ముంబై: మొండి బాకీల సమస్య నుంచి గట్టెక్కే దిశగా అదనపు మూలధనం లభించనున్న 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) రేటింగ్‌పై క్రిసిల్ సంస్థ సానుకూలంగా స్పందించింది. వాటి అంచనాలను నెగటివ్ నుంచి స్టేబుల్ (స్థిర) స్థాయికి పెంచింది. ఆయా బ్యాంకులు పటిష్టంగా మారడానికి అదనపు మూలధనం ఉపయోగపడగలదని క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. రుణాలకు డిమాండ్ కూడా పుంజుకుంటే బ్యాంకుల మొత్తం పనితీరు కూడా మెరుగుపడగలదని పేర్కొంది.
ఈ ఏడాది మార్చి నాటికి 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 88,139 కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పీఎస్‌బీల అంచనాలపై క్రిసిల్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర 18 బ్యాంకుల అంచనాలను స్థిర స్థాయికి క్రిసిల్ పెంచింది.
అయితే, ప్రభుత్వం నుంచి ఏకంగా రూ. 8,800 కోట్లు అందుకోనున్న దిగ్గజం ఎస్‌బీఐ గురించి మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆంధ్రా బ్యాంక్, బీవోబీ సహా తొమ్మిది పీఎస్‌బీల బాసెల్ త్రీ టైర్ 1 బాండ్ల రేటింగ్స్‌ను, అంచనాలను (నెగటివ్) యధాతథంగా కొనసాగిస్తున్నట్లు క్రిసిల్ తెలిపింది. రీక్యాపిటలైజేషన్ ప్రక్రియ.. ప్రభుత్వ మద్దతును సూచించడంతో పాటు పీఎస్‌బీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నది కూడా గుర్తు చేస్తుందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment