
కాచిగూడ: బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును ప్రభుత్వమే రికవరీ చేసే విధంగా నూతన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. కెనరా బ్యాంకు ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర సదస్సు ఆదివారం కాచిగూడలోని మున్నూరుకాపు భవన్, మ్యాడం అంజయ్య హాల్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో బీఎస్ రాంబాబు ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతమున్న చట్టలు, న్యాయ వ్యవస్థలోని లొసుగులను అసరా చేసుకుని బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగవేస్తున్నారని, దీంతో బ్యాంకులు దివాలతీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అదానీ తీసుకున్న రూ.83వేల కోట్లను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
అదానీ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేలాలంటే విచారణకు పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. బ్యాంకింగ్ రంగంలోని 3,4 తరగతులలో ఖాళీగా ఉన్న 2లక్షలకు పైగా ఉద్యోగాను వెంటనే బర్తీ చేయాలని, లేదంటే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ భ్యాంకులను నిర్విర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ చేయాలనే అలోచనలను ప్రభుత్వం మానుకోవాలని, లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసన్, వేణుగోపాల్, కె.శ్రీకృష్ణ, కె.హెచ్. పటా్నయక్, సాయి ప్రసాద్, ఎస్. మధుసూదన్, హరివర్మ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment