ఇన్వెస్టర్లూ... ఇలా చేయొద్దు!! | Investors do not do this! | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లూ... ఇలా చేయొద్దు!!

Published Mon, Sep 24 2018 12:27 AM | Last Updated on Mon, Sep 24 2018 10:40 AM

Investors do not do this! - Sakshi

‘‘గత ఏడాది కాలంలో మార్కెట్లు 20 శాతం ర్యాలీ చేశాయి. కానీ, నేను ఇన్వెస్ట్‌ చేస్తున్న మ్యూచువల్‌ ఫండ్‌ పథకం మాత్రం నష్టాలనే  చూపిస్తోంది’’ ఇదీ... ఢిల్లీకి చెందిన తరుణ్‌ ఆవేదన. మరి తరుణ్‌ విషయంలో ఏమై ఉంటుందని పరిశీలిస్తే... అతడు 2017 జులై నుంచి ప్రతి  నెలా ఓ లార్జ్‌క్యాప్‌ పథకంలో రూ.10,000, ఓ మిడ్‌క్యాప్‌ పథకంలో రూ.10,000 చొప్పున సిప్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేస్తూ వస్తున్నాడు. లార్జ్‌ క్యాప్‌ పథకంలో సగటున స్వల్ప రాబడులే ఉన్నాయి.

కానీ, ఇదే సమయంలో మిడ్‌క్యాప్‌ పథకంలో ఎక్కువ నష్టాలొచ్చాయి. దీంతో మొత్తం మీద వరుణ్‌ పెట్టుబడులపై నష్టాలే కనిపిస్తున్నాయి. ఏడాది, ఏడాదిన్నర కిందట సిప్‌ విధానంలో పెట్టుబడులు ప్రారంభించిన చిన్న ఇన్వెస్టర్లలో ఎక్కువ మందిది ఇదే పరిస్థితి. ప్రారంభంలో వీరు ఎంచుకున్న పథకాల పనితీరు బాగానే ఉంది. కానీ, గత ఆరు నెలలుగా మాత్రం పని తీరు ఆశాజనకంగా లేదు. బెంచ్‌ మార్క్‌ సూచీలతో పోలిస్తే పనితీరులో వెనుకబడే ఉన్నాయి. కాకపోతే, ఇన్వెస్టర్లు చేసే కొన్ని పొరపాట్లు సైతం నష్టాలకు కారణమవుతాయని చెబుతున్నారు నిపుణులు. వాటి వివరాలే ఈ ప్రాఫిట్‌ ప్లస్‌ కథనం...


కొన్ని నెలలుగా మార్కెట్ల ర్యాలీని గమనిస్తే... రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టీసీఎస్, ఐటీసీ వంటి షేర్లు మాత్రమే అసాధారణ రాబడులను ఇచ్చాయి. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ అన్నవి వైవిధ్యంతోనూ ఉంటాయి. ఇండెక్స్‌ స్టాక్స్‌తో పాటు, బయటి స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. అయితే, సూచీలో అధిక వెయిటేజీ కలిగిన ఈ స్టాక్స్‌ ర్యాలీ కారణంగా... సూచీలోని స్టాక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్‌ చేసే ఇండెక్స్‌ ఫండ్స్‌ పనితీరులో ముందు నిలిచాయి.

దీంతో పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ నుంచి, తక్కువ చార్జీలు, అధిక రాబడులు కనిపిస్తున్న ఇండెక్స్‌ ఫండ్స్‌లోకి మార్చుకోవాలని భావించడం సరికాదన్నది నిపుణుల అభిప్రాయం. ‘‘స్థిరమైన పనితీరు విషయంలో ఇండెక్స్‌ ఫండ్స్‌... యాక్టివ్‌ ఫండ్స్‌తో పోటీ పడే పరిస్థితి ఇంకా దేశీయ మార్కెట్లలో రాలేదు. కాబట్టి మంచి పోర్ట్‌ఫోలియోతో కూడిన యాక్టివ్‌ ఫండ్స్‌ మరికొన్నేళ్లు చక్కని పనితీరు చూపించగలవు’’ అని స్క్రిప్‌బాక్స్‌ సీవోవో సంజీవ్‌ తెలియజేశారు.

సిప్‌లు నిలిపివేయడం సరికాదు...
గత కొన్ని నెలల్లో మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ పెద్ద మొత్తంలో నష్టాల పాలయ్యాయి. గడిచిన ఏడాది కాలంలో సిప్‌ విధానంలో ఈ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారు తమ పెట్టుబడులపై ప్రస్తుతం నష్టాలనే చవిచూస్తున్నారు. దీంతో తమ పెట్టుబడులను నిలిపివేస్తున్నారు.

కానీ, ఇది తెలివైన చర్య కాదన్నది నిపుణుల మాట. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై గతంతో పోలిస్తే తక్కువ ఎన్‌ఏవీకే ఎక్కువ యూనిట్లను సొంతం చేసుకునేందుకు ఇది సరైన సమయమని వారు సూచిస్తున్నారు. కొంత కాలానికి సిప్‌ ద్వారా పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇస్తాయని పేర్కొంటున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసే వారు దాన్ని ఆపకుండా, కొనసాగించడమే మెరుగైన విధానం అన్నది నిపుణుల మాట.  

డెట్‌ ఫండ్స్‌ నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు...
నాలుగు సంవత్సరాల విరామం తర్వాత వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభమయ్యాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్‌పై ఈల్డ్‌ 8 శాతానికి చేరింది. దీంతో డెట్‌ ఫండ్స్‌ రాబడులపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక బాండ్‌ ఫండ్స్‌పై ఈ ప్రభావం ఉంది. ఇతర కేటగిరీల బాండ్‌ ఫండ్స్‌ రాబడులు 3–4 శాతం మధ్యే ఉన్నాయి. మరోవైపు బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లను పెంచుతున్నాయి.

చాలా బ్యాంకులు మూడేళ్ల కాలానికి డిపాజిట్లపై 7–7.5 శాతం మధ్య వడ్డీరేటును ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో అధిక వడ్డీ రేటును చూసి కొంత మంది ఇన్వెస్టర్లు బాండ్‌ ఫండ్స్‌ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేయాలని ఆలోచన చేయవచ్చు. కానీ, నిపుణులు మాత్రం ఇలా చేయవద్దని సూచిస్తున్నారు. బ్యాంకు డిపాజిట్లు నమ్మకమైన రాబడులను ఇస్తున్నాగానీ, వాటిపై పన్ను ప్రయోజనాలుండవు.

బ్యాంకు డిపాజిట్లపై ఆర్జించే ఆదాయం అంతా కూడా సంబంధిత వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారు ఏ శ్లాబ్‌ పరిధిలోకి వస్తే ఆ ప్రకారం పన్ను పడుతుంది. దీనికి బదులు ఇన్వెస్టర్లు షార్ట్‌ టర్మ్‌ లేదా లో డ్యురేషన్‌ డెట్‌ ఫండ్స్, ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. బాండ్‌ ఫండ్స్‌ పన్ను పరంగా మరింత సమర్థనీయమైనవి. మూడేళ్లకుపైగా వీటిని కొనసాగిస్తే... ఇండెక్సేషన్‌ ప్రయోజనంతో పాటు రాబడులపై 20 శాతమే పన్ను చెల్లిస్తే సరిపోతుంది.

స్వల్పకాల లక్ష్యాల కోసం సిప్‌!...
కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు గడిచిన రెండు, మూడేళ్ల కాలంలో మంచి రాబడులు ఇవ్వడాన్ని చూసి కొందరు ఇన్వెస్టర్లు ఆయా పథకాల్లో సిప్‌లు మొదలు పెడుతుంటారు. స్వల్ప కాలిక లక్ష్యాల కోసం, సత్వర రాబడుల కోసం ఆశించకుండా ఈ మార్గాన్ని ఆశ్రయించడం సరైనదే. ఎందుకంటే కొన్ని స్టాక్స్‌ విలువలు చారిత్రక గరిష్ట స్థాయిలకు చేరినందున స్వల్ప కాలంలో రాబడులు ఉండకపోవచ్చు. సిప్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేసే వారు కనీసం ఐదేళ్ల కాలం పాటు కొనసాగేందుకు సిద్ధపడాలని నిపుణుల సూచన.


డివిడెండ్‌ కోసం ఫండ్స్‌...
కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు క్రమం తప్పకుండా ఆదాయం కోసమని కొన్ని రకాల పథకాలను తీసుకొస్తుంటాయి. కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి డివిడెండ్‌ ఆదాయం అన్నది, తమ సొంత పెట్టుబడుల నుంచి చెల్లించేదన్న విషయాన్ని గమనించాలి.

ఇక ఈ డివిడెండ్‌పై ఇటీవలే 10 శాతం పన్ను అమల్లోకి వచ్చింది. కనుక డివిడెండ్‌ ఆదాయం అన్నది పన్ను పరంగా లాభసాటి కాదు. కనుక డివిడెండ్‌ చెల్లింపులను క్రమం తప్పకుండా ఆదాయం కింద పరిగణించే వారు మరోసారి పునరాలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో మిగుల నిధుల నుంచే ఈ డివిడెండ్‌ చెల్లింపులు చేయడం జరుగుతుంది. కనుక క్రమం తప్పకుండా, కచ్చితమైన డివిడెండ్‌ చెల్లింపులకు ఎటువంటి హామీ ఉండదని తెలుసుకోవాలి.


స్టాక్స్‌ పట్ల అతి విశ్వాసం వద్దు
స్టాక్‌ మార్కెట్లో అతివిశ్వాసం ప్రమాదకరం. అతి విశ్వాసం, లెక్కచేయని తనం ఉన్న వారితో పోలిస్తే తక్కువ ఆత్మవిశ్వాసం కలిగిన వారే స్టాక్‌ మార్కెట్లో తక్కువ తప్పిదాలు చేస్తుంటారు. పోర్ట్‌ఫోలియోకు రక్షణ కల్పించుకునేందుకు ఈక్విటీ, డెట్‌కు మధ్య శాతం వారీగా సమతూకం పాటించడమే ఉత్తమ మార్గం. అలాగే, రాబడుల ఆధారంగా... నిర్ణయించుకున్న శాతానికంటే విలువ తగ్గిన విభాగంలోకి పెట్టుబడులను పెంచుకోవడం చేస్తుండాలి’’ అని వ్యాల్యూ రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement