ఆరేళ్లలో బ్యాంకింగ్‌ రుణ మాఫీ ఎన్ని లక్షల కోట్లు తెలుసా? | Banks Write Off Bad Loans Worth Rs 11 Lakh Crore Last 6 Years Says Minister | Sakshi
Sakshi News home page

ఆరేళ్లలో బ్యాంకింగ్‌ రుణ మాఫీ ఎన్ని లక్షల కోట్లు తెలుసా?

Published Wed, Dec 21 2022 2:56 PM | Last Updated on Wed, Dec 21 2022 3:20 PM

Banks Write Off Bad Loans Worth Rs 11 Lakh Crore Last 6 Years Says Minister - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ బ్యాంకింగ్‌ 2021–22 ఆర్థిక సంవత్సరం వరకు గడచిన ఆరేళ్లలో రూ. 11.17 లక్షల కోట్ల మొండి బకాయిలను (ఎన్‌పీఏ) మాఫీ చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కరద్‌ ఒక లిఖిత పూర్వక సమాధానంలో పార్లమెంటుకు తెలియజేశారు. నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్తి ప్రొవిజనింగ్‌ (మొండిబకాయిలకు కేటాయింపులు) జరిగిన ఖాతాలుసహా సహా నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏలు) సంబంధిత బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ నుండి రైట్‌–ఆఫ్‌ ద్వారా తొలగించడం జరుగుతుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. బ్యాలెన్స్‌ షీట్‌ను పటిష్టం చేయడం, పన్ను ప్రయోజనాలను పొందడం, మూలధనాన్ని పటిష్టం  చేసుకోవడం వంటి తన సాధారణ కసరత్తులో భాగంగా బ్యాంకులు ఎన్‌పీఏలను రద్దు చేస్తాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాలు, బోర్డులు ఆమోదించిన విధానాలకు అనుగుణంగా బ్యాంకులు ఈ రైట్‌–ఆఫ్‌ నిర్వహిస్తాయని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి మంత్రి తెలిపిన సమాచారం వివరాల్లోకి వెళితే.. 

► ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ. 8,16,421 కోట్ల రుణ మాఫీ చేశాయి. మొత్తం షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల (ఎస్‌సీబీలు) విషయంలో ఈ విలువ  రూ. 11,17,883 కోట్లుగా ఉంది.  
►    గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు మొత్తం 6,59,596 కోట్ల రూపాయల రికవరీ జరిపాయి. ఇందులో రైటాఫ్‌ లోన్‌ ఖాతాల నుండి జరిగిన రికవరీల విలువ  1,32,036 కోట్లు.  
►    ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 1 కోటి కంటే ఎక్కువ ఎగవేసిన రైటాఫ్‌లు/డిఫాల్టర్ల పేర్లతో సహా ఈ జాబితాకు సంబంధించి, రుణ 
గ్రహీతల వారీగా రైట్‌ ఆఫ్‌ లోన్‌ ఖాతాల సమాచారాన్ని నిర్వహించడం లేదని ఆర్‌బీఐ తెలియజేసింది. 
►    ఆర్‌బీఐ తెలిపిన సమాచారం ప్రకారం, జూన్‌ 30, 2017 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 25 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో బకాయి ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 8,045. 2022 జూన్‌ 30వ తేదీ నాటికి  ఈ సంఖ్య 12,439కు చేరింది. ఇదే కాలంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకులకు సంబంధించి ఈ సంఖ్య 1,616 నుంచి 2,447కు ఎగసింది. 


►    2017 జూన్‌ 30వ తేదీ నాటికి ఉద్దేశపూర్వక ఎగవేతలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 8,744 దావాలు దాఖలయ్యాయి. 2022 జూన్‌ 30వ తేదీ నాటికి ఈ సంఖ్య 14,485గా ఉంది. ఇందుకు సంబంధించి సూట్‌ ఫైల్‌ కాని వారి సంఖ్యలు వరుసగా 917, 401గా ఉన్నాయి.  
►    రూ. 25 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన దావా ఫైల్‌ చేసిన ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీల (సీఐసీ) వెబ్‌సైట్‌లలో పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉంది. సూట్‌ ఫైల్‌కాని ఉద్దేశపూర్వక డిఫాల్టర్ల జాబితా గోప్యంగా ఉంటుంది.  పబ్లిక్‌ డొమైన్‌లో ఉండదు . 
►    అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ), 2002 నిబంధనల ప్రకారం 2017 మే 1వ తేదీ నుండి ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన కేసులతో సహా మొత్తం 515 మోసం కేసులు నమోదయ్యాయి. 2022 డిసెంబరు 15 నాటికి, ఈ కేసుల్లో దాదాపు రూ. 44,992 కోట్ల ఆస్తుల జప్తు జరిగిందని, డైరెక్టరేట్‌ ద్వారా 39 ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదులు దాఖలయ్యాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తెలియజేసింది.  
►    2017 మే నుండి 2022 డిసెంబర్‌ 15 నాటికి పీఎంఎల్‌ఏ 2002 కింద విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ వంటి ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రూ. 19,312.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వీటిలో రూ. 15,113 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు అప్పగించడం జరిగింది.  
►    గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల్లో ప్రభుత్వం చేసిన మొత్తం రీక్యాపిటలైజేషన్‌ (మూలధన కేటాయింపుల) పరిమాణం  మొత్తం రూ.2,90,600 కోట్లు.  ప్రైవేట్‌ రంగ బ్యాంకుగా వర్గీకరణ జరిగిన (2019 జనవరి 21న) ఐడీబీఐ బ్యాంక్‌కు రీక్యాపిటలైజేషన్‌ విలువ రూ. 4,557 కోట్లు.  

భారీ లాభాలు 
మంత్రి తెలిపిన సమాచారం ప్రకారం,  ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్‌పీఏ) కట్టడికి  తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్‌) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే  50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయ్యింది.  తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్‌ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి.

ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు  గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్‌బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్‌లను ప్రకటించాయి. నిజానికి బ్యాంకింగ్‌కు 2020–21 చక్కటి యూ టర్న్‌. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్‌ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు,  2019–20లో రూ.25,941 కోట్లు,  2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్‌ నష్టాల బాట నడిచింది. 

చదవండి: ఘరానా మోసం : రైల్వే ఉద్యోగం..8 గంటల డ్యూటీ, వచ్చే పోయే రైళ్లను లెక్కించడమే పని!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement