న్యూఢిల్లీ: దివాలా ఆస్తుల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడం, తద్వారా ఆయా రుణ ఆస్తుల విలువ గణనీయమైన కోతను నిరోధించడం లక్ష్యంగా కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ దిశలో దివాలా చట్టాన్ని సవరించడానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దివాలా ఆస్తుల పరిష్కారానికి 2016లో అమల్లోకి వచ్చిన ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ కోడ్ (ఐబీసీ)కు సవరణలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. బ్యాంకర్లు, న్యాయవాదులతో సహా సంబంధిత వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, రాబోయే వారాల్లో మార్పులు ఖరారు కావచ్చని తెలిపారు.
ప్రస్తుతం ఇలా...
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) నుండి ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు అందిన గణాంకాల ప్రకారం, ఐబీసి కింద మొత్తం 553 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందుకు సగటు సమయం 473 రోజులు. ఒక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 57 కేసులు పరిష్కారం అయితే, ఇందుకు సగటు సమయం 679 రోజులు తీసుకుంది. 2021–22లో 143 కేసులు పరిష్కారం అయితే ఇందుకు పట్టిన సమయం 560 రోజులు. 2020–21లో 120 కేసులకు 468 రోజుల సమయం తీసుకోవడం జరిగింది. నిజానికి రిజల్యూషన్ ప్రాసెస్ కోసం ఐబీసీ కాలపరిమితి 330 రోజులు. లిటిగేషన్‌లో క్లిష్టతలుసహా పలు కారణాలతో దివాలా పరిష్కార పక్రియ కాలయాపన జరుగుతోంది. ఈ లోపాలు సవరించడానికి కేంద్రం తాజాగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
దివాలా పరిష్కార ప్రక్రియ సమయం కుదింపు!
Published Tue, Dec 20 2022 6:20 AM | Last Updated on Tue, Dec 20 2022 6:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment