![Special Story About Vijayanagaram AR Constable Rambabu - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/31/Sp.jpg.webp?itok=L3Ub6UPI)
విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి
విజయనగరం ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు కరోనా బారిన పడి కోలుకున్నారు. తన పై అధికారులు తనను తిరిగి విధులకు స్వాగతిస్తున్న సందర్భంలో జిల్లా ఎస్పీ రాజకుమారి ఔన్నత్యం మీద సొంతంగా పాట రాసి, బాణీలు సమకూర్చి, పాడి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఎస్పీ ఎదుట మోకాళ్లపై కూర్చొని నమస్కరిస్తూ కన్నీళ్లతో ఆమెను కొనియాడారు. ఊహించని ఆ అభివాదానికి ఎస్పీ..స్టేజ్ పై నుంచి అతడి వద్దకు వచ్చి ఆప్యాయంగా చేయిపట్టి పైకి లేపారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న వారందరి కన్నులు చెమ్మగిల్లాయి.
రాజకుమారి ఎదుట కన్నీళ్లతో పాటపాడుతున్న ఎఆర్ కానిస్టేబుల్ రాంబాబు.
ఖాకీ డ్రెస్ వేసుకుంటే చట్టానికి కట్టుబడి, శాంతి భద్రతల సంరక్షణే బాధ్యతగా నడుచుకోవడం తప్ప భావోద్వేగాలకు లోనవడం ఉండదు. అయితే విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి.రాజకుమారి విధి నిర్వహణలో అధికారిగా ఉంటూనే.. సిబ్బందికి ఇంటి పెద్దలా నిలబడుతున్నారు. కష్టం వస్తే ఆదుకుంటున్నారు. ఒక ఆడపడుచుగా పోలీసు కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. అందుకు తాజా నిదర్శనమే కానిస్టేబుల్ రాంబాబు కృతజ్ఞతాభివందనం. కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర విధుల్లోని వారితోపాటు.. పోలీసులు కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది పోలీసులు కోవిడ్ కోరల్లో చిక్కుకుంటున్నారు. ఇళ్లలోనూ, ఆస్పత్రులలోనూ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయి కొన్నాళ్లపాటు కరోనాతో పోరాడి విజేతలుగా తిరిగి వస్తున్నారు.
ఎస్పీ రాజకుమారి ఎదుట మోకరిల్లి నమస్కరిస్తూ పాట పాడుతున్న ఎఆర్ కానిస్టేబుల్ రాంబాబు
ఆ సమయంలో వీరి విధులను కూడా ఎస్పీ రాజకుమారి నిర్వహిస్తున్నారు. రేయింబవళ్లు వారి స్థానంలో తనే రోడ్ల మీద పహారా కాస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అదే సమయంలో సిబ్బంది బాగోగులను వీడియో, టెలీకాన్ఫరెన్సుల ద్వారా నిరంతరం తెలుసుకుంటున్నారు. తగిన సూచనలు ఇస్తూ ధైర్యాన్ని నింపుతున్నారు. ఆమె అందించిన తోడ్పాటుతో, ఇచ్చిన స్ఫూర్తితో మానసిక దృఢత్వాన్ని సాధించి జిల్లాలో దాదాపు నాలుగు వందల మంది పోలీసులు కరోనానుంచి బయటపడ్డారు. వాళ్లందర్నీ సత్కరించి, నిత్యావసర సరుకులు అందించి, తిరిగి విధులకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు ఎస్పీ రాజకుమారి. గతంలో ఎంతోమంది సమర్థులైన అధికారులను చూసి ఉండవచ్చు.. సిన్సియర్ ఆఫీసర్ల వద్ద పనిచేసి ఉండవచ్చు. కానీ.. ఈ కష్టకాలంలో అమ్మలా ఆదరిస్తున్న రాజకుమారి వంటి అధికారి దగ్గర పనిచేయడం తమ అదృష్టం అని విజయనగరం పోలీసులు భావిస్తున్నారు. – బోణం గణేష్, సాక్షి, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment