
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్న మొండిబాకీల సమస్యను మరింత వేగవంతంగా పరిష్కరించే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టింది. మొండిబాకీలుగా మారే ఖాతాలను బ్యాంకులు మరింత ముందుగానే గుర్తించి, సత్వరం తగు చర్యలు తీసుకునే విధంగా నిబంధనలను కఠినతరం చేసింది.
ప్రస్తుతం అమలు చేస్తున్న పలు రుణ పునర్‌వ్యవస్థీకరణ స్కీములను రద్దు చేసింది. సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.2,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న సంస్థ ఖాతా మొండిపద్దుగా మారిన పక్షంలో.. డిఫాల్ట్ అయిన నాటి నుంచి 180 రోజుల్లోగా బ్యాంకులు పరిష్కార ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కుదరకపోతే దివాలా చట్టం కింద సత్వరం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత మార్గదర్శకాలను ఉల్లంఘించే బ్యాంకులపై జరిమానాలు కూడా విధించడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.
వారంవారీ నివేదికలు..
ప్రస్తుతం అమల్లో ఉన్న కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకం, వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకం (ఎస్‌డీఆర్) తదితర స్కీమ్‌లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించింది. ఈ స్కీములు ఇంకా అమల్లోకి రాని మొండిబాకీల ఖాతాలన్నింటికీ కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొంది. మొండిబాకీల పరిష్కారానికి ఉద్దేశించిన జాయింట్ లెండర్స్ ఫోరం (జేఎల్‌ఎఫ్) విధానాన్ని కూడా ఉపసంహరిస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.
ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులన్నీ ప్రతి నెలా సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ)కి నివేదిక పంపించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం రూ.5 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న రుణగ్రహీతల డిఫాల్ట్‌ల వివరాలను బ్యాంకులు ప్రతి శుక్రవారం తెలియజేయాలి. ఒకవేళ శుక్రవారం సెలవైతే అంతకు ముందు రోజు పంపాలి. వారం వారీ నివేదికల నిబంధన ఫిబ్రవరి 23 నుంచే అమల్లోకి వస్తుంది.
ఒక్క దెబ్బతో ప్రక్షాళన..: కొత్త నిబంధనలు డిఫాల్టర్లకు ‘మేల్కొలుపు’ లాంటివని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. మొండిబాకీల సమస్య పరిష్కారాన్ని పదే పదే వాయిదా వేయకుండా, ఒక్క దెబ్బతో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. బ్యాంకుల ప్రొవిజనింగ్ నిబంధనలపై ఆర్‌బీఐ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపబోదని రాజీవ్ కుమార్ తెలిపారు.
మొండిబాకీలుగా మారే అవకాశమున్న పద్దులను బ్యాంకులు మరింత ముందుగా గుర్తించి, నిర్దిష్ట గడువులోగా పరిష్కార ప్రణాళికలను అమలు చేసేలా కొత్త మార్గదర్శకాలు దోహదపడతాయని ఆయన చెప్పారు. 2017 సెప్టెంబర్ 30 నాటికి స్థూలంగా ఎన్‌పీఏలు ప్రభుత్వ బ్యాంకుల్లో రూ. 7,33,974 కోట్ల మేర, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో రూ. 1,02,808 కోట్ల మేర పేరుకుపోయిన సంగతి తెలిసిందే. భారీగా పేరుకుపోయిన మొండిబాకీల సమస్య పరిష్కారం కోసం రిజర్వ్ బ్యాంక్‌కు ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది.
జీఎస్‌టీతో త్వరలో పన్నుల పంట!
పటిష్ట చర్యలతో నెలకు రూ. లక్ష కోట్లపైన వసూళ్ల అంచనా
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ద్వారా పన్నుల వసూళ్లు వచ్చే ఆర్థిక సంవత్సరం (2018–19) చివరికల్లా గణనీయంగా పెరుగుతాయన్న విశ్వాసాన్ని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పన్ను ఎగవేతల నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలన్నీ త్వరలోనే ఫలించబోతున్నాయని, దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా జీఎస్‌టీ వసూళ్లు నెలకు సగటున లక్ష కోట్ల రూపాయలు దాటడం ఖాయమని వారు అంచనావేస్తున్నారు.
పన్ను డేటాను అన్ని కోణాల్లో సరిచూసుకోవడం, ఈ–వే బిల్ వంటి పన్ను ఎగవేత నిరోధక చర్యలను ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. జీఎస్‌టీ రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియ ఒకసారి పూర్తిగా స్థిరీకరణ జరిగితే, దాఖలైన ఆదాయపు పన్ను రిట ర్న్స్‌తో జీఎస్‌టీ ఫైలింగ్ డేటాబేస్ మొత్తాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అనలటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (డీజీఏఆర్‌ఎం) మదింపుచేయగలుగుతుందని, దీనితో ఎగవేతలకు ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పటి అంచనాలు ఇలా...
2018–19తో జీఎస్‌టీ ద్వారా దాదాపు రూ.7.44 లక్షల కోట్లు వసూలు కావాలని బడ్జెట్ నిర్దేశించుకుంది. జూలైలో జీఎస్‌టీ ప్రారంభమైననాటి నుంచీ ఇప్పటి వరకూ (దాదాపు ఎనిమిది నెలలు) జీఎస్‌టీ వసూళ్ల అంచనా రూ.4.44 లక్షల కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఈ పరిమాణం మరింత పెరగడం ఖాయమన్నది నిపుణుల విశ్లేషణ. 2017 డిసెంబర్ నాటికి దేశంలోని 98 లక్షల వ్యాపార సంస్థలు జీఎస్‌టీ కింద రిజిస్టర్ అయ్యాయి.
బంగారంపై దృష్టి...
పసిడి, ఆభరణాల పరిశ్రమలో పన్నుల వసూళ్లకు సంబంధించి చోటుచేసుకుంటున్న లోపాలపై కూడా ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారిస్తోందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ‘‘10% కస్టమ్స్ సుంకం ఉన్నప్పటికీ, పసిడి దిగుమతులు ప్రతినెలా పెరుగుతున్నాయి. అయితే దిగుమతి అయి న ఈ బంగారం ఎటు పోతోంది? తుది సరఫరాదారు ఎవరన్న విషయాన్ని జీఎస్‌టీ వల్ల గుర్తించగలుగుతాం’’అని ఉన్నతాధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment