విఘ్నాలను తొలగించే వినాయకుడు ఆధ్యాత్మికంగానే కాకుండా మనం ఆర్థికంగా, పెట్టుబడులపరంగా కూడా ఎలా మసలుకోవాలో పాఠాలు నేర్పుతాడు. ఆయన గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన ఏనుగు తల జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. పెద్ద చెవులు దేన్నైనా ఏకాగ్రచిత్తంతో వినాల్సిన ఆవశ్యకతను సూచిస్తాయి. ఆయన శరీరం బలాన్ని, శక్తిని అలాగే ఆయన వాహనమైన ఎలుక.. నమ్రతను ప్రతిబింబిస్తాయి. వినాయకుడి విగ్రహం చూస్తే ఒక దంతం విరిగి ఉంటుంది.
పురాణాల ప్రకారం వేద వ్యాస మహర్షి, మహాభారతాన్ని రచించాలని సంకల్పించినప్పుడు .. తనకు వచ్చే ఆలోచనలను అంతే వేగంగా అక్షరబద్ధం చేయగలిగే వారు ఎవరు ఉన్నారని అన్వేషించాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని మహాగణపతిని కోరాడు. వినాయకుడు ఒక సాధారణ పక్షి ఈకతో రాయడానికి ఉపక్రమించగా, అది మధ్యలో విరిగిపోయింది. కానీ, మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపడానికి ఇష్టపడక, ఆయన తన దంతాన్ని విరిచి, దానితో రాయడాన్ని కొనసాగించాడని ప్రతీతి. ఆయన నిబద్ధత, అంకితభావం కారణంగానే మనకు అమూల్యమైన మహాభారతం లభించింది.
నిలకడతత్వం, అంకితభావంతో ఎలాంటి అవాంతరాలనైనా అధిగమించవచ్చని ఈ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. సాధారణంగా పెట్టుబడుల విషయంలోనూ, జీవితంలోనూ మనం ఎన్నింటినో చాలా ఆసక్తిగా ప్రారంభిస్తాం. కానీ ఏదైనా చిన్న అవాంతరం ఎదురుకాగానే వెంటనే విరమించుకుంటాం. ఉదాహరణకు, ఈ ఏడాది కచ్చితంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని తీర్మానించుకుని, ప్రతి ఏడాది జనవరి 1న జిమ్ మెంబర్షిప్ తీసుకుంటాం. కానీ మళ్లీ దైనందిన కార్యకలాపాల్లో మునిగిపోతాం. ఫిట్‌నెస్ లక్ష్యాన్ని అటకెక్కిస్తాం. పెట్టుబడుల విషయంలోనూ అలాగే చేస్తుంటాం.
ఏదో ఆర్థిక లక్ష్యం పెట్టుకుని పెట్టుబడుల ప్రస్థానం మొదలెడతాం. కానీ మార్కెట్లు ఏకాస్త ఒడిదుడుకులకు లోనైనా, పడిపోయినా వెంటనే మన సిప్‌లను ఆపేస్తాం. అంతేగాకుండా ముందుగానే మన పెట్టుబడులను వెనక్కి కూడా తీసేసుకుంటాం. సిప్‌లను మధ్యలోనే ఆపేయడం వల్ల మనకు రావాల్సిన ప్రయోజనాలు దక్కవు. అలా కాకుండా మిగతా సమస్యలు ఎన్ని ఎదురైనా మనం జిమ్‌కు మానకుండా వెళ్లడం కొనసాగించినా లేదా మార్కెట్ల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా పెట్టుబడులను కొనసాగించినా ఎలాంటి ఫలితాలు వచ్చి ఉండేవి? దీనిపై స్పష్టత కోసం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.
మార్కెట్లు పడిన వెంటనే ఎవరైనా తమ పెట్టుబడులను మధ్యలోనే ఆపేస్తే ఏం జరుగుతుంది, ఆపకుండా కొనసాగించి ఉంటే ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. 2018 సెప్టెంబర్ 1 నుంచి రాము ప్రతి నెలా రూ. 2,000 చొప్పున సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ప్రారంభించాడు. అయితే, 2020 మార్చిలో ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా పడిపోయాయి. అలాంటప్పుడు అతను తన పెట్టుబడులను మధ్యలోనే వెనక్కి తీసుకుని ఫిక్సిడ్ డిపాజిట్లలో పెట్టి ఉంటే ఏమై ఉండేది? అలా చేయకుండా పెట్టుబడులను కొనసాగించి ఉంటే ఎలా ఉండేది? ఒకసారి పరిశీలిద్దాం. (ఇందుకోసం నిఫ్టీ 50 టీఆర్ ఇండెక్స్‌ను ప్రామాణికంగా తీసుకుందాం.)
2023 ఆగస్టు 31 నాటి డేటా ప్రకారం మూలం:ఎన్‌ఎస్‌ఈ సూచీలు, ఎస్‌బీఐ వెబ్‌సైట్, అంతర్గత రీసెర్చ్
ఏ తుది మొత్తాన్ని 28–03–2020 నుంచి 3 ఏళ్లకు లెక్కించేందుకు ఎస్‌బీఐ ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు (5.7 శాతం) పరిగణనలోకి తీసుకున్నాం. చూశారుగా, 2020లో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ రాము తన సిప్‌ను కొనసాగించి ఉంటే ఇప్పుడది సుమారు రూ. 1.76 లక్షలు అయి ఉండేది. సంపద సృష్టిలో నిలకడగా వ్యవహరించడం ఎంత ముఖ్యమైనదో తెలుసుకోవడానికి ఇదో చిన్న ఉదాహరణ. కాబట్టి మిగతా పనులెన్ని వచ్చి పడినా జిమ్‌కు వెళ్లడం కొనసాగించి ఉన్నా, లేక మార్కెట్ హెచ్చుతగ్గులకు వెరవకుండా పెట్టుబడులను కొనసాగించి ఉన్నా ఏం జరిగి ఉండేది? మనం మరింత ఫిట్‌గా, మరింత ఆరోగ్యంగా ఉండేవాళ్లం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన పెట్టుబడుల విషయంలో జై గణేశా అంటూ ముందుకు సాగుదాం!
Comments
Please login to add a commentAdd a comment