న్యూఢిల్లీ: దేశీయంగా కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో (2013-2022) 18 శాతానికి చేరుకుంది. 2013లో ఇది 6 శాతంగా ఉండేది. 4,500 మంది పైచిలుకు డైరెక్టర్లు ఉన్న నిఫ్టీ 500 కంపెనీలు, బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా విశ్లేషణ ఆధారంగా కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
కంపెనీల చట్టంలో తప్పనిసరి చేసిన ఫలితంగానే బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని నివేదిక పేర్కొంది. నిఫ్టీ 500లోని 95 శాతం కంపెనీల బోర్డుల్లో ఒక మహిళ ఉన్నారని వివరించింది. అయితే, మహిళా చైర్‌పర్సన్‌లు ఉన్న కంపెనీల సంఖ్య 5 శాతం కన్నా తక్కువేనని పేర్కొంది. బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడంపై కంపెనీలు ఆసక్తిగానే ఉన్నప్పటికీ.. ప్రయత్నాలు అంత వేగంగా పురోగమించడం లేదని వివరించింది. చారిత్రకంగా చూస్తే భారతీయ సంస్థల బోర్డుల్లోని మహిళలకు ఎక్కువగా ఫిర్యాదుల పరిష్కారం, కార్పొరేట్ సోషల్ రెస్పాŠిన్సబిలిటీ (సీఎస్‌ఆర్) కమిటీల్లోనే చోటు దక్కుతూ వస్తోందని.. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి మారుతోందని ఈవై తెలిపింది.
వేదికలో మరిన్ని విశేషాలు..
♦ 24 శాతం మంది మహిళలతో లైఫ్ సైన్సెస్ రంగ కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నాయి. మీడియా, వినోద రంగంలో ఇది 23 శాతంగా ఉంది. ఇక కన్జూమర్ ఉత్పత్తులు.. రిటైల్ రంగ కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం 20 శాతంగా ఉంది. అత్యధికంగా మహిళా సిబ్బంది (34 శాతం) ఉన్న టెక్నాలజీ (ఐటీ, ఐటీఈఎస్) పరిశ్రమలో కూడా ఇది 20 శాతంగానే ఉంది.
♦ ఎనర్జీ, యుటిలిటీస్ రంగ (చమురు, గ్యాస్, విద్యుత్ మొదలైనవి) కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం 2017 నుంచి ఒకే స్థాయిలో 15 శాతంగా స్థిరంగా ఉంది. ఇంధన రంగంలో కేవలం 600 మంది మహిళలు మాత్రమే మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ హోదాల్లో ఉన్నారు.
♦ అంతర్జాతీయంగా చూస్తే కంపెనీల బోర్డుల్లో 44.5 శాతం మహిళల ప్రాతినిధ్యంతో ఫ్రాన్స్ అగ్రస్థానంలో ఉంది. స్వీడన్ (40 శాతం), నార్వే (36.4 శాతం), కెనడా (35.4 శాతం), బ్రిటన్ (35.3 శాతం), ఆస్ట్రేలియా (33.5 శాతం), అమెరికా (28.1 శాతం), సింగపూర్ (20.1 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment