగాలను సమకూర్చుతుందని, జీడీపీకి రూ రెండు లక్షల కోట్లను సమకూర్చనుందని ఈ డ్రీమ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నఅధికారులు పేర్కొన్నారు. గిఫ్ట్ సిటీలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్‌ల మధ్య మెరుగైన మౌలిక వసతులు, రవాణా కనెక్టివిటీలతో సెంట్రల్ బిజినెస్ డిస్ర్టిక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు.
క్యాపిటల్ మార్కెట్లు, వాణిజ్య, ఐటీ రంగాల్లో పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు లక్షలాది మందికి పరోక్ష ఉపాధి కల్పిస్తామని డెవలపర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7 శాతం పైగా ఉంటుందన్న ఐఎంఎఫ్ అంచనాలూ గిఫ్ట్ సిటీలో నూతనోత్తేజం నింపాయి.
గిఫ్ట్‌తో మారనున్న రూపురేఖలు
పెరుగుతున్న జనాభాతో పాటు కాలుష్యం, ఇతర రిస్క్‌లతో ప్రపంచ నగరాలు సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో చెత్త నుంచి అత్యాధునిక సౌకర్యాలతో గిఫ్ట్ వంటి నగరాల నిర్మాణం వినూత్న పరిణామంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక పేర్కొంది. నాలుగో పారిశ్రామిక విప్లవానికి ప్రపంచ నగరాలు సంసిద్ధం కావాల్సి ఉందని ఈ నివేదిక పిలుపు ఇచ్చింది. ఆధునిక భవంతులు, స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌లతో గిఫ్ట్ వంటి నగరాల ఆవశ్యకత ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment