ఈ రోజైనా... రేపైనా... ఎప్పుడైనా మునిగిపోనిదే...‘సిప్‌’ | Mutual funds Values also went up greatly | Sakshi
Sakshi News home page

ఈ రోజైనా... రేపైనా... ఎప్పుడైనా మునిగిపోనిదే...‘సిప్‌’

Published Sun, Jun 18 2017 11:39 PM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

ఈ రోజైనా... రేపైనా... ఎప్పుడైనా మునిగిపోనిదే...‘సిప్‌’ - Sakshi

ఈ రోజైనా... రేపైనా... ఎప్పుడైనా మునిగిపోనిదే...‘సిప్‌’

దీర్ఘకాలంలో భారీ రాబడులకు అనువైన సాధనం
మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లతో సంబంధమే లేదు
గరిష్ఠ స్థాయిల్లో... బాగా పడినా ఎప్పుడైనా ఓకే
నిరంతరం సిప్‌ చేస్తూ వెళితే పెట్టుబడుల్లో సక్సెసే
ఇన్వెస్ట్‌మెంట్‌ ఆరంభించిన ధర రాకున్నా... లాభాలే  


అది 2007వ సంవత్సరం. స్టాక్‌ మార్కెట్లు మంచి పరుగుమీదున్నాయి. చాలా షేర్లు వాటి జీవితంలో ఎప్పుడూ చూడనంత స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. మ్యూచ్‌వల్‌ ఫండ్ల విలువలు కూడా భారీగా పెరిగాయి. ఎన్‌ఏవీలు గరిష్ఠ స్థాయిల్లో ఉన్నాయి. అప్పటికే స్టాక్‌ మార్కెట్లను నమ్ముకుని దీర్ఘకాలంగాపెట్టుబడి పెడుతూ వస్తున్న ఇన్వెస్టర్లు ఇంకొన్నాళ్లు కొనసాగిస్తే మరిన్ని
మంచి లాభాలు కళ్ల చూడొచ్చని ఎదురుచూస్తున్నారు. కాకపోతే అప్పటిదాకా స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులకు దూరంగా ఉండి... ఇతర పొదుపు సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్న పలువురి దృష్టి అప్పుడే స్టాక్‌ మార్కెట్‌పైకి మళ్లింది. ఇక ఇప్పుడు ఇన్వెస్ట్‌ చేయకపోతే జీవితంలో మళ్లీ ఇలాంటి అవకాశం రాదని చాలామంది  భావించారు. పెట్టుబడులు పెట్టడం మొదలెట్టారు.


ప్రసాద్, శేఖర్‌ ఇద్దరూ మంచి సంపాదనాపరులే. పొదుపరులే. అప్పటిదాకా పోస్టాఫీసు, బ్యాంకు డిపాజిట్లు అంటూ ఇన్వెస్ట్‌మెంట్లు చేసిన వారిద్దరూ... ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్‌ సలహాతో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు సిద్ధమయ్యారు. కాకపోతే ఇద్దరూ పొదుపరులే కానీ... ప్రసాద్‌కు కాస్త ఆశ అధికం. దీంతో అప్పటిదాకా తన డిపాజిట్లలో ఉన్న సొమ్ము మొత్తాన్ని విత్‌డ్రా చేసి... దాదాపు రూ.30 లక్షల మొత్తాన్ని అడ్వయిజర్‌ చెప్పిన ఒకే ఫండ్‌లో పెట్టుబడిగా పెట్టేశాడు ప్రసాద్‌. దాని ఎన్‌ఏవీ కూడా అప్పట్లో దాదాపు రూ.100కు అటూ ఇటూగా ఉంది.

శేఖర్‌ది అతిగా ఆశపడే మనస్తత్వం కాదు. అత్యాశకు పోకుండా డిపాజిట్లు అలాగే ఉంచి... వాటిపై నెలకు వచ్చే రూ.20,000 వడ్డీకి, తన జీతంలోంచి మరో రూ.10వేలు కలిపి నెలనెలా అదే ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయటం మొదలెట్టాడు. కొన్నాళ్లు బాగానే పెరిగాయి. కానీ 2008లో మార్కెట్ల పతనం మొదలైంది. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఆ పతనం దెబ్బకు... చాలా షేర్ల ధరలు పాతాళానికి పడిపోయాయి. మంచి కంపెనీలు కూడా దారుణంగా పడ్డాయి. ఫలితం... వీరు ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్లు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. దాదాపు ఆరు నెలల వ్యవధిలో శేఖర్, ప్రసాద్‌ ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్‌ ఎన్‌ఏవీ రూ.115 నుంచి ఏకంగా రూ.60కి పడిపోయింది. ఇద్దరూ కాస్త నిరాశపడ్డారు.

తక్కువ ధరలో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి లాభాలొస్తాయని భావించిన ప్రసాద్‌... అదే ఫండ్‌లో మరో రూ.20 లక్షలు తెచ్చి ఇన్వెస్ట్‌ చేశాడు. శేఖర్‌ మాత్రం తన సిప్‌ను కొనసాగిస్తూ వచ్చాడు. తరవాత ఆ ఫండ్‌ ఎన్‌ఏవీ తగ్గుతూ తగ్గుతూ చివరికి రూ.18కి కూడా వచ్చింది. ఇక భయం వేసిన ప్రసాద్‌... ఆ స్థాయిలో మరికొంత డబ్బులు పెట్టేంత ధైర్యం చేయలేకపోయాడు. శేఖర్‌ మాత్రం తన నెలనెలా ఇన్వెస్ట్‌ మొత్తాన్ని మరో రూ.5వేల వరకూ పెంచాడు. మార్కెట్లు నెమ్మదిగా కోలుకున్నాయి. ఆ ఫండ్‌ ఎన్‌ఏవీ కూడా పెరుగుతూ వచ్చింది. చివరకు 2017 జనవరిలో దాని ఎన్‌ఏవీ రూ.90 వద్దకు వచ్చింది.

 అంటే ప్రసాద్, శేఖర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించిన ఎన్‌ఏవీ రూ.100 కన్నా 10 రూపాయలు తక్కువే. అప్పుడు ఇద్దరూ ఒకసారి తమ ఇన్వెస్ట్‌మెంట్లు ఏ మేరకు పెరిగాయో చూసుకున్నారు. ప్రసాద్‌ అప్పటిదాకా రెండు విడతలుగా రూ.50 లక్షలు ఇన్వెస్ట్‌ చేశాడు. రూ.90 ఎన్‌ఏవీ వద్ద తన ఇన్వెస్ట్‌మెంట్‌ విలువ దాదాపు రూ.57 లక్షలుగా ఉంది. అంటే పదేళ్లు రూ.50 లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తే వచ్చిన లాభం... కేవలం రూ.7 లక్షలు. కనీసం బ్యాంకు డిపాజిట్లలో పెట్టినా రెట్టింపునకు పైగా పెరిగి ఉండేదని బాధపడ్డాడు ప్రసాద్‌.

మరి శేఖర్‌ పరిస్థితి చూస్తే... తను నికరంగా నెలనెలా రూ.30వేల చొప్పున ఇన్వెస్ట్‌ చేశాడు. మార్కెట్లు బాగా పతనమయ్యాక 2011లో దాన్ని మరో రూ.5వేలు పెంచాడు కూడా. నికరంగా చూస్తే తను ఇన్వెస్ట్‌ చేసింది 110 నెలల్లో 36 లక్షలు. తను పెట్టుబడి ప్రారంభించింది రూ.100 ఎన్‌ఏవీ వద్ద. అది ఇప్పటికీ రూ.90 దగ్గరే ఉంది. కానీ శేఖర్‌కు ఇన్వెస్ట్‌మెంట్లపై మంచి రాబడులొచ్చాయి. తన 36 లక్షలు కాస్తా రూ.1.3 కోట్లయ్యాయి. పైపెచ్చు తను బ్యాంకులో మొదట పెట్టిన డిపాజిట్లు అలాగే ఉన్నాయి.

అవి కూడా దాదాపు రూ.80 లక్షలకు చేరటంతో తన పెట్టుబడుల విలువ రూ.2 కోట్లు దాటేసింది. ఇది చూసిన ప్రసాద్‌ కంగుతిన్నాడు. తాను ఒకేసారి రూ.50 లక్షలు ఇన్వెస్ట్‌ చేసినా 7 లక్షలు మాత్రమే లాభం వచ్చిందని, ఆ ఫండ్‌ బాగా పెరగకపోయినా శేఖర్‌కు మాత్రం అంత లాభమెలా వచ్చిందని ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్‌ను ప్రశ్నించాడు. ఆ అడ్వయిజర్‌ ఇచ్చిన సమాధానమేంటో తెలుసా?

‘‘అదే బాబూ!! సిప్‌ మహిమ’’ అని.
నిజం... ఇదంతా సిప్‌గా పిలిచే సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌ ప్లాన్‌ మాయ.


ఆపకుండా కొనసాగిస్తే చాలు
పెట్టుబడులకు సంబంధించి ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలన్నది ఇబ్బంది కానే కాదు. చేయాల్సిందల్లా... సాధ్యమైనంత ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లడమే. పెట్టుబడులను ఆపకుండా కొనసాగించడమే. కొంతమంది ఈక్విటీ మార్కెట్లు పతనం అయిన సమయంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆపేస్తుంటారు. పెరిగినప్పుడు పెట్టుబడులు పెడుతుంటారు. ఇది ఏ మాత్రం సరైన విధానం కానే కాదు. ఎందుకంటే పతన సమయంలో మంచి షేర్లు కూడా తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయి. ఈ విధమైన సమస్యలకు పరిష్కారమే సిప్‌. తగినంత రక్షణతోపాటు సాధ్యమైనంత రాబడులకు సిప్‌ విధానంలో అవకాశం ఉంటుంది.

దీర్ఘకాలమైతే మరీ లాభం!
మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు సిప్‌ ఉత్తమ సాధనం. ఇది క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లిస్తుంది. మార్కెట్లు ఏ స్థాయిలో ఉన్నాయన్నదానితో సంబంధం లేకుండా పెట్టబడులు కొనసాగుతాయి. ఉదాహరణకు మార్కెట్లు హెచ్చు స్థాయిల్లో ఉన్నప్పుడు ఓ ఫండ్‌ యూనిట్‌ ఎన్‌ఏవీ రూ.20 ఉందనుకోండి. మీరు ప్రతి నెలా రూ.10వేలు సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారనుకుంటే 500 యూనిట్లు వస్తాయి. ఒకవేళ మార్కెట్లు కరెక్షన్‌కు గురై ఈ ఎన్‌ఏవీ మరుసటి నెలలో రూ.16కు తగ్గిందనుకోండి. అప్పుడు రూ.10,000కు 625 యూనిట్లు వస్తాయి. దీంతో సగటు కొనుగోలు ధర మార్కెట్‌ రేటు కంటే తక్కువే ఉంటుంది. దాంతో రాబడుల శాతం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు విక్రయించుకున్నా లాభాలను తీసుకోవచ్చు. దీంతో తక్కువలో కొని, ఎక్కువలో విక్రయించాలన్న లక్ష్యం సాకారమవుతుంది.

ఎప్పుడైనా ఇన్వెస్ట్‌ చేయొచ్చు...
ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నవారు మార్కెట్లు బాగా పెరిగి ఉన్నాయి కదా... కాస్త కరెక్షన్‌ వస్తే చేద్దామని చూస్తుంటారు. అవి ఒకోసారి పడకుండా అలా పెరిగిపోతూనే ఉంటాయి. అలాంటి సందర్భాల్లో సిప్‌ ఉత్తమం. ఎప్పుడు ఇన్వెస్ట్‌ చేయాలి, ఎప్పుడు చేయకూడదు... వంటివి సిప్‌ విషయంలో అవసరం లేదు. కొత్తగా పెట్టుబడులు మొదలు పెట్టిన వారైనా, ఇప్పటికే ఎంతో కాలంగా ఇన్వెస్ట్‌ చేస్తున్న వారైనా సిప్‌ విలువను పూర్తిగా అర్థం చేసుకోవాలి.

సంపద సృష్టి ఇలా...
సిప్‌ విధానంలో పొందే రాబడులు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయన్నది నిపుణులు ఘంటాపథంగా చెప్పే మాట. వ్యాల్యూ రీసెర్చ్‌ వ్యవస్థాపకుడు ధీరేంద్ర కుమార్‌ సిప్‌ మహత్తు గురించి చెప్పేందుకు ఓ నాలుగు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో గత 20 ఏళ్ల రాబడులను ఉదాహరణగా పేర్కొన్నారు. రూ.5,000 చొప్పున నెలనెలా ఇన్వెస్ట్‌ చేసి ఉంటే 20 ఏళ్లలో నికర పెట్టుబడి రూ.12 లక్షలు. కానీ రాబడులతో కలుపుకుంటే ఈ నిధి 20 ఏళ్ల తర్వాత రూ.1.21 కోట్ల నుంచి రూ.2.05 కోట్ల వరకు పథకాన్ని బట్టి వృద్ధి చెంది ఉండేది. అందుకే సాధ్యమైనంత ముందుగా పెట్టుబడులను ఆరంభించాలి. సిప్‌ విధానంలో పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. ఈ సూత్రాన్ని ఫాలో అయితే చాలు లక్ష్యాలకు తగ్గట్టు రాబడులను అందుకోవచ్చు.  

ఇది గమనించాలి సుమా!
ఇక్కడ ఇన్వెస్టర్లంతా గమనించాల్సిందొకటుంది. సిప్‌ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ విధానం మాత్రమే. సిప్‌ పద్ధతిలో పెట్టుబడులు పెట్టినంత మాత్రాన భారీ లాభాలు రావు. సిప్‌ చేయటానికి ఎంచుకున్న ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనమూ ఇక్కడ కీలకమే. మనం ఇన్వెస్ట్‌ చేయబోయే ఫండ్‌ తాలూకు చరిత్ర, సుదీర్ఘకాలంగా అవి ఇస్తున్న రాబడులు... అన్నీ చూశాకే  ఎంచుకోవాలి. మంచి ఫండ్‌ను ఎంచుకుంటే చక్కని రాబడులు అవే వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement