Asset Quality
-
FICCI-IBA Bankers survey: ప్రభుత్వ బ్యాంకుల్లో తగ్గిన మొండిబాకీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలోనూ గత ఆరు నెలలుగా మొండిబాకీలు (ఎన్పీఏ) గణనీయంగా తగ్గాయి. ప్రైవేట్ రంగంలో 67 శాతం బ్యాంకుల్లో మాత్రమే ఎన్పీఏలు తగ్గాయి. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వాటిల్లో 77 శాతం బ్యాంకులు గత ఆరు నెలలుగా మొండిబాకీలు తగ్గినట్లు వెల్లడించాయి. సగం పైగా బ్యాంకులు రాబోయే ఆరు నెలల్లో తమ స్థూల ఎన్పీఏలు 3–3.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. పీఎస్‌బీలు, విదేశీ బ్యాంకుల్లో గత ఆరు నెలల్లో ఎన్పీఏలేమీ పెరగలేదు. కానీ 22 శాతం ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం పెరిగాయి. 18వ ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వేను గతేడాది జూలై–డిసెంబర్ మధ్య కాలంలో నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకులు కలిపి మొత్తం 23 బ్యాంకులు ఇందులో పాల్గొన్నాయి. అసెట్ల పరిమాణంపరంగా బ్యాంకింగ్ రంగంలో వీటి వాటా 77 శాతంగా ఉంటుంది. మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో అధికంగా ఎన్పీఏలు ఉన్నాయి. ► వచ్చే ఆరు నెలల్లో ఆహారేతర పరిశ్రమలకు రుణాల వృద్ధి 12 శాతం పైగానే ఉండొచ్చని 41 శాతం బ్యాంకులు, 10–12 శాతం ఉండొచ్చని 18 శాతం బ్యాంకులు భావిస్తున్నాయి. 36% బ్యాంకులు ఇది 8–10 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ► రాబోయే ఆరు నెలల్లో ఎన్పీఏలు 2.5–3 % స్థాయిలో ఉండొచ్చని 14% బ్యాంకులు తెలిపాయి. ► టర్మ్ డిపాజిట్లు పుంజుకోగా, మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల వాటా తగ్గిందని 70 శాతం బ్యాంకులు తెలిపాయి. దీర్ఘకాలికంగా అధిక వడ్డీ రేట్లకు డిపాజిట్లను లాకిన్ చేయాలనే ధోరణిలో కస్టమర్లకు ఉండటమనేది టర్మ్ డిపాజిట్లకు సానుకూలంగా మారింది. ► ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్స్, ఐరన్ .. ఉక్కు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్ కోసం డిమాండ్ నెలకొంది. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ ఫలితాలు ఆకర్షణీయం
ముంబై: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ జూన్ త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 61 శాతం వృద్ధితో రూ.765 కోట్లకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.474 కోట్లుగానే ఉంది. నికర వడ్డీ ఆదాయం 36 శాతం వృద్ధితో రూ.3,745 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వడ్డీ ఆదాయం రూ.2,571 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 45 శాతం వృద్ధితో రూ.1,427 కోట్లకు పెరిగినట్టు బ్యాంక్ తెలిపింది. రుణ ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 2.17 శాతానికి తగ్గాయి. ఇవి క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి 3.36%గా ఉంటే, ఈ ఏడాది మార్చి చివరికి 2.51 శాతంగా ఉండడం గమనా ర్హం. నికర ఎన్పీఏలు 0.70 శాతానికి పరిమితమయ్యాయి. ‘‘46.5% కాసా రేషియోతో బలమైన ఫ్రాంచైజీని నిర్మిస్తున్నాం. బలమైన బ్రాండ్, విలువలు, కస్టమర్ అనుకూలమైన ఉత్పత్తులు, డిజిటల్ ఆవిష్కరణలతో మా రిటైల్ డిపాజిట్లు చక్కగా వృద్ధి చెందుతున్నాయి’’అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ తెలిపారు. ఫండెడ్ అసెట్స్ (రాబడినిచ్చే ఆస్తులు) 25% వృద్ధితో రూ.1,71,578 కోట్లకు పెరిగాయి. మొత్తం రుణ ఆస్తుల్లో ఇన్ఫ్రా రుణాలు 2.2 శాతానికి తగ్గాయి. -
ఏయూ స్మాల్ బ్యాంక్ లాభం రూ.393 కోట్లు
ముంబై: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 30 శాతం పెరిగి రూ.393 కోట్లుగా నమోదైంది. ఆస్తుల నాణ్యత మెరుగుపడ డం, మొండి బకాయిలకు (ఎన్పీఏలు) కేటాయింపులు తగ్గడం లాభాల వృద్ధికి కలిసొచ్చింది. మొ త్తం ఆదాయం 36 శాతం పెరిగి రూ.2,413 కోట్లు గా నమోదైంది. ప్రధానంగా నికర వడ్డీ ఆదాయం 41 శాతం జంప్ చేసి రూ.1,153 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 6.3 శాతంగా నమోదైంది. ఆస్తుల నాణ్యత మెరుగు మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 1.81 శాతంగా (రూ.1,019 కోట్లు) ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.60 శాతం (రూ.1,058 కోట్లుగా) ఉండడం గమనార్హం. నికర ఎన్పీఏలు 1.29 శాతం (రూ.520 కోట్లు) నుంచి 0.51 శాతానికి (రూ.285 కోట్లు) పరిమితమయ్యాయి. డిసెంబర్ త్రైమాసికంలో రూ.176 కోట్ల కేటాయింపులు చేసింది. రుణ వ్యాపారంలో బలహీన వృద్ధిని చూపించింది. పరిశ్రమ వ్యాప్తంగా రుణాల మంజూరు జోరుగా ఉంటే, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డిసెంబర్ త్రైమాసికంలో 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం రుణాలు రూ.56,335 కోట్లుగా, డిపాజిట్లు 5 శాతం పెరిగి రూ.61,101 కోట్ల చొప్పున ఉన్నాయి. కాసా రేషియో 38 శాతానికి చేరింది. నిధులపై వ్యయాలు 6 శాతంగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో 90 శాతం రిటైల్ విభాగంలో ఉంటే, 93 శాతం రుణాలు సెక్యూర్డ్‌గా బ్యాంక్ తెలిపింది. -
బ్యాంకులకు ‘కరోనా’ స్ట్రెస్ టెస్టులు
ముంబై: కరోనా వైరస్ పరిణామాలతో మందగమన పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో మొండిబాకీల స్థాయిని మదింపు చేసేందుకు బ్యాంకులు స్ట్రెస్ టెస్టులు నిర్వహించాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియేనని, ఆర్బీఐ ప్రత్యేకంగా బ్యాంకులకు ఆదేశాలివ్వాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆఖరు త్రైమాసికం కూడా ముగియడంతో ఆర్థికపరమైన ఒత్తిళ్ల గురించి ఒక అవగాహన కోసం ఈ సమీక్షల నిర్వహణ శ్రేయస్కరమని పేర్కొన్నాయి. అసెట్ క్వాలిటీ దిగజారే అవకాశమున్న కేసులను ముందుగా గుర్తించేందుకు, ఒకవేళ పరిస్థితి చేయి దాటితే సమకూర్చుకోవాల్సిన మూలధనం తదితర అంశాలపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. దీనివల్ల మేనేజ్మెంట్కు, నియంత్రణ సంస్థకు ఆయా బ్యాంకుల ఆర్థిక స్థితిగతుల గురించి ముందస్తుగా ఒక అవగాహన ఉంటుంది. మొండిబాకీలను సకాలంలో గుర్తించడం ద్వారా మెరుగ్గా ఉన్న పద్దులపై ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు బ్యాంకులకు ఈ స్ట్రెస్ టెస్ట్ తోడ్పడుతుందని కేపీఎంజీ ఇండియా పార్ట్నర్ (ఫైనాన్షియల్ సర్వీసెస్ అడ్వైజరీ) సంజయ్ దోషి తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థ స్థాయిలో నెలకొన్న ఒత్తిళ్ల గురించి తెలియజేసేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఏటా రెండు సార్లు ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) విడుదల చేస్తుంది. గతేడాది డిసెంబర్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019 సెప్టెంబర్‌లో 9.3 శాతంగా ఉన్న బ్యాంకుల స్థూల మొండిబాకీల నిష్పత్తి 2020 సెప్టెంబర్ నాటికి 9.9 శాతానికి పెరగనుంది. మొండిబాకీలు పెరుగుతుండటం, రుణ వృద్ధి తగ్గుతుండటం, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తదితర అంశాలు ఇందుకు కారణం కాగలవని ఆర్బీఐ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండిబాకీల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 2019 సెప్టెంబర్‌లో 12.7%గా ఉండగా.. 2020 సెప్టెంబర్ నాటికి 13.2%కి పెరగవచ్చని అంచనా వేసింది. అలాగే ప్రైవేట్ బ్యాంకుల జీఎన్‌పీఏ నిష్పత్తి 3.9 శాతం నుంచి 4.2 శాతానికి పెరగవచ్చని పేర్కొంది. -
యాక్సిస్ బ్యాంకుకు కార్పొరేట్ రుణాల సెగ
ముంబై: దేశంలో మూడవ అతిపెద్ద ప్రయివేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకును మొండి బకాయిల సెగ బాగానే తాకింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసిక ఫలితాల్లో బ్యాంక్ భారీ నికర లాభాలను నమోదు చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 83 శాత పడిపోయింది. బ్యాంక్ నికర లాభం 83 శాతం క్షీణించి రూ. 319 కోట్లను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.1,915.60 కోట్ల నికర లాభాలు సాధించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) మాత్రం 11 శాతం పెరిగి రూ. 4,514 కోట్లను అధిగమించింది. నికర ఎన్పీఏలు కూడా 0.48 శాతం నుంచి 2.02 శాతానికి ఎగశాయి.క్యూ2(జూలై-సెప్టెంబర్)లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.54 శాతం నుంచి 4.17 శాతానికి ఎగబాకాయని బ్యాంక్ ప్రకటించింది. గతంలో ప్రకటించిన రూ.7,287 కోట్ల సమస్యాత్మక రుణాలు సెకండ్ క్వార్టర్ ను ప్రభావితం చేసినట్టు చెప్పారు. ఇంకా రూ.13,789 కోట్లరుణాలను వాచ్ లిస్ట్ లో ఉన్నట్టు వెల్లడించారు. ప్రధానంగా కార్పొరేట్ రుణాల ఎగవేత బ్యాంకు రికార్డును దెబ్బతీసిందని బ్యాంక్ ఫైనాన్స్ ఛీఫ్ జైరాం శ్రీధరన్ చెప్పారు. వార్షిక ప్రాతిపదికన మొదటి సగం లో దాదాపు 305 బేసిస్ పాయింట్లను రికార్డ్ చేయనుంది. మునుపటి మార్గదర్శకత్వం 125-150 బేసిస్ పాయింట్లుకంటే రెట్టింపు కంటే ఎక్కువ. ప్రొవిజన్లు ఐదు రెట్లు ఎగసి లాభాలను దెబ్బతీశాయి. ప్రొవిజన్లకు రూ. 3623 కోట్లను కేటాయించింది.నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 20 బేసిస్ పాయింట్లు నీరసించి 3.64 శాతానికి చేరాయి. ఈ నిరాశాజనక ఫలితాలతో మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. దాదాపు 7.56 శాతం పతనమైంది.