శ్రీశైలం రహదారి సొంతింటికి సరైన దారి! | Srisailam road is the right way to own house! | Sakshi
Sakshi News home page

శ్రీశైలం రహదారి సొంతింటికి సరైన దారి!

Published Sat, Feb 17 2018 2:55 AM | Last Updated on Mon, Feb 19 2018 2:48 PM

Srisailam road is the right way to own house! - Sakshi

హైదరాబాద్‌ రియల్‌ రంగ ముఖ చిత్రాన్ని మార్చే దమ్మున్న ప్రాజెక్ట్‌.. ఫార్మా సిటీ! ఫ్యాబ్‌ సిటీ, హార్డ్‌వేర్‌ పార్క్‌లతో ఇప్పటికే జోరుమీదున్న శ్రీశైలం జాతీయ రహదారిలో ఫార్మా సిటీతో మరింత హుషారొచ్చింది. ఓఆర్‌ఆర్‌ మీదుగా తక్కువ సమయంలో ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్‌ సెజ్‌లకు, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే వీలుండటంతో కొనుగోలుదారులే కాదండోయ్‌.. పెట్టుబడిదారులూ శ్రీశైలం రహదారి వైపు దృష్టిసారించారు. దీంతో ఈ ప్రాంతంలో భారీ లే అవుట్లు, వెంచర్లతో పాటూ ప్రీమియం విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలూ వెలుస్తున్నాయి. భవిష్యత్తు అభివృద్ధికి, పెట్టుబడికి ఢోకాలేని ప్రాంతం శ్రీశైలం రహదారే!


సాక్షి, హైదరాబాద్‌ :  హైదరాబాద్‌ చుట్టూ ఉన్న జాతీయ రహదార్లలో ఒక్క శ్రీశైలం రహదారి మినహా అన్ని దార్లలోనూ స్థిరాస్తి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వరంగల్‌ హైవేలో చూస్తే.. నగరం నుంచి 50 కి.మీ. వరకూ ఎకరం ధర రూ.కోటి పైనే. ముంబై, బెంగళూరు హైవేల్లోనూ కోటిన్నర పైమాటే. ఇక, షామీర్‌పేట్, శంకర్‌పల్లి రహదారిలో అయితే రూ.2 కోట్లకెక్కువే. మరి, నేటికీ సామాన్య, మధ్యతరగతికి అందుబాటులో ఉన్న ప్రాంతమేందయ్యా అంటే.. ఒక్క శ్రీశైలం రహదారి మాత్రమే! ముచ్చర్లలో ప్రతిపాదిత ఫార్మా సిటీ, రీజినల్‌ రింగ్‌ రోడ్డులతో సమీప భవిష్యత్తులో శ్రీశైలం రహదారిలో రియల్‌ పరుగులు పెట్టడం ఖాయమని రియల్టీ నిపుణులు ధీమావ్యక్తం చేస్తున్నారు.

ఫార్మా సిటీ చుట్టూ అభివృద్ధి..
ఐటీ తర్వాత అధిక శాతం మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించేది ఫార్మా రంగమే. తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్లలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఫార్మా సిటీ రాకతో శ్రీశైలం రహదారి అభివృద్ధి దశే మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘ఐడీఏ బొల్లారం, పాశమైలారం తదితర ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమల వల్ల మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల వరకూ అభివృద్ధి విస్తరించింది.

అలాగే గతంలో బేగంపేట్‌లో విమానాశ్రయం ఉన్నప్పుడు సనత్‌నగర్, బోయిన్‌పల్లి వంటి ప్రాంతాలకు ఎలాగైతే అభివృద్ధి చెందాయో.. శంషాబాద్‌ విమానాశ్రయం శ్రీశైలం రహదారికి చేరువలో ఉండటంతో సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశముందని’’ మాతృభూమి ఫామ్‌ ల్యాండ్స్‌ సీఎండీ కొత్త మనోహర్‌ రెడ్డి తెలిపారు. ఫార్మాసిటీని అనుసంధానిస్తూ రీజినల్‌ రింగ్‌ రోడ్డు కూడా రానుంది. ఇది షాద్‌నగర్‌ నుంచి తలకొండపల్లి మీదుగా ఫార్మాసిటీకి అనుసంధానమై ఉంటుంది. ఇప్పటికే శ్రీశైలం ర హదారిలో ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్‌ పార్క్‌లున్నాయి. మొత్తంగా స్థిరాస్తి కొనుగోళ్లు, పెట్టుబడులకు శ్రీశైలం రహదారి సరైన ప్రాంతమని నిపుణులు సూచిస్తున్నారు.

లే అవుట్లు, విల్లాలకు డిమాండ్‌..
శ్రీశైలం రహదారిలో అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లతో పాటూ లే అవుట్ల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. మాతృభూమి, రాంకీ, మ్యాక్, ఫార్చ్యూన్, ప్రజయ్, వీడియోకాన్, విశాల్‌ వంటి నిర్మాణ సంస్థలు ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నాయి. కందుకూరు నుంచి ఆదిభట్లకు 15 కి.మీ. దూరం. దీంతో ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్‌ ఉద్యోగులు శ్రీశైలం రహదారిలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు.

30 కి.మీ దూరంలో ఎల్బీనగర్, ఆదిభట్ల ప్రాంతాలుండడంతో విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకూ కొదవేలేదు. కృష్ణా జలాల సరఫరా, విద్యుత్‌ ఉపకేంద్రంతో మౌలిక వసతులూ మెరుగ్గానే ఉన్నాయి. ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు కేంద్ర బిందువుగా మారనున్న తలకొండపల్లిలో ప్రస్తుతం ఎకరం రూ.20 లక్షల లోపు ఉన్నది కాస్త సమీప భవిష్యత్తులో కోటి దాటుతుందని అంచనా.


హాట్‌స్పాట్స్‌ ప్రాంతాలివే..
శ్రీశైలం రహదారిలో కందుకూరు, కడ్తాల్, ఆమన్‌గల్, తలకొండపల్లి, కల్వకుర్తి ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతంలో ధర గజానికి రూ.5 వేల నుంచి 8 వేల వరకున్నాయి. విల్లాల ధరలు రూ.కోటి పైమాటే. 2 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ల ధరలు రూ.30 లక్షల నుంచి ఉన్నాయి. ప్రధాన నగరంలో లేదా ఐటీ కేంద్రాలకు చేరువలో 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కు వెచ్చించే వ్యయంతో శ్రీశైలం రహదారిలో విల్లానే సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement