న్యూఢిల్లీ: ఉన్నత విద్య కోసం రుణాలు తీసుకునే విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. చదువుల వ్యయాలు భారీగా పెరుగుతున్నాయనడానికి సూచనగా రుణ పరిమాణం పెరుగుతోంది. క్రెడిట్ బ్యూరో సీఆర్‌ఐఎఫ్ హైమార్క్ రూపొందించిన నివేదిక ప్రకారం గత సంవత్సరంలో విద్యా రుణం పరిమాణం సగటున రూ. 6.8 లక్షలే ఉండగా.. ఈసారి ఏకంగా రూ. 9.6 లక్షలకు చేరింది.
మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో రుణ వితరణ 9.25 శాతం పెరిగి విద్యా రుణాల పోర్ట్‌ఫోలియో పరిమాణం రూ. 82,600 కోట్లకు చేరింది. విద్యా రుణాలు తీసుకునే విద్యార్థుల సంఖ్య మాత్రం 7 శాతం తగ్గి 2.5 లక్షలకు పరిమితమైంది. ఉన్నత విద్యా వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎడ్యుకేషనల్ లోన్ పరిమాణం కూడా పెరుగుతోందని సీఆర్‌ఐఎఫ్ హైమార్క్ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.
గతంతో పోలిస్తే మరింత పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెడుతుండటం, ఐఐఎంలు..ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో గత కొన్నాళ్లుగా ఫీజులు భారీగా పెరగడం మొదలైన అంశాలు ఇందుకు కారణమని వివరించాయి. రూ. 20 లక్షల పైబడిన విద్యా రుణాల విభాగం గడిచిన అయిదేళ్లలో ఏకంగా ఆరు రెట్లు పెరిగిందని పేర్కొన్నాయి.
రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ముందంజ..
విద్యా రుణాల విభాగంలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ బ్యాంకులదే (పీఎస్‌బీ) ఉంటోంది. గతేడాది నమోదైన 90 శాతంతో పోలిస్తే కొంత తగ్గి 83 శాతానికి చేరినా మార్కెట్‌వాటాపరంగా పీఎస్‌బీలే ముందంజలో ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐకి దాదాపు 30 శాతం మార్కెట్ వాటా ఉంది. విద్యారుణాల పరిమాణం, మంజూరు గణనీయంగానే పెరుగుతోందని బ్యాంకు వర్గాలు తెలిపాయి.
అయితే, లోన్ పరిమాణం పెరుగుతున్నప్పటికీ, అయిదారేళ్ల క్రితం నాటి పరిస్థితులతో పోలిస్తే రుణాల సంఖ్య మాత్రం తగ్గుతోందని పేర్కొన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగావకాశాలు భారీగా ఉంటాయన్న అంచనాలతో గతంలో చాలా మంది విద్యార్థులు ఐటీని ఎంచుకునేవారని, ప్రస్తుతం క్రమంగా ప్యూర్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాలవైపు మళ్లుతున్నారని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. విద్యా రుణాల వితరణలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రభుత్వం నిర్దేశించే లక్ష్యాల్లో 95 శాతం పైనే సాధిస్తోంది.
రుణ మంజూరులో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ (సీజీఎఫ్‌ఎస్‌ఈఎల్) చాలా కీలకంగా ఉంటోందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఈ స్కీము కింద రూ. 7.5 లక్షల దాకా రుణాల్లో 75 శాతం దాకా హామీ లభిస్తుంది. అయితే, ఇది 2015 సెప్టెంబర్ నుంచే అమల్లోకి వచ్చింది. దీనికింద తీసుకున్న రుణాల చెల్లింపు ప్రక్రియ ఇంకాపూర్తి స్థాయిలో మొదలు కాలేదు.
చాలామందికి ఇంకా అందని ద్రాక్షే..
విద్యా రుణాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ.. చాలా మంది విద్యార్థుల్లో ఇలాంటి వాటి గురించి అవగాహన లేదని సీఆర్‌ఐఎఫ్ వీపీ పారిజాత్ గర్గ్ పేర్కొన్నారు. విద్యా రుణాల మంజూరు ప్రక్రియ ఇంకా సంక్లిష్టంగానే, బోలెడంత సమయం తీసుకునేదిగానే ఉంటోందని తెలిపారు.
సాదారణంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఎడ్యుకేషనల్ లోన్స్ జారీ చేయడానికి 10–15 రోజులు తీసుకుంటున్నాయని.. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దీనికి 15–21 రోజుల పైగా పట్టేస్తోందని వివరించారు. అడ్మిషన్ల విషయంలో సమయం చాలా విలువైనది కావడంతో విద్యార్థులకు ఇలాంటి అంశాలు కొంత సమస్యాత్మకంగా ఉంటున్నాయి.
మొండిబాకీలు అధికమే..
విద్యా రుణాల విభాగంలో దాదాపు సగభాగం లోన్స్ పరిమాణం రూ. 4 లక్షల దాకా ఉంటోంది. అయితే, అత్యధిక స్థాయిలో మొండిబాకీలు (ఎన్‌పీఏ) పేరుకుపోయిన రుణ విభాగం కూడా ఇదే కావడం గమనార్హం. రూ. 4 లక్షల దాకా ఎడ్యుకేషనల్ లోన్‌ని ప్రాధాన్యతా రంగ రుణంగా పరిగణించడం జరుగుతోందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఈ విభాగంలోనే అత్యధిక ఎన్‌పీఏలూ ఉంటున్నాయని వివరించాయి.
విద్యా రుణాలకు సంబంధించిన మొత్తం ఎన్‌పీఏల్లో దాదాపు 85 శాతం .. ఈ విభాగానిదే ఉంటోందని పేర్కొన్నాయి. సుమారు రూ. 2 లక్షల దాకా రుణాల విభాగంలో 11.61 శాతం పైగా ఎన్‌పీఏలు ఉన్నాయి. కోర్సు ముగిసి, మారటోరియం వ్యవధి కూడా తీరిపోయిన తర్వాత రుణం తీసుకున్న విద్యార్థులు ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకోవడం తమకు పెద్ద సమస్యగా ఉంటోందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ విభాగం కింద రుణాలివ్వడానికి కూడా ఎక్కువగా బ్యాంకులు ముందుకు రావడం లేదని వివరించాయి.
Comments
Please login to add a commentAdd a comment