Insolvency and bankruptcy Board of India
-
దివాలా పరిష్కార ప్రక్రియ సమయం కుదింపు!
న్యూఢిల్లీ: దివాలా ఆస్తుల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడం, తద్వారా ఆయా రుణ ఆస్తుల విలువ గణనీయమైన కోతను నిరోధించడం లక్ష్యంగా కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ దిశలో దివాలా చట్టాన్ని సవరించడానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దివాలా ఆస్తుల పరిష్కారానికి 2016లో అమల్లోకి వచ్చిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ)కు సవరణలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. బ్యాంకర్లు, న్యాయవాదులతో సహా సంబంధిత వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, రాబోయే వారాల్లో మార్పులు ఖరారు కావచ్చని తెలిపారు. ప్రస్తుతం ఇలా... ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) నుండి ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు అందిన గణాంకాల ప్రకారం, ఐబీసి కింద మొత్తం 553 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందుకు సగటు సమయం 473 రోజులు. ఒక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 57 కేసులు పరిష్కారం అయితే, ఇందుకు సగటు సమయం 679 రోజులు తీసుకుంది. 2021–22లో 143 కేసులు పరిష్కారం అయితే ఇందుకు పట్టిన సమయం 560 రోజులు. 2020–21లో 120 కేసులకు 468 రోజుల సమయం తీసుకోవడం జరిగింది. నిజానికి రిజల్యూషన్ ప్రాసెస్ కోసం ఐబీసీ కాలపరిమితి 330 రోజులు. లిటిగేషన్లో క్లిష్టతలుసహా పలు కారణాలతో దివాలా పరిష్కార పక్రియ కాలయాపన జరుగుతోంది. ఈ లోపాలు సవరించడానికి కేంద్రం తాజాగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. -
దివాలా ప్రక్రియతో రూ. 2.43 లక్షల కోట్ల రికవరీ
న్యూఢిల్లీ: ఎన్సీఎల్టీ పర్యవేక్షణలో దివాలా పరిష్కార ప్రక్రియల ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొండి బాకీలను గణనీయంగా రికవరీ చేసుకోగలుగుతున్నాయి. 2022 సెప్టెంబర్ నాటికి రూ. 2.43 లక్షల కోట్లు రాబట్టుకోగలిగాయి. నిర్దిష్ట తేదీ నాటికి సంక్షోభంలో కూరుకున్న కంపెనీల నుండి మొత్తం రూ. 7.91 లక్షల కోట్లు బ్యాంకులకు రావాల్సి ఉంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తమ త్రైమాసిక నివేదికలో ఈ విషయాలు తెలిపింది. మరోవైపు, ప్రస్తుతం కొనసాగుతున్న సీఐఆర్పీల్లో (కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ) 64 శాతం కేసుల పరిశీలనకు 270 రోజుల పైగా జాప్యం జరుగుతోందని తెలిపింది. సీఐఆర్పీలు నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ జాప్యం జరుగుతుండటం సమస్యగా మారిన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. దివాలా కోడ్ (ఐబీసీ) ప్రకారం పిటిషన్ స్వీకరించిన తేదీ నుండి 180 రోజుల్లోగా సీఐఆర్‌పీని పూర్తి చేయాల్సి ఉంటుంది. దివాలా పరిష్కార నిపుణుడి (ఆర్పీ) అభ్యర్థన మేరకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) దీన్ని మరో 90 రోజుల వరకూ పొడిగించవచ్చు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రక్రియ 330 రోజుల్లోగా ముగియాలి. లిటిగేషన్లు, ఎన్సీఎల్టీ బెంచీల్లో సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల సమస్యలు, కోవిడ్‌పరమైన అవాంతరాలు మొదలైనవి పరిష్కార ప్రక్రియల జాప్యానికి కారణమవుతున్నాయి. -
దివాలా చర్యల ప్రక్రియ ఇక మరింత వేగవంతం
న్యూఢిల్లీ: దివాలా పక్రియలో ఆలస్యాన్ని నివారించడం, మెరుగైన విలువను సాధించడం, ఇందుకు సంబంధించి లిక్విడేషన్ పక్రియ క్రమబద్దీకరణ ప్రయత్నాల్లో భాగంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) నిబంధనలను సవరించింది. దివాలా పక్రియలో భాగస్వాములు చురుగ్గా పాల్గొనడానికి కూడా తాజా నిబంధనల సవరణ దోహదపడుతుందని ఒక అధికారికలో ఐబీసీ (ఇన్సాలెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్– అమలు సంస్థ ఐబీబీఐ పేర్కొంది. సవరణలలో భాగంగా కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ) సమయంలో ఏర్పడిన కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (సీఓసీ), మొదటి 60 రోజులలో వాటాదారుల సంప్రదింపుల కమిటీ (ఎస్సీసీ)గా పని చేస్తుంది. క్లెయిమ్‌ల తుది నిర్ణయం (తీర్పు) తర్వాత (ప్రక్రియ ప్రారంభించిన 60 రోజులలోపు) అంగీకరించిన క్లెయిమ్‌ల ఆధారంగా ఎస్సీసీ పున ర్నిర్మితమవుతుంది. వాటాదారుల మెరుగైన భాగస్వామ్యంతో నిర్మాణాత్మకంగా, సమయానుగుణంగా ఎస్సీసీ సమావేశాలను నిర్వహించే బాధ్యతలు లిక్విడేటర్పై ఉంటాయి. అలాగే, ఎస్సీసీతో లిక్విడేటర్ తప్పనిసరి సంప్రదింపుల పరిధి పెరుగుతుంది. -
‘దివాలా’ కంపెనీల నిబంధనలకు సవరణలు
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చట్టం కింద వేలానికి వచ్చే కంపెనీలకు, మెరుగైన విలువ రాబట్టే విధంగా సంబంధిత నిబంధనలను దివాలా బోర్డు (ఐబీబీఐ) సవరించింది. అవసరమైతే కంపెనీని విడగొట్టి విక్రయించేందుకు అనుమతించింది. మొత్తం వ్యాపారం కొనుగోలు కోసం తగిన పరిష్కార ప్రతిపాదనేది రాని పక్షంలో రుణగ్రహీతకు సంబంధించిన అసెట్లను విడివిడిగా విక్రయించడానికి, మరోసారి రిజల్యూషన్ ప్రణాళికలు సమర్పించాలని కోరుతూ రుణదాతల కమిటీ ప్రకటన చేయొచ్చని ఐబీబీఐ పేర్కొంది. ఒకవేళ మిగతా అన్ని మార్గాలూ విఫలమైతే ఆఖరు ప్రయత్నంగా ప్రమోటరుతో సెటిల్మెంట్ చేసుకునేందుకు కూడా కొత్త నిబంధనలతో వెసులుబాటు లభిస్తుంది. ఇకపై వేలంలో పాల్గొనేలా మరింత మంది బిడ్డర్లను ఆకర్షించేందుకు రిజల్యూషన్ ప్రొఫెషనల్, రుణదాతలు ప్రత్యేకంగా రోడ్‌షోలు కూడా నిర్వహించవచ్చు. చదవండి: లక్కీ బాయ్.. 5 నిమిషాల వీడియో పంపి, రూ.38 లక్షల రివార్డ్ అందుకున్నాడు! -
దివాలా సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) దివాలా ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రవేశపెట్టిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్ర్‌ప్సీ కోడ్ (సవరణ) బిల్లు, 2021ను లోక్‌సభ ఎటువంటి చర్చా లేకుండా బుధవారం ఆమోదించింది. రుణ చెల్లింపుల వైఫల్య పరిమితి రూ.కోటికి లోబడి ప్రీ–ప్యాకేజ్డ్ రిజల్యూషన్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది. పెగాసస్‌పై సభ్యుల తీవ్ర ఆందోళనల నడుమ కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ఇంద్రజిత్ సింగ్ దివాలా చట్ట సవరణ బిల్లును సభ ఆమోదం నిమిత్తం ప్రవేశపెట్టారు. మహమ్మారి ప్రేరిత సవాళ్లను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ కంపెనీలకు ఊరట కలిగిస్తూ, ఏప్రిల్ 4న తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో తాజా బిల్లును తీసుకువచ్చినట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. రూ.కోటి లోపు రుణ వైఫల్యం జరిగిన ఎంఎస్ఎంఈ దివాలా పక్రియను తాజా బిల్లు సులభతరం చేస్తుంది. తమ రుణాలను పునర్ వ్యవస్థీకరించుకునేందుకు వీలు కల్పిస్తుంది. -
కోవిడ్ -19 : కంపెనీలకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ -19 కల్లోలంతో సంక్షోభంలో పడి ఇబ్బందుల పాలవుతున్న కంపెనీలు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పెద్ద మొత్తంలో దివాలా చర్యలకు గురికాకుండా ఆరు నెలల వరకు కంపెనీలకు ఉపశమనం కలిగేలా చర్యలు చేపట్టింది. వచ్చే 6 నెలల పాటు కంపెనీలకు దివాలా నుంచి మినహాయింపునిచ్చేందుకు కేంద్ర కేబినెట్ అనుమతించింది. కోవిడ్-19 కారణంగా ఈ సమయంలో దివాలాకు సంబంధించి కొత్త డీఫాల్ట్ కేసులను నమోదు చేయదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన సూచనల ఆధారంగా 2016 ఇన్సాల్వెన్సీ అండ్ దివాళా కోడ్(ఐబీసీ)కి సవరణ చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం రావాల్సి ఉంది. కొత్త సెక్షన్ 10ఏకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే 7, 9, 10 సెక్షన్లను తాత్కాలికంగా పక్కన పెట్టనున్నారు. అయితే సవరణ నిబంధనను సంవత్సరానికి మించి పొడిగించలేమని పేర్కొంది. కరోనా వైరస్ కష్టాలు,లాక్డౌన్ నష్టాలు వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితిలోఇది సరైన నిర్ణయమని నిపుణులు అభినందించారు. ఇది దేశంలోని వ్యాపార వర్గాలకు మరింత స్థిరత్వాన్నిస్తుందని అభిప్రాపయడ్డారు. మార్చి చివరిలో మొదటి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఇది ఒక ఆచరణాత్మక చర్య. లాక్ డౌన్ ఎత్తివేత , ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిన సమయంలో, ఐబీసీని 6 నెలలు నిలిపివేయడం ఆర్థిక బలాన్ని స్తుందని డెలాయిట్ ఆర్థిక సలహా అధ్యక్షుడు ఉదయ్ భన్సాలీ అన్నారు. ఒక సంస్థకు అవసరమైన ఫైనాన్సింగ్, రుణాల గురించి తిరిగి చర్చలు జరపడాని్ఇ, బ్యాంకుల నుండి ఇతర ఉపశమనాలను పొందటానికి అవకాశం లభిస్తుందన్నారు. కాగా ప్రస్తుత పరిస్థితి ఏప్రిల్ 30 దాటినట్లయితే, ఐబీసీ 2016 లోని సెక్షన్ 7, 9 , 10 లను ఆరు నెలల కాలానికి సస్పెండ్ చేయడాన్ని ప్రభుత్వం పరిశీలించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మార్చి 24 న చెప్పిన సంగతి విదితమే. -
కార్పొరేట్ దివాలా పిటిషన్లకు 180 రోజుల్లో మోక్షం!
లోక్ సభకు దివాలా కోడ్-2015 బిల్లు న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారాలకు మరింత సానుకూల పరిస్థితులను కల్పించడంలో భాగంగా కేంద్రం దివాలా బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్-2015’ను లోక్ సభ ముందు ఉంచింది. కంపెనీలు, వ్యక్తుల దివాలా పిటిషన్లను నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించడమే ఈ బిల్లు ప్రధానోద్దేశం. దీనివల్ల దేశంలో పెట్టుబడులు పెరగడంతో పాటు ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. వృత్తి నిపుణులు; కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ్యక్తుల దివాలా సంబంధ అంశాలను పరిష్కరించే ఏజెన్సీలు, సమాచార యుటిలిటీలను నియంత్రించేందుకుగాను ప్రత్యేకంగా ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా’ను ఏర్పాటు చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు. దీంతోపాటు దివాలా ఫండ్‌ను నెలకొల్పాలని కోడ్‌లో ప్రతిపాదించారు. ముఖ్యాంశాలివీ... * ఈ బిల్లు ప్రకారం ఒక కార్పొరేట్ కంపెనీ దివాలా పిటిషన్‌ను 180 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. అదనంగా మరో 90 రోజుల గడువు పొడిగించే వెసులుబాటు కల్పించారు. * అంతేకాకుండా ఫాస్ట్-ట్రాక్ పద్ధతిలో 90 రోజుల్లోనే కార్పొరేట్ దివాలా పిటిషన్లను పరిష్కరించే ప్రతిపాదనను కోడ్‌లో చేర్చారు. * ప్రస్తుత నిబంధనల ప్రకారం దివాలా పిటిషన్ల పరిష్కారానికి అనవసర జాప్యాలు పెరిగిపోతున్నాయని.. దీన్ని నివారించేందుకే కొత్త చట్టాన్ని తీసుకురావాల్సి వస్తోందని కేంద్రం పేర్కొంది. * ప్రస్తుతం దివాలా పిటిషన్ల పరిష్కారానికి నిర్దిష్టంగా ఒక చట్టమంటూ లేదు. కంపెనీల దివాలా, మూసివేత అంశాలను హైకోర్టులు; వ్యక్తిగత దివాలా కేసులను ప్రెసిడెన్సీ టౌన్స్ ఇన్సాల్వెన్సీ చట్టం-1909, ప్రొవిన్షియల్ ఇన్సాల్వెన్సీ చట్టం-1920 కింద పరిష్కరిస్తున్నారు. * వీటితో పాటు ఎస్ఐసీఏ-1985, రికవరీ ఆఫ్ డెట్ డ్యూస్ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చట్టం-1993, సర్ఫేసీ చట్టం-2002, కంపెనీల చట్టం-2013 కూడా దివాలా అంశాల పరిష్కారానికి సంబంధించినవే. * ఇప్పుడు ఈ చట్టాల్లోని అంశాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేందుకు ఈ కొత్త కోడ్‌ను తీసుకొస్తున్నామని బిల్లుకు సంబందించిన ప్రకటనలో తెలిపారు. * ప్రతిపాదిత కొత్త చట్టం ప్రకారం వ్యక్తులెవరైనా దివాలా పిటిషన్‌ను దాఖలు చేయాలంటే వార్షిక వ్యక్తిగత ఆదాయం రూ. 60,000కు మించకూడదు. అంతేకాకుండా ఆస్తి విలువ కూడా రూ. 25,000 దిగువనే ఉండాలి. సొంత నివాస గృహం ఉండకూడదు. * కాగా, దివాలా పిటిషన్ల విషయంలో ఆస్తులను వెల్లడించకుండా దాచిపెట్టడం, రుణదాతలను మోసం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం వంటివి చోటుచేసుకుంటే.. జరిమానాతో పాటు ఐదేళ్లవరకూ జైలు శిక్ష పడేవిధంగా బిల్లులో ప్రతిపాదించారు. కార్పొరేట్ మోసం కోటి దాటితే ప్రభుత్వం దృష్టికి ఆడిటర్ల విధులపై కంపెనీల చట్టానికి సవరణలు న్యూఢిల్లీ: ఆడిటర్లు కంపెనీల ఖాతాలను పరిశీలించే క్రమంలో రూ. 1 కోటి పైగా విలువ చేసే సందేహాస్పద కార్పొరేట్ మోసాల ఉదంతాలేమైనా గుర్తించిన పక్షంలో ప్రభుత్వం దృష్టికి తేవాల్సి ఉంటుంది. కంపెనీల చట్టానికి ఈ మేరకు సవరణలు చేస్తూ కార్పొరేట్ వ్యవహారాల శాఖ నిబంధనలు ప్రకటించింది. మోసం ఉదంతం తెలిసిన రెండు రోజుల్లోగా ఆడిటరు ముందుగా కంపెనీ బోర్డు లేదా ఆడిట్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలి. దీనిపై 45 రోజుల్లోగా వాటి నుంచి వివరణ తీసుకోవాలి. ఆ తర్వాత 15 రోజుల్లోగా ఆడిటరు తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది.