న్యూఢిల్లీ: ఎన్‌సీఎల్‌టీ పర్యవేక్షణలో దివాలా పరిష్కార ప్రక్రియల ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొండి బాకీలను గణనీయంగా రికవరీ చేసుకోగలుగుతున్నాయి. 2022 సెప్టెంబర్ నాటికి రూ. 2.43 లక్షల కోట్లు రాబట్టుకోగలిగాయి. నిర్దిష్ట తేదీ నాటికి సంక్షోభంలో కూరుకున్న కంపెనీల నుండి మొత్తం రూ. 7.91 లక్షల కోట్లు బ్యాంకులకు రావాల్సి ఉంది. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తమ త్రైమాసిక నివేదికలో ఈ విషయాలు తెలిపింది.
మరోవైపు, ప్రస్తుతం కొనసాగుతున్న సీఐఆర్‌పీల్లో (కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ) 64 శాతం కేసుల పరిశీలనకు 270 రోజుల పైగా జాప్యం జరుగుతోందని తెలిపింది. సీఐఆర్‌పీలు నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ జాప్యం జరుగుతుండటం సమస్యగా మారిన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. దివాలా కోడ్ (ఐబీసీ) ప్రకారం పిటిషన్ స్వీకరించిన తేదీ నుండి 180 రోజుల్లోగా సీఐఆర్‌పీని పూర్తి చేయాల్సి ఉంటుంది.
దివాలా పరిష్కార నిపుణుడి (ఆర్‌పీ) అభ్యర్థన మేరకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) దీన్ని మరో 90 రోజుల వరకూ పొడిగించవచ్చు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రక్రియ 330 రోజుల్లోగా ముగియాలి. లిటిగేషన్లు, ఎన్‌సీఎల్‌టీ బెంచీల్లో సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల సమస్యలు, కోవిడ్‌పరమైన అవాంతరాలు మొదలైనవి పరిష్కార ప్రక్రియల జాప్యానికి కారణమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment