![CREDAI Urges Central Govt To Announce Relief Package For Realty Sector - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/11/Realty-Sector.jpg.webp?itok=Gm9m_RJC)
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ కార్మికుల కొరత, ఆర్థిక పరిమితులు, అనుమతుల జారీలో జాప్యం, పెరిగిన నిర్మాణ వ్యయాలు, క్షీణించిన కస్టమర్ల డిమాండ్‌లతో దేశీయ రియల్ ఎస్టేట్ రంగం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రభావం రియల్టీ రంగాన్ని కుంగదీసింది. ఈ రంగాన్ని 90 శాతం నష్టాల్లోకి నెట్టేసిందని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలిపింది.
ఆదుకోవాలి
కరోనా సెకండ్ వేవ్‌తో దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఆక్సిజన్ అందించేందుకు ప్రభుత్వం బెయిల్‌ఔట్ ప్యాకేజీని ప్రకటించాలని క్రెడాయ్ చైర్మన్ సతీష్ మాగర్ కోరారు. డెవలపర్లకు రుణ రీస్ట్రక్చరింగ్‌కు అనుమతి ఇవ్వటంతో పాటు ఈ రంగంలో ద్రవ్యతను పెంచడం కోసం అన్ని రకాల రుణాల మొత్తం, వడ్డీల మీద 6 నెలల పాటు మారటోరియాన్ని విధించాలని సూచించారు. స్పెషల్ మెన్షన్ అకౌంట్స్ (ఎస్‌ఎంఏ) వర్గీకరణను మరొక ఏడాది పాటు స్తంభింపచేయాలని కోరారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో నిర్మాణ గడువు సమయాన్ని అదనంగా 6 నెలలు పొడిగించాలని, కొనుగోలుదారుల డిమాండ్‌ను ఏర్పరిచేందుకు స్టాంప్‌డ్యూటీని తగ్గింపు లేదా మాఫీ చేయాలని తెలిపారు. సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా నిర్మాణ అనుమతుల వేగవంతం చేయడంతో పాటు నిర్మాణ సామగ్రి ధరలను తగ్గించాలని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉద్యోగ అవకాశాల పరిశ్రమ రియల్ ఎస్టేట్. స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ)లో రియల్టీ వాటా 6–7 శాతం వరకు ఉంది.
10–20 శాతం ధరల వృద్ధి
దేశంలో గత కొన్ని వారాలుగా స్టీల్ తయారీదారులు కుమ్మక్కు అయ్యి 40–50 శాతం మేర ధరలను పెంచారని.. దీంతో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగిందని క్రెడాయ్ ప్రెసిడెంట్ హర్షవర్థన్ పటోడియా తెలిపారు. ఇందువల్ల దీర్ఘకాలంలో గృహాల ధరలు 10–20 శాతం మేర పెరుగుతాయని చెప్పారు. నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలను డెవలపర్లు భరించే స్థాయిలో లేరని.. అయితే ఈ ధరల వృద్ధి ప్రభావం ప్రస్తుతం ఉన్న కస్టమర్ల మీద పడదని, అయితే కొత్త విక్రయాలతో ప్రారంభమవుతుందని క్రెడాయ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ బోమన్ ఇరానీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment