
సాక్షి,ముంబై: అప్పుల సంక్షోభంలో పడిదివాలా బాటపట్టిన అనిల్ అంబానీకి మరో షాక్ తగలనుంది. రుణ బకాయిలను తిరిగి సాధించుకునే పనిలో భాగంగా ఆస్తుల అమ్మకానికి ఆయా బ్యాంకులు సిద్ధ పడుతున్నాయి. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ (ఆర్‌సిఎల్) ఆస్తులు విక్రయానికి రంగం సిద్దం చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి, ఆసక్తి ఉన్నవర్గాలనుంచి బిడ్లను ఆహ్వానించినట్టు సమాచారం. దాదాపు 20వేల కోట్ల రూపాయల బకాయిల కోసం కీలక ఆస్తులను విక్రయించే ప్రక్రియను ప్రారంభించాయని సీఎన్‌బీసీ నివేదించింది.
ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లెండర్స్ తరపున ఈ ప్రక్రియను చూడనున్నాయి. ఆర్‌సీఎల్ రుణంలో 93 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న డిబెంచర్ హోల్డర్ల కమిటీ (కోడిహెచ్) శనివారం ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)లను ఆహ్వానించింది. ఈ బిడ్లను సమర్పించేందుకు తుది గడువు 2020 డిసెంబర్ ఒకటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ అనుబంధ సంస్థలలో ఆర్‌సిఎల్ వాటాల్లో కొంత భాగానికి లేదా మొత్తం విక్రయించనుంది. ఇందులో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 51 శాతం వాటా, రిలయన్స్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ ఫైనాన్షియల్ లిమిటెడ్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ అసెట్ రీ కన్‌స్ట్రక్షన్‌లో 49శాతం వాటా, ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 20 శాతం వాటా, రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాతోపాటు సంస్థ ఇతర ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను అమ్మి బకాయిగా జమ కట్టుకోనుంది. అయితే తాజా పరిణామంపై రిలయన్స్ స్పందించాల్సి ఉంది.
కాగా రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు రుణాలిచ్చిన అతిపెద్ద బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి. దివాలా కోడ్ సెక్షన్ 227 ప్రకారం చర్యలు తీసుకోవాలని రిజర్వుబ్యాంకును కోరగా, దీన్ని ఆర్బీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment